ప్రజల నియంత్రణకు బలప్రయోగమే ఏకైక మార్గమా?
అవలోకనం
ప్రభుత్వ న్యాయ సలహాదారు ప్రకారం మన సైన్యం చేసిన ఈ ఉల్లంఘన సరైందే. పైగా ఏసీల్లో్ల బతుకుతున్న భారతీయులు దేనిమీదైనా అభిప్రాయం చెప్పడానికి అనుమతి లేదన్నమాట. అంటే రోహత్గీ ఏసీని వాడలేదని, కాబట్టే ఆయన ఏది మాట్లాడటానికైనా అధికారం ఉందని మనం భావించాలి. ఈ బఫూన్‌ని ఎలా అటార్నీ జనరల్‌గా చేశారని నేను ఆశ్చర్యపోతుంటాను. విశ్రాంతి గదుల్లో స్వపక్షపాతంతో చేసే, అర్ధజ్ఞానపు వాదనలను పౌరులతో సంబంధాలను తెంచుకోవడానికి హేతువుగా చూపిస్తుండటమే ప్రమాదకరం.
సైనిక వాహనంపై రాళ్లు విసురుతున్న ఆందోళనకారులకు వ్యతిరేకంగా ఒక కశ్మీరీ యువకుడిని మిలిటరీ జీప్ ముందు భాగంలో కట్టివేసి భారత సైనికులు అతడిని మానవ కవచంగా వాడుకున్న ఘటనపై ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ భారత అటార్నీ జనరల్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహా దారు ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు.
తమపైకి రాళ్లు విసురుతున్న వ్యక్తిని భారత సైనికులు సైనిక వాహనానికి కట్టివేసినట్లు ఇటీవల వార్త. ఈ అంశంపై రోహత్గీ ఎన్డీటీవీ న్యూస్ చానల్‌లో మాట్లాడుతూ ‘ప్రతిరోజూ జనం చస్తున్నారు కదా ఈ ఘటనపై అంత లొల్లి చేయడం ఎందుకు?’ అనేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆందోళనకారులతో కాకుండా ఉగ్రవాదులతో సైన్యం తలపడుతోంది. కాబట్టి వారిపట్ల కఠినంగానే వ్యవహరించాలి. మన సైన్యాన్ని చూసి గర్వించాలి. వారు తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చుని మీరు సైన్యాన్ని విమర్శిం చలేరు. దయచేసి మీరు ఆర్మీ పక్షం వహించండి. ఇదీ రోహత్గీ చేసిన వ్యాఖ్య.
రోహత్గీ చెప్పిన విషయాన్ని చట్టపరమైన కోణం నుంచి పరిశీలిద్దాం. పౌరులుగా మనం ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చాం. హింసపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఇచ్చేశాం. గుత్తాధిపత్యం అంటే, ఎవరికైనా భౌతికంగా హాని కలి గించడానికి, రాజ్యం మాత్రమే చట్టపరమైన కర్తగా ఉంటుందని అర్థం. అందువల్లనే హత్య, అత్యాచారం వంటి నేరాలను ప్రభుత్వానికి వ్యతిరేక నేరాలుగా భావి స్తారు. ఇలాంటి నేరాలపై ప్రభుత్వమే విచారణ జరుపుతుంది. వీటిని కోర్టు వెలుపల పరిష్కరించుకోడానికి చర్చించలేము.
నేరం చేసిన పౌరులను ఉరి తీయడం ద్వారా చట్టపరమైన హింసకు పాల్పడటానికి ప్రభుత్వం పూనుకుంటోంది. కానీ చట్టానికి అనుగుణంగానే దీన్ని చేపడతానని అది వాగ్దానం చేస్తుంది. తాము రాజ్యాంగాన్ని ఉల్లంఘించబోమంటూ ఎన్నికైన అధికారులందరూ ప్రమాణ స్వీకార సందర్భంగా నిష్టగా ప్రమాణం చేస్తారు. ప్రభుత్వం లేదా రాజ్యం తన ఏజెంట్ల ద్వారా ఈ వాగ్దానాన్ని చేస్తుంది. తర్వాతే అవసరమని భావించిన చోట హింసను ఉపయోగించడానికి ముందుకెళుతుంది.
జనాలను అదుపులో ఉంచడం ద్వారా ప్రభుత్వ బలప్రయోగం తరచుగా మన అనుభవంలోకి వస్తుంటుంది. భారతీయులు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ యులు అందరికీ లాఠీ చార్జి అనే పదం సుపరిచితమైనదే. పౌరులు చాలా సంద ర్భాల్లో మంచిగా ఉండరనీ వారిని బలప్రయోగం ద్వారానే అదుపు చేయాల్సి ఉంటుందనీ మన ప్రభుత్వాలు గట్టి అభిప్రాయానికి వచ్చేశాయి. అందుకే సొంత పౌరులపై కాల్పులు జరపడం మన ప్రభుత్వానికి అసాధారణ విషయం కాదు.
ఓహియో యూనివర్సిటీలో పోలీసులు కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను కాల్చి చంపిన ఘటన 1970లో వియత్నాం యుద్ధాన్ని మలుపు తిప్పిన అంశాల్లో ఒకటి. తమ ప్రభుత్వం సొంత పౌరులనే కాల్చి చంపుతుందన్న విషయం అనుభవంలోకి రావడంతో అమెరికన్లు నివ్వెరపోయారు. దీంతో ఆ ఘటన మర్చిపోలేని ఉదంతంగా మారింది.
ఇక మన దేశంలో అయితే ప్రభుత్వం పౌరులను కాల్చి చంపడం సర్వసాధారణ విషయమైపోయింది. ఒక ఉదాహరణ.. ఇది 2016 అక్టోబర్ నాటి వార్త. జార్ఖండ్‌లోని హజారీబాగ్ సమీపంలోని చిరుదిహ్ గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా 40 మంది గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తన బొగ్గుగనుల కోసం భూసేకరణ జరపడంపై స్థానికులు అక్కడ నిరసన తెలుపుతున్నారు. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని కరన్‌పుర లోయలో ఒక బొగ్గు గని ప్రారంభించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ప్రతిపాదించింది.
హజారీబాగ్ కాల్పులకు సంబంధించిన ఈ వార్తను ఆనాడు ఎంతమంది చదివారో నాకయితే తెలీదు. ఎందుకంటే భారత్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అదే కనుక సంపన్న నగర భారతీయులపై ఉగ్రవాద దాడి జరిగి ఉంటే, దీనికి సంబంధించిన వార్తను పాఠకులు వార్తాపత్రికలో లేదా టెలి విజన్‌లో చూసి ఉంటారు. కానీ తమ భూమిని లాక్కుంటున్నందుకు నిరసన తెలుపుతున్న పౌరులను ప్రభుత్వం చంపడం మీడియాకు పెద్ద సమస్య కాదు మరి. భారతీయ సైన్యం, పాకిస్తానీ సైన్యం చంపుతున్న ప్రజల్లో ఎక్కువమంది సొంత పౌరులే కావడం గమనార్హం. ఈశాన్య భారత్‌లో, జమ్మూకశ్మీరులో, ఆదివాసీలు నివసిస్తున్న బొగ్గు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో మన మిలటరీ, పారా మిలటరీ బలగాలు చాలామందిని కాల్చి చంపుతున్నాయి.
మళ్లీ రోహత్గీ వ్యాఖ్యను చూద్దాం. ఆయన చెప్పిన దాంట్లో రెండు కీలకమైన అంశాలున్నాయి. రాళ్లు విసిరేవారితో సహా ఆందోళన చేస్తున్నవారందరూ ఉగ్రవాదులే. ఇక రెండోది. వీరు ఉగ్రవాదులు కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు సైన్యం చట్టాన్ని ఉల్లంఘించడం మంచిదే.
ప్రభుత్వ న్యాయ సలహాదారు ప్రకారం మన సైన్యం చేసిన ఈ ఉల్లంఘన సరైందే. పైగా ఏసీల్లో్ల బతుకుతున్న భారతీయులు దేనిమీదైనా అభిప్రాయం చెప్పడానికి అనుమతి లేదన్నమాట. అంటే రోహత్గీ ఏసీని వాడలేదని, కాబట్టే ఆయన ఏది మాట్లాడటానికైనా అధికారం ఉందని మనం భావించాలి. ఈ బఫూన్‌ని ఎలా అటార్నీ జనరల్‌గా చేశారని నేను ఆశ్చర్యపోతుంటాను. పౌరులను సైనికవాహనానికి కట్టి తిప్పే ఇలాంటి చర్యలు మనకే ఎదురు తిరగవచ్చని మాజీ జనరల్స్ చెప్పారు. వారి అభిప్రాయం సరైందని భావిస్తున్నాను. భారత ప్రభుత్వం నిత్యం తన పౌరులతో సంబంధాలను తెంచుకుంటోంది. ఇదేం కొత్త విషయం కాదు. ఇక్కడ కొత్త విషయం ఏమిటంటే, విశ్రాంతి గదుల్లో స్వపక్షపాతంతో చేసే, అర్ధజ్ఞానపు వాదనలను పౌరులతో సంబంధాలను తెంచుకోవడానికి హేతువుగా చూపిస్తుండటమే. మనం నిజంగానే ఒక అంధకారభరితమైన, ప్రమాదకరమైన కాలంలో ఉంటున్నాం. భారత రాజ్యాంగ పరిరక్షణ గురించి ఆలోచించే మనలాంటి వారికి భయం కలుగుతోంది.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com