విత్‌డ్రాకు సరిపడా నగదు లేదు
సుప్రీం కోర్టులో కేంద్రం వెల్లడి
► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?: కోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: ఎలాంటి అభ్యంతరం లేకుండా వారానికి బ్యాంకు ఖాతాదారుడు ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వారానికి రూ. 24 వేల పరిమితి ఉందని చెప్పినా... రూ. 8 వేలు, రూ. 10 వేలే ఇస్తున్నారని ఆక్షేపించింది. రద్దయిన నోట్ల రూపంలో ఎంత మొత్తం వచ్చింది? ఎంత మేర కొత్త నోట్లు ముద్రించారో చెప్పాలని ఆదేశించింది. ప్రజలు విత్‌డ్రా చేసుకునే మొత్తానికి సమానంగా ప్రభుత్వం వద్ద కరెన్సీ లేదని, సరిపడా నోట్లు ప్రింట్ కాలేదంటూ ప్రభుత్వం సమాధానమిచ్చింది. నోట్ల రద్దు, సహకార సంఘాలకు ఆంక్షలపై దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, డి.వై.చంద్రచూడ్‌ల బెంచ్ శుక్రవారం విచారించింది. పరిస్థితి చక్కపడేందుకు ఎంత సమయం అవసరమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
6 నెలలు పడుతుంది: చిదంబరం అటార్నీ జనరల్ రోహత్గీ సమాధానమిస్తూ... రద్దయిన నోట్ల రూపంలో రూ. 12 లక్షల కోట్లు వచ్చిందని, మరో లక్ష కోట్లు వస్తుందని చెప్పారు. రద్దయిన నోట్లలో 80 % తిరిగి ఖజానాకు చేరాయని, రూ. 3 లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయన్నారు. ఇంకా రూ. 9 లక్షల కోట్ల లోటు ఉందా? అంటూ కోర్టు ప్రశ్నించింది. కొంత అసౌకర్యం తప్పనిసరని, పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పిటిషనర్ తరఫు కపిల్ సిబల్ వాదిస్తూ... వాస్తవ పరిస్థితి ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉందని, బ్యాంకుల్లో నగదు లేదని అన్నారు.
మాజీ ఆర్థిక మంత్రి, న్యాయవాది పి.చిదంబరం వాదిస్తూ... దేశంలోని ముద్రణా కేంద్రాలన్నీ కలిపి నెలకు రూ. 300 కోట్ల నగదునే ముద్రించగలవని, రద్దయిన ప్రతీ నోటును భర్తీ చేయాలంటే కనీసం 6 నెలలు పడుతుందన్నారు. సిబల్ జోక్యం చేసుకుంటూ చట్టబద్దమైన నా డబ్బును చట్టబద్ధంగా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించరా? అని ప్రశ్నించారు. అనుమతించరని రోహత్గీ చెప్పారు. ఎందుకు? అని సిబల్ ప్రశ్నించగా.. డబ్బు లేదు అని రోహత్గీ బదులిచ్చారు.