సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు నలుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నూనేపల్లి హరినాథ్, న్యాయవాది మండవ కిరణ్మయి, ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న జగడం సుమతి, న్యాయవాదిగా ఉన్న న్యాపతి విజయ్ ఉన్నారు.
ఈ నలుగురి పేర్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర తరువాత వీరి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా (ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి) నేతృత్వంలోని కొలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు సిఫారసు చేసింది. హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, ఎన్.రవిప్రసాద్, అశ్వత్థనారాయణ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది.
రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కూడా ఈ పేర్లపై తమ అభిప్రాయాలు పంపారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ద్వారా రహస్య విచారణ జరిపి ఈ ఏడుగురి వివరాలు తెప్పించుకుంది. ఫిబ్రవరి నుంచి ఈ ఏడుగురి పేర్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఈ ఏడుగురి పేర్లను కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టుకు పంపింది. ఈ ఏడుగురి పేర్లపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
అంతకుముందే ఈ ఏడుగురి గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గతంలో న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నవారి అభిప్రాయాలు కూడా తీసుకుంది. మంగళవారం జరిగిన కొలీజియం సమావేశంలో హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్ పేర్లకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులుగా ఈ నలుగురిని నియమించే విషయంలో వీరి నైతికనిష్ఠకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రతికూల నివేదికలు లేవని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నలుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం అయ్యేందుకు అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మాత్రం న్యాయపతి విజయ్ విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఏడుగురిలో మిగిలిన ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏమిటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. ప్రస్తుతం హైకోర్టులో సీజేతో సహా 27 మంది న్యాయమూర్తులున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిఫారసు చేసిన నలుగురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుకుంటుంది.
నూనేపల్లి హరినాథ్
క్రిష్ణవేణి, బాలవెంకటరెడ్డి దంపతులకు 1972 జనవరి 12న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోటలో జన్మించారు. 1987లో 10వ తరగతి హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1989లో ఇంటర్ పూర్తిచేశారు. 1994లో ఏలూరు సి.ఆర్.రెడ్డి న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. అదే ఏడాది నవంబర్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2000 సంవత్సరం నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు.
ఎన్‌సీఎల్‌టీ, డీఆర్‌టీల్లో కూడా కేసులు వాదించారు. హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున వాదనలు వినిపించారు. 2001 నుంచి 2004 వరకు హైకోర్టు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2010–14 వరకు కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. 2012లో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2020 నుంచి హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మండవ కిరణ్మయి
మండవ ఝాన్సీ, రామలింగేశ్వరరావు దంపతులకు 1970 జూలై 30న కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించారు. ప్రాథమిక విద్యను కృష్ణాజిల్లా మొవ్వ మండలం బార్లపూడిలోను, సెకండరీ విద్యను విజయవాడలోను పూర్తిచేశారు. సికింద్రాబాద్ వెస్లీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
ఇన్‌కంట్యాక్స్ కేసుల్లో మంచి పేరున్న జె.వి.ప్రసాద్ వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003లో ఆదాయపన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2016లో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఎక్కువగా ఇన్‌కంట్యాక్స్ సంబంధిత కేసులనే వాదించారు. ఐదువేలకు పైగా కేసుల్లో హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. మొత్తం 23 సంవత్సరాల అనుభవంలో 14 సంవత్సరాలు ఆదాయపన్ను శాఖకు న్యాయవాదిగా వ్యవహరించారు.
న్యాపతి విజయ్
న్యాపతి ప్రమీల, సుబ్బారావు దంపతులకు 1974 ఆగస్టు 8న రాజమండ్రిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1997లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది.. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2012 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, పర్యావరణ సంబంధిత కేసుల్లో మంచిపట్టు సాధించారు. క్రికెట్ అంటే ఎంతో మక్కువ. న్యాయవాదుల తరఫున ఎన్నో టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు.
జగడం సుమతి
జానకి, లక్ష్మీపతి దంపతులకు 1971 జూన్ 28న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి లక్ష్మీపతి అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా పనిచేశారు. సోదరులు, సోదరీమణులు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాండువారిపేట గ్రామం. 1 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్ హోలీమేరి గరŠల్స్ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్ జి.పుల్లారెడ్డి కాలేజీలో పూర్తిచేశారు.
ఉస్మానియా వర్సిటీలో బీఏ పూర్తిచేసి, అదే వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయ వాది బొజ్జా తారకం వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. న్యాయవాది జి.వి.శివాజీ వద్ద కూడా జూనియర్‌గా పనిచేశారు. 2004–2009 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2019 లో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల కు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2020 నుంచి హైకోర్టులో జీపీగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment