Rohatgi
-
ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా?
సాక్షి, నూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి తనకేమీ తెలియదన్నప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. అలా కోరడంలో అర్థం లేదన్నారు. ‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా? చట్టాల్లో నిజాయితీపరులకే రక్షణ కల్పించారు. సెక్షన్ 17ఏ కూడా అలాంటివారి కోసమే’ అంటూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ప్రస్తావించారు. ‘స్కిల్ డెవలప్మెంట్’ స్కామ్‌లో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక... మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నేరం జరిగిందా? లేదా? అన్న అంశంపై కాకుండా టెక్నికల్‌గా చంద్రబాబు అరెస్టు చెల్లదు కాబట్టి కేసును కొట్టేయాలంటూ ఆయన లాయర్లు కోరటంతో శుక్రవారం కూడా ఈ విషయంపైనే వాదనలు కొనసాగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చింది. రెండు కేసుల విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సవరణకు ముందు జరిగిన ఘటనకు పాత చట్టమే... ‘రద్దు చేసిన సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అని ఈ ధర్మాసనం ఇదివరకు అడిగింది. సరిగ్గా ఇదే పాయింట్‌పై ఓ తీర్పు ఉంది’ అంటూ ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. 1947లో చట్టం రద్దు చేశాక దాంట్లోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయజాలరని ఎంసీ గుప్తా కేసులో పిటిషనర్ వాదించారన్నారు. కానీ కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగిన విషయాన్ని కోర్టు గుర్తించిందని... చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగే నాటికి ఉన్న చట్టమే వర్తిస్తుందని తీర్పునిచ్చిందని చెప్పారు. సరిగ్గా చంద్రబాబు కేసులోనూ అంతే జరిగిందన్నారు. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని రోహత్గీ వివరించారు. ‘చట్ట సవరణలు సాధారణం. పాత చట్టాల్లో కొంత భాగం పోతుంది. కానీ సవరణకు ముందు జరిగిన ఘటనలకు మాత్రం ఆ పాత చట్టమే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ తేల్చి చెప్పారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నడూ ఇలా జరగలేదు... దర్యాప్తు ప్రారంభించిన ఐదు–పది రోజుల్లోనే విచారణను అడ్డుకోవడానికి కోర్టు అంగీకరించే అవకాశం లేదని ముకుల్ రోహత్గీ చెప్పారు. హైకోర్టులో కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించి, అదే రోజున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. విచారణ ప్రారంభమైందనడానికి 2018 మే, జూన్ నెలల డాక్యుమెంట్లున్నాయని, వీటిని హైకోర్టుకు కూడా ఇచ్చామని, తమ వాదనలతో కోర్టు ఏకీభవించిందని చెప్పారు. బాబుకు డబ్బు అందినట్లు ఎలా గుర్తించారు? చంద్రబాబు అనుకున్నది జరిగితే దర్యాప్తు ప్రాథమిక దశలోనే నిలిచిపోతుందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయో చూడాలని రోహత్గీ కోరారు. ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కోసం ప్రారంభమైంది. ఎలాంటి టెండర్ లేదు. సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయన్నది ఆలోచన’ అని రోహత్గీ చెబుతుండగా.. ఈ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నారని రోహత్గీ తెలిపారు. చంద్రబాబుకు సొమ్ములు అందాయని ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సొమ్ములు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు, ఆయన పార్టీ ఖాతాలకు చేరాయని, అది ప్రజాధనమని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రోహత్గీ తెలిపారు. దీంతో మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ బోస్ పేర్కొంటూ మంగళవారానికి వాయిదా వేశారు. అరెస్ట్ భయం ఉంది... అనంతరం ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్‌పై లూథ్రా వాదనలు ప్రారంభించారు. ఒక కేసులో అరెస్టు చేశాక... పలు కేసులు తెరపైకి తెచ్చారన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, తర్వాత ఏమీ జరగకున్నా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక సెప్టెంబరు 19న ఫైబర్‌నెట్ కేసులో నిందితుడిగా చేర్చి కోర్టు ముందు హాజరు కావాలని అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారన్నారు. పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు అనుమతించిందని, ఇప్పుడు అరెస్టు చేస్తారేమో అని లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి చేశామంటున్నారని, ఇక్కడ కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, అయినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని లూథ్రా చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఇప్పటికే ముందస్తు బెయిలుపై బయట ఉన్నారని, మరో ముగ్గురు రెగ్యులర్ బెయిలుపై ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ కేసులోనూ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నిస్తూ.. షార్ట్ నోటీసు ఇచ్చి మంగళవారం విచారణ చేపడతామన్నారు. -
హిమాచల్‌లో భారీగా కురుస్తున్న మంచు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం రొహ్‌తంగ్‌లో దట్టమైన మంచు కారణంగా అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కొందరు పర్యాటకులు అటల్ టన్నెల్ దాటి లాహౌల్ వైపు వెళ్లారు. సాయంత్రం తీవ్రంగా మంచు కురియడంతో తిరిగి మనాలీ రావడం వీలుపడక అక్కడే ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పర్యాటకులతో వస్తున్న వాహనాలు మంచు కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. బీఎస్ఎఫ్ సాయంతో రెండు బస్సులు సహా మొత్తం 70 వాహనాల ద్వారా పర్యాటకులను శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12.33 గంటల వరకు మనాలీకి తరలించడం పూర్తయిందని కుల్లు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. కాగా, టన్నెల్లో పోలీసులు ఓ పర్యాటకుడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులను శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్ టన్నెల్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. 10,040 అడుగుల ఎత్తులో 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం లాహౌల్–మనాలీలను కలుపుతుంది. -
ప్రజల నియంత్రణకు బలప్రయోగమే ఏకైక మార్గమా?
