Judges Appointments
-
హైకోర్టు జడ్జీలుగా ఐదుగురు
న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల్లో నియామకానికిగాను సుప్రీంకోర్టు కొలీజియం అయిదుగురు జడ్జీల పేర్లను ప్రతిపాదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో భేటీ అయిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫారసులను పంపించింది. కొలీజియంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఉన్నారు. జమ్మూ కశీ్మర్ అండ్ లద్దాఖ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ రాహుల్ భారతి, జస్టిస్ మోక్షా ఖజూరియా కజి్మలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియంకోరింది. బాంబే హైకోర్టులో అదనపు జడ్జి అభయ్ అహుజాను శాశ్వత న్యాయమూర్తిగా, కోల్‌కతా హైకోర్టు న్యాయాధికారి చైతలి చటర్జీ(దాస్)ను అదే హైకోర్టులో న్యాయమూర్తిగా, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయాధికారి అరవింద్ కుమార్ వర్మను అదే హైకోర్టులో జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. -
జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి కొలీజియం సిఫార్సు చేసిన జాబితా నుంచి కొంతమందిని మాత్రమే న్యాయమూర్తులుగా కేంద్రం ఎంపిక చేసుకుంటోందని సుప్రీంకోర్టు ఆరోపించింది. కొలీజియం సిఫారసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఈ విషయంలో కేంద్రం వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ తీవ్ర అసహనం వెలిబుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన పలు సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెట్టడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ‘‘ఈ పరిస్థితి చివరికి సర్వోన్నత న్యాయస్థానమో, కొలీజియమో దీనిపై కేంద్రానికి రుచించని నిర్ణయం తీసుకునేందుకు దారి తీయదనే మేం ఆశిస్తున్నాం’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం ఈ తీరుగా చేయడం చాలా సమస్యలకు దారి తీస్తోందని జస్టిస్ కౌల్ ఆందోళన వెలిబుచ్చారు. చదవండి: సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు ‘‘ఇది పదేపదే సమస్యగా మారుతోంది. దీన్ని మేం గతంలోనూ అటార్నీ జనరల్ దృష్టికి తీసుకొచ్చాం. కొన్ని సిఫార్సులను ఆమోదించి మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టడం న్యాయమూర్తుల సీనియారిటీ తదితర కీలక విషయాల్లో అనవసర సమస్యలకు తావిస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేంద్రం వ్యవహార శైలిని చూసి సీనియర్ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం కూడా లేదన్నారు. ‘‘కొన్ని సిఫార్సులను కేంద్రం వెంటనే ఆమోదిస్తోంది. అది అభినందనీయమే. కానీ చాలాసార్లు కొలీజియం సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే ఎంచుకుని ఆమోదిస్తుండటం ఆందోళనకరం. దయచేసి దీనికి అడ్డుకట్ట వేయండి’’ అని ఆటార్నీ జనరల్ వెంకట రమణికి సూచించారు. ఏ న్యాయమూర్తి ఏ హైకోర్టులో పని చేయాలన్నది న్యాయవ్యవస్థ నిర్ణయానికే వదిలేయడం సబబన్నారు. ఈ అంశంపై కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంతో సహనంతో వ్యవహరించిందని పిటిషనర్ తరఫున వాదించిన ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇక దీనిపై కోర్టే కేంద్రాన్ని ఆదేశించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేదంటే తామేం చేసినా చెల్లుతుందని అలుసుగా తీసుకునే ఆస్కారముందని చెప్పారు. దీనిపై గతంలోనే ఏజీని హెచ్చరించామని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఆయన హామీ ఇచ్చారని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. కేంద్రంతో లోతైన చర్చలకు మరింత సమయం కోరారన్నారు. కానీ ఆ తర్వాత కూడా కొలీజియం చేసిన ఇటీవలి సిఫార్సుల నుంచి కూడా కేంద్రం కొన్ని పేర్లనే ఎంచుకుని ఆమోదించిందంటూ అభ్యంతరం వెలిబుచ్చారు. దీనిపై విచారణను నవంబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. చదవండి: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం -
హైకోర్టు జడ్జీలుగా నలుగురి పేర్లు సిఫార్సు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు నలుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నూనేపల్లి హరినాథ్, న్యాయవాది మండవ కిరణ్మయి, ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న జగడం సుమతి, న్యాయవాదిగా ఉన్న న్యాపతి విజయ్ ఉన్నారు. ఈ నలుగురి పేర్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర తరువాత వీరి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా (ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి) నేతృత్వంలోని కొలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు సిఫారసు చేసింది. హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, ఎన్.రవిప్రసాద్, అశ్వత్థనారాయణ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కూడా ఈ పేర్లపై తమ అభిప్రాయాలు పంపారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ద్వారా రహస్య విచారణ జరిపి ఈ ఏడుగురి వివరాలు తెప్పించుకుంది. ఫిబ్రవరి నుంచి ఈ ఏడుగురి పేర్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఈ ఏడుగురి పేర్లను కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టుకు పంపింది. ఈ ఏడుగురి పేర్లపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అంతకుముందే ఈ ఏడుగురి గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గతంలో న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నవారి అభిప్రాయాలు కూడా తీసుకుంది. మంగళవారం జరిగిన కొలీజియం సమావేశంలో హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్ పేర్లకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులుగా ఈ నలుగురిని నియమించే విషయంలో వీరి నైతికనిష్ఠకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రతికూల నివేదికలు లేవని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నలుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం అయ్యేందుకు అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మాత్రం న్యాయపతి విజయ్ విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఏడుగురిలో మిగిలిన ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏమిటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. ప్రస్తుతం హైకోర్టులో సీజేతో సహా 27 మంది న్యాయమూర్తులున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిఫారసు చేసిన నలుగురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుకుంటుంది. నూనేపల్లి హరినాథ్ క్రిష్ణవేణి, బాలవెంకటరెడ్డి దంపతులకు 1972 జనవరి 12న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోటలో జన్మించారు. 1987లో 10వ తరగతి హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1989లో ఇంటర్ పూర్తిచేశారు. 1994లో ఏలూరు సి.ఆర్.రెడ్డి న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. అదే ఏడాది నవంబర్‌లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2000 సంవత్సరం నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ఎన్సీఎల్టీ, డీఆర్‌టీల్లో కూడా కేసులు వాదించారు. హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున వాదనలు వినిపించారు. 2001 నుంచి 2004 వరకు హైకోర్టు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2010–14 వరకు కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. 2012లో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2020 నుంచి హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మండవ కిరణ్మయి మండవ ఝాన్సీ, రామలింగేశ్వరరావు దంపతులకు 1970 జూలై 30న కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించారు. ప్రాథమిక విద్యను కృష్ణాజిల్లా మొవ్వ మండలం బార్లపూడిలోను, సెకండరీ విద్యను విజయవాడలోను పూర్తిచేశారు. సికింద్రాబాద్ వెస్లీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఇన్‌కంట్యాక్స్ కేసుల్లో మంచి పేరున్న జె.వి.ప్రసాద్ వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003లో ఆదాయపన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2016లో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఎక్కువగా ఇన్‌కంట్యాక్స్ సంబంధిత కేసులనే వాదించారు. ఐదువేలకు పైగా కేసుల్లో హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. మొత్తం 23 సంవత్సరాల అనుభవంలో 14 సంవత్సరాలు ఆదాయపన్ను శాఖకు న్యాయవాదిగా వ్యవహరించారు. న్యాపతి విజయ్ న్యాపతి ప్రమీల, సుబ్బారావు దంపతులకు 1974 ఆగస్టు 8న రాజమండ్రిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1997లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది.. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2012 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, పర్యావరణ సంబంధిత కేసుల్లో మంచిపట్టు సాధించారు. క్రికెట్ అంటే ఎంతో మక్కువ. న్యాయవాదుల తరఫున ఎన్నో టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు. జగడం సుమతి జానకి, లక్ష్మీపతి దంపతులకు 1971 జూన్ 28న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి లక్ష్మీపతి అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా పనిచేశారు. సోదరులు, సోదరీమణులు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాండువారిపేట గ్రామం. 1 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్ హోలీమేరి గరŠల్స్ హైస్కూల్లో చదివారు. ఇంటర్ జి.పుల్లారెడ్డి కాలేజీలో పూర్తిచేశారు. ఉస్మానియా వర్సిటీలో బీఏ పూర్తిచేసి, అదే వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయ వాది బొజ్జా తారకం వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. న్యాయవాది జి.వి.శివాజీ వద్ద కూడా జూనియర్‌గా పనిచేశారు. 2004–2009 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2019 లో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల కు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2020 నుంచి హైకోర్టులో జీపీగా కొనసాగుతున్నారు. -
Collegium Controversy: ఇబ్బందికరంగా కేంద్రం తీరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అష్నదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్ కౌల్ కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్ కౌల్ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. -
554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీయే
న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే.. రాజ్యాంగమే సర్వోన్నతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. ఓ లీగల్ వెబ్సైట్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్లమెంటు చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనే తనిఖీ బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ వల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్రత పోతుందనే భావనతో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించారని భావించరాదు’’ అని చెప్పారు. నిర్దిష్ట చట్టం, లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిన్నాయా, లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నింటిలోనూ పార్లమెంటే అత్యున్నతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జస్టిస్ లోకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మా సిఫార్సులను... పదేపదే తిప్పి పంపొద్దు..
న్యూఢిల్లీ: న్యాయమూర్తులుగా తాము చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పదేపదే తిప్పి పంపజాలదని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి స్పష్టం చేసింది. పలు హైకోర్టులకు న్యాయమూర్తులుగా ఇప్పటికే పలుమార్లు చేసిన ఐదు గత సిఫార్సులను తాజాగా మరోసారి కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం మంగళ, బుధవారాల్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీరిలో తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకున్న సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కృపాల్ కూడా ఉన్నారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న 2021 నవంబర్ 11 నాటి సిఫార్సును కొలీజియం తాజాగా పునరుద్ఘాటించింది. న్యాయవాదులు ఆర్.జాన్ సత్యంను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా, సోమశేఖర్ సుందరేశన్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి సిఫార్సు చేసింది. వీరితో పాటు అమితేశ్ బెనర్జీ, సఖ్య సేన్‌ను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా వెంటనే నియమించాలని కూడా పేర్కొంది. అలాగే కర్నాటక, అలహాబాద్, మద్రాస్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా మరో 20 పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో 17 మంది న్యాయవాదులు, ముగ్గు్గరు జడ్జిలున్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కొలీజియం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సిఫార్సులను కేంద్రం పదేపదే తిప్పి పంపడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. అమితేశ్, సేన్ పేర్లను కేంద్రం ఇప్పటికే రెండేసిసార్లు తిప్పి పంపింది. అమితేశ్ తండ్రి జస్టిస్ యు.సి.బెనర్జీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. గోధ్రాలో సబర్మతి రైలు ప్రమాదం వెనక కుట్ర కోణమేదీ లేదని తేల్చిన కమిషన్‌కు సారథి. ఇక సత్యం ప్రధాని మోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ విధానాలు, పథకాలపై సుందరేశన్ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని వారి పేర్లను కేంద్రం తిప్పి పంపింది. ఈ అభ్యంతరాలను కొలీజియం తాజాగా తోసిపుచ్చింది. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించడం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టేందుకు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. -
కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం
సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు. ఏమిటీ కొలీజియం...? సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి. ఏమిటీ వివాదం? 1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్ ఎ.ఎన్.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్ జడ్జెస్ కేసు (1981), సెకండ్ జడ్జెస్ కేసు (1993), థర్డ్ జడ్జెస్ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా ఏర్పాటైంది? పార్లమెంట్ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది. ప్రత్యామ్నాయముందా? కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్.దీనికి సీజేఐ చైర్‌పర్సన్‌గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్‌మెంట్ కమిషన్ చట్టం (2014) ద్వారా ఎన్ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది. కొలీజియంలో ప్రభుత్వ నామినీలు సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్ రమేశ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా?
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పనితీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ కొనసాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి చాలాసార్లు ఈ వ్యవస్థ పారదర్శకత గురించి చర్చ లేవదీశారు. మరోవైపు కొలీజియం కార్యాచరణలు అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం, నిష్పాక్షికత లోపించాయని మరో మాజీ జస్టిస్ కురియన్ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి పాత్ర లేకుండా కొలీజియం కొనసాగడంపై దాని ఏర్పాటుకు కారణమైన తీర్పునిచ్చిన మాజీ చీఫ్ జస్టిస్ వర్మ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీ జియం (తెలుగులో సలహా మండలి అనవచ్చు) వ్యవస్థ పరిపూర్ణమైనదేనా? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ ఇటీవలి ఇంటర్వ్యూలలో అదే చెబుతున్నారు. అదే సమయంలో, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో కొలీజియం అనేది అంతర్గతంగానే ఉందని ఆయన సూచించారు కూడా! అయితే ఈ రెండు అంశాల గురించి ఆయన చెప్పింది సరైం దేనా? దీనిపై ఒక సాధారణ పరిశోధన ఏం చెబుతోందో మీతో పంచుకోనివ్వండి. పైన పేర్కొన్న వాటిలో రెండో అంశాన్ని మొదటగా తీసు కుందాం. కొలీజియం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపర్చలేదు. మరీ ముఖ్యంగా, ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’(కన్కరెన్స్) అనే పదాన్ని జోడించడానికి జడ్జీల నియామక విధానంలో చేసిన సవరణను కూడా రాజ్యాంగ సభలో ఆనాడే ఓడించారు. అయితే 1993లో మాత్రమే సుప్రీంకోర్టు దీన్ని సాధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2)లో ప్రస్తావించిన ‘సంప్రదింపు’ అనే పదం ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’ అని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు ఇది చేయగలిగింది. ఈ రెండు పదాలకు ప్రతి నిఘంటువులోనూ వేర్వేరు అర్థాలున్నాయనే వాస్త వాన్ని అలా పక్కన పెట్టారు. కాబట్టి రాజ్యాంగంలో కొలీజియం అనే భావన కనీసంగా భాగం కానప్పుడు, దాని ప్రాథమిక స్వరూపంలోనే కొలీజియం వ్యవస్థ అంతర్గతంగా ఉందని చెబితే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది. దీనికి బదులుగా ఇది ‘హంప్టీ డంప్టీ సూత్రం’ మీద ఆధారపడి చేసినది. అంటే, ‘‘నేను ఒక పదం ఉపయోగిస్తున్నప్పుడు, అది నేను ఎంపిక చేసుకున్న విధంగానే దాని అర్థం ఉంటుంది’’ అనే సూత్రంపైనే కొలీజియం వ్యవస్థను గతంలో రూపొందించినట్లు కనిపిస్తుంది. ఇక పరిపూర్ణతకు సంబంధించిన ప్రశ్నకు వద్దాం. 2015 జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ కేసు సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, ‘‘కొలీజియం వ్యవస్థ కార్యాచరణలు నిస్సందేహంగా ప్రజలకూ, చరిత్రకూ కూడా అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయి’’ అని చెప్పారు. కాగా, జస్టిస్ కురియన్ కూడా ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం, నిష్పాక్షికత లోపించాయి’’ అని అంగీకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదని నమ్మలేదన్నమాట. దీనికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. న్యాయమూర్తులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు, లేదా వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటారు అనే ప్రమాణాల గురించి నిజంగానే మనకు తెలీదు. ఇక రెండో అంశం. కొలీజియం అనే న్యాయమూర్తుల నియామక వ్యవస్థ మూసిన తలుపుల వెనుక నడుస్తున్నందున అక్కడ తప్ప కుండా బంధుప్రీతికి అపార అవకాశం ఉంటుంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమ ఛాంబర్లోని జూనియర్లను, చివరకు తమ బంధువులను సైతం జడ్జీలుగా నియమించారని ఆరోపణలు రావ డంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తుల నాణ్యత మరో పెద్ద సమస్యగా ఉంటోంది. దీనిగురించి మొదలు పెట్టాలంటే, ఈ దేశం లోని అత్యుత్తమ న్యాయమూర్తులను కొలీజియం నిర్లక్ష్యం చేసింది. దీనికి జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా, జస్టిస్ అఖిల్ ఖురేషీ రెండు ఉదా హరణలుగా నిలుస్తారు. ఖురేషీ కేసు విషయానికి వస్తే, ఆయనను నియమించేంత వరకూ మరే ఇతర న్యాయమూర్తినీ నియమించ డానికి కూడా జస్టిస్ నారిమన్ తిరస్కరించారు. కానీ అది ఎన్నటికీ జరగలేదు. మరింత ఘోరమైన విషయం ఏమిటంటే, అర్హత లేని వ్యక్తులు తరచుగా న్యాయమూర్తులుగా నియమితులు కావడం. దీనికి అద్భుత మైన ఉదాహరణ జస్టిస్ కర్ణన్. చివరకు ఈయన జైలుపాలయ్యేంతగా అధోగతిపాలయ్యారు. అదే సమయంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షాల విషయానికి వస్తే, సిట్టింగ్ జడ్జిలుగా ఉండికూడా వారు బహిరంగంగానే ప్రధానమంత్రిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇది సుప్రీంకోర్టును తీవ్ర ఇబ్బందిలోకి నెట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి బలహీనతలతో కూడిన వ్యవస్థ పరిపూర్ణంగా ఉండగలదా? 1993లో కొలీజియం వ్యవస్థను రూపొందించడానికి మూలమైన తీర్పు చెప్పిన నాటి చీఫ్ జస్టిస్ వర్మ సైతం అలా భావించడం లేదు. ‘బీబీసీ హార్డ్ టాక్’ కోసం జస్టిస్ వర్మ 2004లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొలీజియం విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాననీ, కార్యనిర్వాహకవర్గమైన ప్రభుత్వా నికి కూడా పాత్ర కల్పించే జాతీయ న్యాయ కమిషన్‌ను తాను నమ్ము తున్నాననీ ఆయన అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి ఇదే ఉత్తమమార్గంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొలీ జియం రచయితే తన మనసు మార్చుకున్నప్పుడు, ఇక అలాంటి న్యాయ నియామకాల వ్యవస్థ పరిపూర్ణమైనదిగా ఉండగలదా? న్యాయచతురత కలిగిన అభ్యర్థులను ఉన్నత స్థానాల్లో న్యాయ మూర్తులుగా నిలిపినట్లయితే, కార్యనిర్వాహక వర్గం తన వ్యక్తిత్వం, సమగ్రత విషయంలో మరింత ఉత్తమంగా ఉండగలుగుతుందని జస్టిస్ వర్మ వాదించారు. కాబట్టే కొలీజియంలో ప్రభుత్వానికి కూడా తప్పకుండా పాత్ర కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వర్మ మరొక అడుగు ముందుకెళ్లారు. 1997లో, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పడు, కొలీజియం ఒక అభ్యర్థిని సిఫార్సు చేసింది. అయితే నిఘా సంస్థలు ఆయన పట్ల తీవ్ర అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయని నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ చెప్పగానే, జస్టిస్ వర్మ ఆ అభ్యర్థి పేరును వెనక్కు తీసుకున్నారు. పైగా తాను ఎందుకలా నిర్ణయం మార్చుకోవలసి వచ్చిందో తన తోటి అయి దుగురు న్యాయమూర్తులకు వివరించారు కూడా! వీరిలో తర్వాత ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. అయితే ఈ ముగ్గు రిలో ఒకరు జస్టిస్ వర్మ చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, ఆయన ఉపసంహరించిన వ్యక్తిని తిరిగి నామినేట్ చేశారు. అలా ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యేలా చూశారు. అంటే ఒక తప్పుడు వ్యక్తిని కూడా కొలీజియం నామినేట్ చేయగలదనడానికి ఇదే రుజువు అని వర్మ అన్నారు. ఇదేమీ ఏకైక ఉదాహరణ కాదని కూడా ఆయన కొనసాగించారు. ఈ అంశం వద్దే దీన్ని ముగించనివ్వండి. ఒక సాధారణమైన పరిశోధన బయటపెట్టిన వాస్తవాలను, ఆందోళనలను మీ ముందు ఉంచాను. నిస్సందేహంగానే ఇక్కడ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే నేను న్యాయవాదిని కానీ, న్యాయమూర్తిని కానీ కాదు కాబట్టి వాటి గురించి నేను జాగరూకతతో ఉండలేను. అయితే నేను ఈ కథనం ప్రారంభంలోనే వేసిన రెండు ప్రశ్నలను సమర్థిం చడానికి ఇది సరిపోతుంది మరి. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణ మైనదేనా? అది మన రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలోనే అంతర్గ తంగా ఉందని భావించవచ్చా? కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
న్యాయమూర్తులుగా 15 మంది
న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్ మహబూబ్ సుభానీ షేక్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్ నుంచి సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమైంది. కొలీజియం చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను బుధవారం రాత్రి అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 21 నెలల తర్వాత కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 25 మంది ఉన్నారు. బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య 10కి చేరింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదిస్తే న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. మొదటిసారి ముగ్గురు మహిళలు ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియమితురాలైన తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. కాబోయే తొలి మహిళా సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎనగలగుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగరత్న. ‘‘ఏదైనా బ్రాడ్‌కాస్టింగ్ చానల్ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లతో సంచలనాలను నిలిపివేయాలి’’ అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. బార్ నుంచి తొమ్మిదో న్యాయవాది కొలీజియం సిఫార్సు చేసిన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కోదండరామయ్య కుమారుడు పీఎస్ నరసింహ. ఆయన హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన ఆయన పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్‌మాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్ రామచంద్రదాస్ తరఫున పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్ క్యూరీగా సేవలందించారు. బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి న్యాయవాది జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ కూడా 13వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ కూడా 2014లో బార్ నుంచి సుప్రీం కోర్టు న్యాయయూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. నాలుగో తరం న్యాయవాది తమ పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ నాలుగో తరంలో న్యాయవాది వృత్తి చేపట్టారు జస్టిస్ విక్రమ్‌నాథ్. గుజరాత్‌లోని కౌశంబి జిల్లాకు చెందిన ఆయన అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 10న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆన్లైన్ ద్వారా కోర్టు కార్యకలాపాలు చేపట్టి లైవ్ స్ట్రీమ్‌కు జస్టిస్ విక్రమ్ నాథ్ నాంది పలికారు. జస్టిస్ హిమా కోహ్లి ప్రస్థానం జస్టిస్ హిమా కోహ్లి 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సహా పలు విభాగాలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీలో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి 2007 ఆగస్టు 29న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే 2024 సెప్టెంబర్ వరకు సేవలు అందించనున్నారు. -
కొలీజియం నిర్ణయాల్లో గోప్యత అవసరమే
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. జడ్జీలుగా నియమించాలని సిఫారసు చేసేందుకు కొలీజియం తిరస్కరించిన వారికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను వెల్లడించనక్కరలేదన్నారు. ఈ మేరకు బుధవారం పీటీఐ వార్తాసంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవంబర్ 18న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. కేవలం సమాచారం తెలుసుకోవాలన్న పౌరుల కోరిక తీర్చడం కోసం వ్యక్తుల ప్రతిష్టకు సంబంధించిన విషయాన్ని బహిర్గత పరచడం సరికాదని తన అభిప్రాయమని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. న్యాయమూర్తులిచ్చే తీర్పులపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కూడా జస్టిస్ బాబ్డే తప్పుపట్టారు. అలాంటి విమర్శలతో చాలామంది న్యాయమూర్తులు ఆవేదన చెందుతుంటారన్నారు. ‘ఉదాహరణకు.. ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంజడ్జీగా పదోన్నతి కల్పించాలనుకుని, ఆ తరువాత పరిశీలనలో తమకందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు జడ్జీగా ఆయన సరికాదని కొలీజియం నిర్ణయిస్తుంది. ముందుగా, ఆయన పేరును పరిశీలించడం ఎందుకు? ఆ తరువాత పదోన్నతికి పనికిరాడని నిర్ణయించి, ఆ విషయాన్ని బహిర్గం చేయడం ఎందుకు? ఆ జడ్జీ ఆ తరువాత కూడా ఆ హైకోర్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కదా! అతనికి అది ఇబ్బందికరంగా ఉండదా?’ అని ప్రశ్నించారు. వారిని బాధపెట్టడం సరికాదన్నారు. -
జడ్జీలను పెంచండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై గొగోయ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. ఈ సందర్భంగా హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలని సూచించారు.‘సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం. మీకు(మోదీకి) గుర్తుందనుకుంటా. 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత అంటే 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల కోర్టు మెట్లు ఎక్కే ప్రజలకు నిర్ణీత సమయంలోగా న్యాయం దొరుకుతుంది’ అని లేఖలో గొగోయ్ తెలిపారు. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. హైకోర్టుల్లో తీవ్రమైన కొరత.. హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోందని జస్టిస్ గొగోయ్ ప్రధాని మోదీకి రాసిన తన రెండో లేఖలో తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. శక్తివంచనలేకుండా కృషి చేస్తే తప్పించి ఈ ఖాళీలను భర్తీచేయడం సాధ్యం కాదు. అలాగే హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మిమ్మల్ని(ప్రధాని) కోరుతున్నా. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి. గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘాలు కూడా దీన్ని సూచించాయి’ అని జస్టిస్ గొగోయ్ వెల్లడించారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన మరో లేఖలో కోరారు. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలని సూచించారు. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుందని పేర్కొన్నారు. -
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టుకు బిఎస్ భానుమతి, సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, ఎం వెంకటరమణ, ఏ. హరిహరనాథ శర్మలను నియమించాలని సిఫార్సు చేసింది. ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా శ్రీసుధ, సుమలత, ఎన్ తుకారాంజీల పేర్లను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. కాగా, ఏపీ నూతన హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి విక్రమ్ నాధ్‌ను కొలీజియం ఇటీవల ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
30 రోజుల్లో 33 మంది జడ్జీల నియామకం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో జడ్జీల నియామక వేగం పెరిగింది. జస్టిస్ గొగోయ్ గతనెల 3న 46వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 30 రోజుల్లో ఆయన ఆరు సార్లు కొలీజియం భేటీని నిర్వహించారు. కొలీజియంలో సీజేఐతో కలుపుకుని ఐదుగురు జడ్జీలున్నారు. కలకత్తా, బాంబే, సిక్కిం, గౌహతి, ఉత్తరాఖండ్ హైకోర్టులకు ప్రధాన జడ్జీలను కొలీజియం నియమించింది. బాంబే, కలకత్తా హైకోర్టుల్లోనే న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఎన్‌హెచ్ పాటిల్, డీకే గుప్తాలను అవే హైకోర్టుల ప్రధాన జడ్జీలుగా నియమించేందుకు ఎంవోపీ (మెమరాండం ఆఫ్ ప్రొసీజర్)ను కొలీజియం వినియోగించింది. సాధారణంగా ఇలా చేయడం అరుదు. కర్ణాటక, కేరళ, మద్రాస్, గౌహతి, మధ్యప్రదేశ్, కలకత్తా, పంజాబ్, హరియాణ, అలహాబాద్, ఒడిశా, ఉత్తరాఖండ్ హైకోర్టులకు కొత్త జడ్జీల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది. -
దిగువ కోర్టులకు జడ్జీల్ని నియమించండి
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులను కేంద్రం కోరింది. నియామకానికి సంబంధించి త్వరితగతిన పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా 2.76 కోట్ల కేసులు జిల్లా, దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ‘జిల్లా, దిగువ కోర్టులకు సంబంధించి 2013లో మంజూరు చేసిన 19,158 పోస్టుల సంఖ్యను ఈ ఏడాది జూన్ నాటికి 22,444 వరకు పెంచాం. 2018 జూన్ 30 నాటికి 17,221 మంది జడ్జీలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 5,223 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
జడ్జీల నియామకంపై తకరారు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకానికి సంబంధించి న్యాయవ్యవస్థకు–కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకంపై శుక్రవారం సుప్రీంకోర్టు సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లు ఎన్ని కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ గుప్తా బెంచ్ అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. ఎన్ని పేర్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుంటానని ఏజీ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మీరు చెప్పే మాట ‘తెలుసుకుంటాను’ అనడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుల్లో 40 వరకూ ఖాళీలు ఉంటే కొలీజియం 3 పేర్లే సిఫార్సు చేసిందని, మరిన్ని పేర్లను సిఫార్సు చేయాలని ఏజీ అన్నారు. కొలీజియం సిఫార్సు చేస్తే ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కొలీజియం సిఫార్సులు లేకుండా కేంద్రం ఏమీ చేయలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తాము సిఫార్సులు చేశామని, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ యాకూబ్ మీర్.. మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ రామలింగం పేర్లను ప్రతిపాదించామని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని పేర్కొంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. వారి నియామకానికి సంబంధించి అతి త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన బెంచ్.. ఎంత త్వరగా.. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. తన కేసును మణిపూర్ హైకోర్టు నుంచి గౌహతి హైకోర్టుకు బదిలీ చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల అంశం తీవ్రంగా ఉందని ధర్మాసనం గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు కేసుల బదిలీ కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఢిల్లీ వచ్చి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.. స్వతంత్రత ప్రజాస్వామ్య పునాది న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటని సుప్రీంకోర్టు తాజా మాజీ న్యాయమూర్తి ఆర్కే అగర్వాల్ అన్నారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి∙సీజేఐ జస్టిస్ మిశ్రా, ఇతర సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు. -
మధ్యంతర ఏర్పాట్లు చేయండి
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మధ్యంతర ఏర్పాట్లు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. ట్రిబ్యునళ్లలో జడ్జీల నియామకాలు, వారి పదవీకాలం తదితరాలకు సంబంధించిన ఆర్థిక చట్టం–2017 రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ వచ్చిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంలో విచారణ ఇంకా కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ట్రిబ్యునళ్లలో న్యాయమూర్తుల నియామకాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయాలనీ, ఇందుకోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం కోరింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదావేసింది. -
గోప్యత వీడిన కొలీజియం
పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొం టున్న కొలీజియం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న గోప్యతకు ముగింపు పలకాలని నిర్ణయించి, కొత్తగా నియ మించిన తొమ్మిదిమంది న్యాయమూర్తుల ఎంపికకు, కొందరిని నిరాకరించడానికి గల కారణాలను వెల్లడించింది. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించు కునే కొలీజియం వ్యవస్థ ఏర్పడి ఇరవై మూడేళ్లవుతోంది. ఇందులో ఏమాత్రం పారదర్శకత లేదని, ఎంపికవుతున్నవారికుంటున్న అర్హతలేమిటో, తిరస్కరణలకు గల కారణాలేమిటో తెలియడం లేదని పలువురు న్యాయకోవిదులు, ప్రజాస్వామిక వాదులు చాన్నాళ్లుగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు సరేసరి... వాటి మాట చెల్లు బాటు కావడం లేదు గనుక సహజంగానే గుర్రుగా ఉంటున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని గతంలో యూపీఏ ప్రభుత్వం కొంతవరకూ ప్రయత్నించింది. కానీ ఈలోగానే దాని పదవీకాలం ముగిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ విష యంలో చాలా పట్టుదలతో ప్రయత్నించింది. జాతీయ న్యాయ నియామకాల కమి షన్(ఎన్‌జేఏసీ) చట్టం అమల్లోకి తెచ్చింది. అందుకోసం 99వ రాజ్యాంగ సవర ణను కూడా తెచ్చింది. అయితే 2015 అక్టోబర్‌లో ఆ రెండింటినీ మెజారిటీ తీర్పుతో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అనంతరకాలంలో న్యాయమూర్తుల నియామకాలు జరగకపోలేదుగానీ... అవి గతంలోవలే చురుగ్గా లేవు. ఈ విషయంలో కొలీజియం చేసిన అనేక సిఫార్సులు గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ పడ్డాయి. వివిధ హైకోర్టుల్లో దాదాపు 400 న్యాయమూర్తుల పదవులు భర్తీకావాల్సి ఉంది. అపరిష్కృత కేసుల సంఖ్య పెరుగుతుండగా ఎన్నాళ్లిలా న్యాయమూర్తుల నియామకాలపై