సాక్షి, నూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం గురించి తనకేమీ తెలియదన్నప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. అలా కోరడంలో అర్థం లేదన్నారు. ‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా? చట్టాల్లో నిజాయితీపరులకే రక్షణ కల్పించారు. సెక్షన్ 17ఏ కూడా అలాంటివారి కోసమే’ అంటూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ప్రస్తావించారు.
‘స్కిల్ డెవలప్‌మెంట్’ స్కామ్‌లో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక... మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నేరం జరిగిందా? లేదా? అన్న అంశంపై కాకుండా టెక్నికల్‌గా చంద్రబాబు అరెస్టు చెల్లదు కాబట్టి కేసును కొట్టేయాలంటూ ఆయన లాయర్లు కోరటంతో శుక్రవారం కూడా ఈ విషయంపైనే వాదనలు కొనసాగాయి.
జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చింది. రెండు కేసుల విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
సవరణకు ముందు జరిగిన ఘటనకు పాత చట్టమే...
‘రద్దు చేసిన సెక్షన్ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చా అని ఈ ధర్మాసనం ఇదివరకు అడిగింది. సరిగ్గా ఇదే పాయింట్‌పై ఓ తీర్పు ఉంది’ అంటూ ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. 1947లో చట్టం రద్దు చేశాక దాంట్లోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయజాలరని ఎంసీ గుప్తా కేసులో పిటిషనర్ వాదించారన్నారు.
కానీ కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగిన విషయాన్ని కోర్టు గుర్తించిందని... చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగే నాటికి ఉన్న చట్టమే వర్తిస్తుందని తీర్పునిచ్చిందని చెప్పారు. సరిగ్గా చంద్రబాబు కేసులోనూ అంతే జరిగిందన్నారు. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని రోహత్గీ వివరించారు.
‘చట్ట సవరణలు సాధారణం. పాత చట్టాల్లో కొంత భాగం పోతుంది. కానీ సవరణకు ముందు జరిగిన ఘటనలకు మాత్రం ఆ పాత చట్టమే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ తేల్చి చెప్పారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు.
సుప్రీంకోర్టులో ఎన్నడూ ఇలా జరగలేదు...
దర్యాప్తు ప్రారంభించిన ఐదు–పది రోజుల్లోనే విచారణను అడ్డుకోవడానికి కోర్టు అంగీకరించే అవకాశం లేదని ముకుల్ రోహత్గీ చెప్పారు. హైకోర్టులో కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించి, అదే రోజున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. విచారణ ప్రారంభమైందనడానికి 2018 మే, జూన్ నెలల డాక్యుమెంట్లున్నాయని, వీటిని హైకోర్టుకు కూడా ఇచ్చామని, తమ వాదనలతో కోర్టు ఏకీభవించిందని చెప్పారు.
బాబుకు డబ్బు అందినట్లు ఎలా గుర్తించారు?
చంద్రబాబు అనుకున్నది జరిగితే దర్యాప్తు ప్రాథమిక దశలోనే నిలిచిపోతుందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయో చూడాలని రోహత్గీ కోరారు. ‘ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కోసం ప్రారంభమైంది. ఎలాంటి టెండర్ లేదు. సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయన్నది ఆలోచన’ అని రోహత్గీ చెబుతుండగా.. ఈ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నారని రోహత్గీ తెలిపారు.
చంద్రబాబుకు సొమ్ములు అందాయని ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సొమ్ములు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు, ఆయన పార్టీ ఖాతాలకు చేరాయని, అది ప్రజాధనమని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రోహత్గీ తెలిపారు. దీంతో మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ బోస్ పేర్కొంటూ మంగళవారానికి వాయిదా వేశారు.
అరెస్ట్ భయం ఉంది...
అనంతరం ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్‌పై లూథ్రా వాదనలు ప్రారంభించారు. ఒక కేసులో అరెస్టు చేశాక... పలు కేసులు తెరపైకి తెచ్చారన్నారు. 2021లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, తర్వాత ఏమీ జరగకున్నా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక సెప్టెంబరు 19న ఫైబర్‌నెట్ కేసులో నిందితుడిగా చేర్చి కోర్టు ముందు హాజరు కావాలని అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారన్నారు. పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు అనుమతించిందని, ఇప్పుడు అరెస్టు చేస్తారేమో అని లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు.
విచారణ పూర్తి చేశామంటున్నారని, ఇక్కడ కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, అయినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని లూథ్రా చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఇప్పటికే ముందస్తు బెయిలుపై బయట ఉన్నారని, మరో ముగ్గురు రెగ్యులర్ బెయిలుపై ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ కేసులోనూ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నిస్తూ.. షార్ట్ నోటీసు ఇచ్చి మంగళవారం విచారణ చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment