కశ్మీర్‌లోయలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతోందని సుప్రీం కోర్టుకు కేంద్ర తెలిపింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత జరిగిన ఆందోళనలతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని విన్నవించింది. జూలై 9న 201 హింసాత్మక ఘటనలు జరిగితే ఆగస్టు మూడున 11 సంఘటనలు మాత్రమే నమోదు అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు వాస్తవ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఉంచింది. లోయలోని మూడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోందని, భద్రతా దళాలు పోలీసుల నిర్విరామ కృషితో పరిస్థితి మెరుగైందని నివేదికలో సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్ తర్వాత మొత్తం 872 హింసాత్మక సంఘటనలు జరగ్గా.. 42 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారని, 2656 మంది పౌరులు, 3783 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. 28 ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారని, 48 కార్యాలయాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.