సాచివేత ధోరణి అనుసరిస్తారని గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ పలు సందర్భాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక సందర్భంలో ఆయన కంటతడి కూడా పెట్టారు. న్యాయవ్యవస్థతో ఘర్షణ తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నిచేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కొలీజియం వ్యవస్థపై దేశంలో మొదటినుంచీ భిన్నా భిప్రాయాలున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల మాట చెల్లుబాటు కావడం ప్రారంభమైతే అది న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారితోపాటు పలు వురు న్యాయవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల ప్రమేయంలేని నియామకాల ద్వారా వచ్చిన న్యాయమూర్తులైతే నిష్పాక్షికంగా, తటస్థంగా వ్యవహరిస్తారని వాదించారు. ప్రభుత్వాల ప్రమేయం సంగతలా ఉంచి ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలూ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తుంటే ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే తనను తాను ఎందుకు మినహాయించుకోవాలని కొలీ జియం విమర్శకుల ప్రశ్న. ఎవరిదాకానో ఎందుకు... కొలీజియం వ్యవస్థకు ఆద్యు డైన జస్టిస్ జేఎస్ వర్మే అనంతరకాలంలో తన నేతృత్వంలోని ధర్మాసనం ఉద్దేశిం చింది ఒకటైతే, జరుగుతున్నది మరొకటని వ్యాఖ్యానించిన సంగతి మర్చి పోకూడదు. కొలీజియం లోపాలు వెలుగులోకి తెచ్చిన ఘనత జస్టిస్ చలమేశ్వర్కే దక్కు తుంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని, రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ తీర్పునిచ్చినవారు జస్టిస్ చలమేశ్వర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులుండే కొలీజియంలో ఆయన సభ్యులు కూడా. కొలీజియం తీరుతెన్నుల పట్ల అసంతృప్తి వ్యక్తంచేసి, దాని సమా వేశాలకు హాజరుకాబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన నిరుడు సెప్టెంబర్‌లో లేఖ రాశాక ఆ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొలీజియం పనితీరులో పారదర్శకత కొరవడుతున్నదని, మినిట్స్ లేకపోవడంవల్ల భేటీలకు అర్ధం లేకుండా పోతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఆయన చెప్పే వరకూ న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియకు సంబంధించి రికార్డు ఉండదన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇటీవల కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయంత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాక కూడా కొలీజియంపై విమర్శ లొచ్చాయి. అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉండగా ఆయన్ను ‘ప్రభుత్వ ప్రమేయం’తో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారని ఆరోపిస్తూ కర్ణా టక, గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బహుశా కొలీజియం నిర్ణయాలను, అందుకు గల కారణాలను బహిరంగపర్చాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఈ నిరసనల పర్యవసానంగానే భావించి ఉంటారు. కేరళ హైకోర్టుకు ముగ్గుర్ని, మద్రాస్ హైకోర్టుకు ఆరుగురిని న్యాయ మూర్తులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాలను, అందుకు అనుసరించిన విధా నాన్ని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఎవరెవరిని ఎందుకు కాదన వలసివచ్చిందో కూడా వివరించింది. ఆ రెండు రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన సిఫార్సులపై ఆ న్యాయస్థానాల్లో పనిచేసి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా ఉంటున్నవారి అభిప్రాయాలను కొలీజియం తెలుసుకున్నదని, వాటి ఆధా రంగా నిర్ణయానికొచ్చిందని తెలిపింది. అయితే తిరస్కృతులపై వచ్చిన ఫిర్యాదులే మిటి... కొందరిపై ఏ ప్రాతిపదికన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రతికూల అభి ప్రాయాన్ని వ్యక్తం చేశారు... జాబితాలోనివారిపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివే దికల్లోని అంశాలేమిటన్న జోలికిపోలేదు. ఆమేరకు ఇది అసంపూర్ణమనే చెప్పాలి. మొత్తానికి కొలీజియం పనితీరులో పారదర్శకత తీసుకొచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించినందుకు స్వాగతించాలి. ఇది సాధ్యమయ్యేందుకు దోహదపడిన జస్టిస్ చలమేశ్వర్నూ, న్యాయవాదులనూ అభినందించాలి. -
కొలీజియం నిర్ణయాలు వెబ్సైట్లో
న్యూఢిల్లీ: జడ్జీల నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన నిర్ణయాలను, ఇతర సమాచారాన్ని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరచాలని కొలీజియం నిర్ణయించింది. ‘ఇకపై మేము తీసుకునే నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచుతాం. జడ్జీల పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వాలకు చేసే సిఫార్సులు, బదిలీలు, హైకోర్టులకు సీజేల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జీల పదోన్నతులు ఒక్కో దానికి సంబంధించిన విధాన ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. ఆ సమాచారమంతా అందుబాటులోకి వస్తుంది’ అని కొలీజియం పేర్కొంది. ఇందులో భాగంగా జస్టిస్ అశోక్ మీనన్, జస్టిస్ ఆని జాన్, జస్టిస్ నారాయణ పిషారదిలు కేరళ హైకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారన్న సమాచారం సైట్లో పొందుపరిచారు. -
మీ ప్రతిపాదనలను ఆమోదించలేం..
