చీఫ్ జస్టిస్ వర్సెస్ సెంటర్
చీఫ్ జస్టిస్ వర్సెస్ సెంటర్
Published Sat, Nov 26 2016 2:01 PM | Last Updated on Sun, Sep 2 2018 5:48 PM
జడ్జీల నియామకం విషయంలో న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైకోర్టులలో 500 వరకు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మండిపడ్డారు. ఈపాటికి పనిచేస్తూ ఉండాల్సిన 500 మంది జడ్జీలు పనిచేయడం లేదన్నారు. అసలు నియామకాలే జరగలేదని తాను అనట్లేదని.. ఇప్పటికి 121 మందిని నియమించారని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ భారీసంఖ్యలో ప్రతిపాదనలు పెండింగులోనే ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకుంటుందనే భావిస్తున్నానని చెప్పారు. అడ్వాన్స్ రూలింగ్ చైర్మన్ లేరని, సాయుధ దళాల అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని, కాంపిటీషన్ కమిషన్‌కు కూడా చైర్మన్ లేరని అన్నారు. కొంతమంది ఈ పదవులు చేపట్టడానికి నిరాకరిస్తున్న మాట వాస్తవమేనని.. ఎందుకంటే ప్రభుత్వం చైర్మన్లు కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం కూడా కల్పించలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాశానని.. నిబంధనలు మార్చాలని లేదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా ఇలాంటి నియామకాలకు అర్హులుగా చేయాలని చెప్పానన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ట్రిబ్యునళ్లకు అధ్యక్షత వహించేందుకు సుప్రీంకోర్టు జడ్జి ఒక్కరూ అందుబాటులో లేకపోవచ్చని ఆయన చెప్పారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. చీఫ్ జస్టిస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ జడ్జీల నియామకంలో మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేమని ఆయన అన్నారు. ఈ ఏడాదే తాము 120 మంది హైకోర్టు జడ్జీలను నియమించామని చెప్పారు.
Advertisement