అవలోకనం ప్రభుత్వ న్యాయ సలహాదారు ప్రకారం మన సైన్యం చేసిన ఈ ఉల్లంఘన సరైందే. పైగా ఏసీల్లో్ల బతుకుతున్న భారతీయులు దేనిమీదైనా అభిప్రాయం చెప్పడానికి అనుమతి లేదన్నమాట. అంటే రోహత్గీ ఏసీని వాడలేదని, కాబట్టే ఆయన ఏది మాట్లాడటానికైనా అధికారం ఉందని మనం భావించాలి. ఈ బఫూన్ని ఎలా అటార్నీ జనరల్‌గా చేశారని నేను ఆశ్చర్యపోతుంటాను. విశ్రాంతి గదుల్లో స్వపక్షపాతంతో చేసే, అర్ధజ్ఞానపు వాదనలను పౌరులతో సంబంధాలను తెంచుకోవడానికి హేతువుగా చూపిస్తుండటమే ప్రమాదకరం. సైనిక వాహనంపై రాళ్లు విసురుతున్న ఆందోళనకారులకు వ్యతిరేకంగా ఒక కశ్మీరీ యువకుడిని మిలిటరీ జీప్ ముందు భాగంలో కట్టివేసి భారత సైనికులు అతడిని మానవ కవచంగా వాడుకున్న ఘటనపై ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ భారత అటార్నీ జనరల్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహా దారు ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. తమపైకి రాళ్లు విసురుతున్న వ్యక్తిని భారత సైనికులు సైనిక వాహనానికి కట్టివేసినట్లు ఇటీవల వార్త. ఈ అంశంపై రోహత్గీ ఎన్డీటీవీ న్యూస్ చానల్లో మాట్లాడుతూ ‘ప్రతిరోజూ జనం చస్తున్నారు కదా ఈ ఘటనపై అంత లొల్లి చేయడం ఎందుకు?’ అనేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆందోళనకారులతో కాకుండా ఉగ్రవాదులతో సైన్యం తలపడుతోంది. కాబట్టి వారిపట్ల కఠినంగానే వ్యవహరించాలి. మన సైన్యాన్ని చూసి గర్వించాలి. వారు తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చుని మీరు సైన్యాన్ని విమర్శిం చలేరు. దయచేసి మీరు ఆర్మీ పక్షం వహించండి. ఇదీ రోహత్గీ చేసిన వ్యాఖ్య. రోహత్గీ చెప్పిన విషయాన్ని చట్టపరమైన కోణం నుంచి పరిశీలిద్దాం. పౌరులుగా మనం ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చాం. హింసపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఇచ్చేశాం. గుత్తాధిపత్యం అంటే, ఎవరికైనా భౌతికంగా హాని కలి గించడానికి, రాజ్యం మాత్రమే చట్టపరమైన కర్తగా ఉంటుందని అర్థం. అందువల్లనే హత్య, అత్యాచారం వంటి నేరాలను ప్రభుత్వానికి వ్యతిరేక నేరాలుగా భావి స్తారు. ఇలాంటి నేరాలపై ప్రభుత్వమే విచారణ జరుపుతుంది. వీటిని కోర్టు వెలుపల పరిష్కరించుకోడానికి చర్చించలేము. నేరం చేసిన పౌరులను ఉరి తీయడం ద్వారా చట్టపరమైన హింసకు పాల్పడటానికి ప్రభుత్వం పూనుకుంటోంది. కానీ చట్టానికి అనుగుణంగానే దీన్ని చేపడతానని అది వాగ్దానం చేస్తుంది. తాము రాజ్యాంగాన్ని ఉల్లంఘించబోమంటూ ఎన్నికైన అధికారులందరూ ప్రమాణ స్వీకార సందర్భంగా నిష్టగా ప్రమాణం చేస్తారు. ప్రభుత్వం లేదా రాజ్యం తన ఏజెంట్ల ద్వారా ఈ వాగ్దానాన్ని చేస్తుంది. తర్వాతే అవసరమని భావించిన చోట హింసను ఉపయోగించడానికి ముందుకెళుతుంది. జనాలను అదుపులో ఉంచడం ద్వారా ప్రభుత్వ బలప్రయోగం తరచుగా మన అనుభవంలోకి వస్తుంటుంది. భారతీయులు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ యులు అందరికీ లాఠీ చార్జి అనే పదం సుపరిచితమైనదే. పౌరులు చాలా సంద ర్భాల్లో మంచిగా ఉండరనీ వారిని బలప్రయోగం ద్వారానే అదుపు చేయాల్సి ఉంటుందనీ మన ప్రభుత్వాలు గట్టి అభిప్రాయానికి వచ్చేశాయి. అందుకే సొంత పౌరులపై కాల్పులు జరపడం మన ప్రభుత్వానికి అసాధారణ విషయం కాదు. ఓహియో యూనివర్సిటీలో పోలీసులు కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను కాల్చి చంపిన ఘటన 1970లో వియత్నాం యుద్ధాన్ని మలుపు తిప్పిన అంశాల్లో ఒకటి. తమ ప్రభుత్వం సొంత పౌరులనే కాల్చి చంపుతుందన్న విషయం అనుభవంలోకి రావడంతో అమెరికన్లు నివ్వెరపోయారు. దీంతో ఆ ఘటన మర్చిపోలేని ఉదంతంగా మారింది. ఇక మన దేశంలో అయితే ప్రభుత్వం పౌరులను కాల్చి చంపడం సర్వసాధారణ విషయమైపోయింది. ఒక ఉదాహరణ.. ఇది 2016 అక్టోబర్ నాటి వార్త. జార్ఖండ్‌లోని హజారీబాగ్ సమీపంలోని చిరుదిహ్ గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా 40 మంది గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తన బొగ్గుగనుల కోసం భూసేకరణ జరపడంపై స్థానికులు అక్కడ నిరసన తెలుపుతున్నారు. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని కరన్పుర లోయలో ఒక బొగ్గు గని ప్రారంభించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ప్రతిపాదించింది. హజారీబాగ్ కాల్పులకు సంబంధించిన ఈ వార్తను ఆనాడు ఎంతమంది చదివారో నాకయితే తెలీదు. ఎందుకంటే భారత్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అదే కనుక సంపన్న నగర భారతీయులపై ఉగ్రవాద దాడి జరిగి ఉంటే, దీనికి సంబంధించిన వార్తను పాఠకులు వార్తాపత్రికలో లేదా టెలి విజన్‌లో చూసి ఉంటారు. కానీ తమ భూమిని లాక్కుంటున్నందుకు నిరసన తెలుపుతున్న పౌరులను ప్రభుత్వం చంపడం మీడియాకు పెద్ద సమస్య కాదు మరి. భారతీయ సైన్యం, పాకిస్తానీ సైన్యం చంపుతున్న ప్రజల్లో ఎక్కువమంది సొంత పౌరులే కావడం గమనార్హం. ఈశాన్య భారత్‌లో, జమ్మూకశ్మీరులో, ఆదివాసీలు నివసిస్తున్న బొగ్గు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో మన మిలటరీ, పారా మిలటరీ బలగాలు చాలామందిని కాల్చి చంపుతున్నాయి. మళ్లీ రోహత్గీ వ్యాఖ్యను చూద్దాం. ఆయన చెప్పిన దాంట్లో రెండు కీలకమైన అంశాలున్నాయి. రాళ్లు విసిరేవారితో సహా ఆందోళన చేస్తున్నవారందరూ ఉగ్రవాదులే. ఇక రెండోది. వీరు ఉగ్రవాదులు కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు సైన్యం చట్టాన్ని ఉల్లంఘించడం మంచిదే. ప్రభుత్వ న్యాయ సలహాదారు ప్రకారం మన సైన్యం చేసిన ఈ ఉల్లంఘన సరైందే. పైగా ఏసీల్లో్ల బతుకుతున్న భారతీయులు దేనిమీదైనా అభిప్రాయం చెప్పడానికి అనుమతి లేదన్నమాట. అంటే రోహత్గీ ఏసీని వాడలేదని, కాబట్టే ఆయన ఏది మాట్లాడటానికైనా అధికారం ఉందని మనం భావించాలి. ఈ బఫూన్ని ఎలా అటార్నీ జనరల్‌గా చేశారని నేను ఆశ్చర్యపోతుంటాను. పౌరులను సైనికవాహనానికి కట్టి తిప్పే ఇలాంటి చర్యలు మనకే ఎదురు తిరగవచ్చని మాజీ జనరల్స్ చెప్పారు. వారి అభిప్రాయం సరైందని భావిస్తున్నాను. భారత ప్రభుత్వం నిత్యం తన పౌరులతో సంబంధాలను తెంచుకుంటోంది. ఇదేం కొత్త విషయం కాదు. ఇక్కడ కొత్త విషయం ఏమిటంటే, విశ్రాంతి గదుల్లో స్వపక్షపాతంతో చేసే, అర్ధజ్ఞానపు వాదనలను పౌరులతో సంబంధాలను తెంచుకోవడానికి హేతువుగా చూపిస్తుండటమే. మనం నిజంగానే ఒక అంధకారభరితమైన, ప్రమాదకరమైన కాలంలో ఉంటున్నాం. భారత రాజ్యాంగ పరిరక్షణ గురించి ఆలోచించే మనలాంటి వారికి భయం కలుగుతోంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
విత్‌డ్రాకు సరిపడా నగదు లేదు
సుప్రీం కోర్టులో కేంద్రం వెల్లడి ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?: కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: ఎలాంటి అభ్యంతరం లేకుండా వారానికి బ్యాంకు ఖాతాదారుడు ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వారానికి రూ. 24 వేల పరిమితి ఉందని చెప్పినా... రూ. 8 వేలు, రూ. 10 వేలే ఇస్తున్నారని ఆక్షేపించింది. రద్దయిన నోట్ల రూపంలో ఎంత మొత్తం వచ్చింది? ఎంత మేర కొత్త నోట్లు ముద్రించారో చెప్పాలని ఆదేశించింది. ప్రజలు విత్‌డ్రా చేసుకునే మొత్తానికి సమానంగా ప్రభుత్వం వద్ద కరెన్సీ లేదని, సరిపడా నోట్లు ప్రింట్ కాలేదంటూ ప్రభుత్వం సమాధానమిచ్చింది. నోట్ల రద్దు, సహకార సంఘాలకు ఆంక్షలపై దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, డి.వై.చంద్రచూడ్‌ల బెంచ్ శుక్రవారం విచారించింది. పరిస్థితి చక్కపడేందుకు ఎంత సమయం అవసరమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 6 నెలలు పడుతుంది: చిదంబరం అటార్నీ జనరల్ రోహత్గీ సమాధానమిస్తూ... రద్దయిన నోట్ల రూపంలో రూ. 12 లక్షల కోట్లు వచ్చిందని, మరో లక్ష కోట్లు వస్తుందని చెప్పారు. రద్దయిన నోట్లలో 80 % తిరిగి ఖజానాకు చేరాయని, రూ. 3 లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయన్నారు. ఇంకా రూ. 9 లక్షల కోట్ల లోటు ఉందా? అంటూ కోర్టు ప్రశ్నించింది. కొంత అసౌకర్యం తప్పనిసరని, పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పిటిషనర్ తరఫు కపిల్ సిబల్ వాదిస్తూ... వాస్తవ పరిస్థితి ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉందని, బ్యాంకుల్లో నగదు లేదని అన్నారు. మాజీ ఆర్థిక మంత్రి, న్యాయవాది పి.చిదంబరం వాదిస్తూ... దేశంలోని ముద్రణా కేంద్రాలన్నీ కలిపి నెలకు రూ. 300 కోట్ల నగదునే ముద్రించగలవని, రద్దయిన ప్రతీ నోటును భర్తీ చేయాలంటే కనీసం 6 నెలలు పడుతుందన్నారు. సిబల్ జోక్యం చేసుకుంటూ చట్టబద్దమైన నా డబ్బును చట్టబద్ధంగా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించరా? అని ప్రశ్నించారు. అనుమతించరని రోహత్గీ చెప్పారు. ఎందుకు? అని సిబల్ ప్రశ్నించగా.. డబ్బు లేదు అని రోహత్గీ బదులిచ్చారు.