⇒ జడ్జీల నియామకాల విధివిధానాల మార్పునకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత ⇒ మా సిఫారసును జాతీయ భద్రతా కారణంతో తిరస్కరించలేరు ⇒ ఆధారాలిస్తే మేమే ఆ పని చేస్తాం.. మీకు వీటో అధికారం ఇవ్వలేం ⇒ అలా ఇస్తే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది ⇒ ఎంఓపీపై కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఏళ్లతరబడి కొనసాగుతూ వస్తున్న కొన్ని విధివిధానాల్ని మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన పలు సూచనలను, ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని కొలీజియం తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా న్యాయ మూర్తుల పోస్టుకు సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరి పేరునైనా జాతీయ భద్రత కారణంతో తిరస్కరించే వెసులుబాటు తమకు కల్పించా లన్న కేంద్ర సూచనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. అలాగే న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లపై పరిశీలన జరిపేందుకు శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలన్న సూచననూ తిరస్కరిం చింది. న్యాయమూర్తుల మీద వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు కొలీజియంలో సభ్యులు కాని ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననూ తోసిపుచ్చింది. అయితే న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారి వయోపరిమితి విషయంలో మాత్రం కేంద్రం సిఫారసులను ఆమోదించింది. ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి లేఖద్వారా తెలియచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజియం వ్యవస్థకు స్వస్తి పలికే దిశగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను కేంద్రం తీసుకురావడం, దీనిపై పిటిషన్ దాఖలవగా.. ఎన్‌జేఏసీ చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం విదితమే. కొలీజియమే న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విధివిధానాల తాలూకు మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు కేంద్రం ఎంఓపీని తయారుచేసి సుప్రీంకోర్టు కొలీజియం ముందుంచింది. ఈ ఎంఓపీపై కేంద్రానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో న్యాయమూర్తుల నియామకాల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకుంది. ఎంఓపీపై జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీజే జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై కేంద్రం చేసిన పలు సూచనలు, ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించి తీరాల్సిందే.. న్యాయమూర్తుల పోస్టుకు తాము సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరైనా వ్యక్తి నియామకం జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉందని కేంద్రం భావిస్తే, అందుకు ఆధారాలను తమ ముందుంచితే కొలీజియం వాటిని ఎన్నటికీ పక్కనపెట్టదని తెలిపింది. కానీ జాతీయ భద్రతా కారణంతో కేంద్రం తమ సిఫారసులను వీటో చెప్పడానికి వీల్లేదని కొలీజియం తేల్చిచెప్పింది. ఇందుకు అనుమతినిస్తే న్యాయ నియామక ప్రక్రియ మొత్తం రాజకీయజోక్యంతో నిండిపోతుందని తన అభిప్రాయాన్ని కేంద్రానికి స్పష్టంచేసింది. అలాగే న్యాయమూర్తుల పేర్లపై విచారణ జరిపేందుకు ఎన్నో ఏళ్లనుంచి అనుసరిస్తూ వస్తున్న విధానం సక్రమంగానే ఉందని, అందువల్ల శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు ఎంతమాత్రం అవసరం లేదంది. కొలీజియం తన సిఫారసులను మరోసారి కేంద్రానికి పంపినప్పుడు వాటిని కేంద్రం తప్పనిసరిగా ఆమోదించి తీరాల్సిందేనని కూడా స్పష్టంచేసింది. వయోపరిమితికి పచ్చజెండా.. న్యాయమూర్తుల నియామకాలకు పరిగణనలోకి తీసుకునే న్యాయవాదుల కనీస, గరిష్ట వయస్సుల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు కొలీజియం పచ్చజెండా ఊపింది. కనీసం 45 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉన్న న్యాయవాదినే న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. జల్లా జడ్జీల కోటా నుంచి న్యాయమూర్తిగా నియమించే వ్యక్తి గరిష్ట వయస్సు 58 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదననూ కొలీజియం ఆమోదిం చింది. ఇప్పుడు దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. -
చీఫ్ జస్టిస్ వర్సెస్ సెంటర్
జడ్జీల నియామకం విషయంలో న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైకోర్టులలో 500 వరకు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మండిపడ్డారు. ఈపాటికి పనిచేస్తూ ఉండాల్సిన 500 మంది జడ్జీలు పనిచేయడం లేదన్నారు. అసలు నియామకాలే జరగలేదని తాను అనట్లేదని.. ఇప్పటికి 121 మందిని నియమించారని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ భారీసంఖ్యలో ప్రతిపాదనలు పెండింగులోనే ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకుంటుందనే భావిస్తున్నానని చెప్పారు. అడ్వాన్స్ రూలింగ్ చైర్మన్ లేరని, సాయుధ దళాల అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని, కాంపిటీషన్ కమిషన్‌కు కూడా చైర్మన్ లేరని అన్నారు. కొంతమంది ఈ పదవులు చేపట్టడానికి నిరాకరిస్తున్న మాట వాస్తవమేనని.. ఎందుకంటే ప్రభుత్వం చైర్మన్లు కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం కూడా కల్పించలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాశానని.. నిబంధనలు మార్చాలని లేదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా ఇలాంటి నియామకాలకు అర్హులుగా చేయాలని చెప్పానన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ట్రిబ్యునళ్లకు అధ్యక్షత వహించేందుకు సుప్రీంకోర్టు జడ్జి ఒక్కరూ అందుబాటులో లేకపోవచ్చని ఆయన చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. చీఫ్ జస్టిస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ జడ్జీల నియామకంలో మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేమని ఆయన అన్నారు. ఈ ఏడాదే తాము 120 మంది హైకోర్టు జడ్జీలను నియమించామని చెప్పారు.