Andhra pradesh high court judge
-
హైకోర్టు జడ్జీలుగా నలుగురి పేర్లు సిఫార్సు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు నలుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నూనేపల్లి హరినాథ్, న్యాయవాది మండవ కిరణ్మయి, ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న జగడం సుమతి, న్యాయవాదిగా ఉన్న న్యాపతి విజయ్ ఉన్నారు. ఈ నలుగురి పేర్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర తరువాత వీరి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా (ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి) నేతృత్వంలోని కొలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు సిఫారసు చేసింది. హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, ఎన్.రవిప్రసాద్, అశ్వత్థనారాయణ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కూడా ఈ పేర్లపై తమ అభిప్రాయాలు పంపారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ద్వారా రహస్య విచారణ జరిపి ఈ ఏడుగురి వివరాలు తెప్పించుకుంది. ఫిబ్రవరి నుంచి ఈ ఏడుగురి పేర్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఈ ఏడుగురి పేర్లను కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టుకు పంపింది. ఈ ఏడుగురి పేర్లపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అంతకుముందే ఈ ఏడుగురి గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గతంలో న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నవారి అభిప్రాయాలు కూడా తీసుకుంది. మంగళవారం జరిగిన కొలీజియం సమావేశంలో హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్ పేర్లకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులుగా ఈ నలుగురిని నియమించే విషయంలో వీరి నైతికనిష్ఠకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రతికూల నివేదికలు లేవని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నలుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం అయ్యేందుకు అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మాత్రం న్యాయపతి విజయ్ విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఏడుగురిలో మిగిలిన ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏమిటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. ప్రస్తుతం హైకోర్టులో సీజేతో సహా 27 మంది న్యాయమూర్తులున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిఫారసు చేసిన నలుగురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుకుంటుంది. నూనేపల్లి హరినాథ్ క్రిష్ణవేణి, బాలవెంకటరెడ్డి దంపతులకు 1972 జనవరి 12న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోటలో జన్మించారు. 1987లో 10వ తరగతి హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1989లో ఇంటర్ పూర్తిచేశారు. 1994లో ఏలూరు సి.ఆర్.రెడ్డి న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. అదే ఏడాది నవంబర్‌లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2000 సంవత్సరం నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ఎన్సీఎల్టీ, డీఆర్‌టీల్లో కూడా కేసులు వాదించారు. హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున వాదనలు వినిపించారు. 2001 నుంచి 2004 వరకు హైకోర్టు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2010–14 వరకు కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. 2012లో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2020 నుంచి హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మండవ కిరణ్మయి మండవ ఝాన్సీ, రామలింగేశ్వరరావు దంపతులకు 1970 జూలై 30న కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించారు. ప్రాథమిక విద్యను కృష్ణాజిల్లా మొవ్వ మండలం బార్లపూడిలోను, సెకండరీ విద్యను విజయవాడలోను పూర్తిచేశారు. సికింద్రాబాద్ వెస్లీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది.. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఇన్‌కంట్యాక్స్ కేసుల్లో మంచి పేరున్న జె.వి.ప్రసాద్ వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003లో ఆదాయపన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2016లో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఎక్కువగా ఇన్‌కంట్యాక్స్ సంబంధిత కేసులనే వాదించారు. ఐదువేలకు పైగా కేసుల్లో హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. మొత్తం 23 సంవత్సరాల అనుభవంలో 14 సంవత్సరాలు ఆదాయపన్ను శాఖకు న్యాయవాదిగా వ్యవహరించారు. న్యాపతి విజయ్ న్యాపతి ప్రమీల, సుబ్బారావు దంపతులకు 1974 ఆగస్టు 8న రాజమండ్రిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1997లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది.. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2012 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, పర్యావరణ సంబంధిత కేసుల్లో మంచిపట్టు సాధించారు. క్రికెట్ అంటే ఎంతో మక్కువ. న్యాయవాదుల తరఫున ఎన్నో టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు. జగడం సుమతి జానకి, లక్ష్మీపతి దంపతులకు 1971 జూన్ 28న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి లక్ష్మీపతి అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా పనిచేశారు. సోదరులు, సోదరీమణులు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాండువారిపేట గ్రామం. 1 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్ హోలీమేరి గరŠల్స్ హైస్కూల్లో చదివారు. ఇంటర్ జి.పుల్లారెడ్డి కాలేజీలో పూర్తిచేశారు. ఉస్మానియా వర్సిటీలో బీఏ పూర్తిచేసి, అదే వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయ వాది బొజ్జా తారకం వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. న్యాయవాది జి.వి.శివాజీ వద్ద కూడా జూనియర్‌గా పనిచేశారు. 2004–2009 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2019 లో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల కు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2020 నుంచి హైకోర్టులో జీపీగా కొనసాగుతున్నారు. -
త్వరలో పేపర్‌లెస్ కోర్టులు
సాక్షి, విశాఖపట్నం: సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కోర్టులు త్వరలోనే కాగిత రహిత(పేపర్ లెస్) న్యాయస్థానాలుగా మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం విశాఖ జిల్లా కోర్టుల సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బాంబే హైకోర్టులో చాలామంది అడ్వొకేట్లు ఐప్యాడ్స్ ద్వారా తమ కేసులపై వాదోపవాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో టెక్నాలజీని అన్ని కోర్టులు క్రమంగా అందిపుచ్చుకుంటున్నాయని, రాష్ట్రంలోనూ ఆ తరహా విధానం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందుకే న్యాయవాదులు, న్యాయమూర్తులు సాంకేతికను అందిపుచ్చుకుని, సవాళ్లని ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యాయస్థానాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసే కక్షిదారులకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలోని అన్ని కోర్టులపై సమగ్ర నివేదిక సిద్ధం చేసిందని, న్యాయస్థానాల ఆధునికీకరణ, కొత్త భవనాల నిర్మాణం, కోర్టుల్లో ఏసీ సౌకర్యంతోపాటు అన్ని మౌలిక వసతులు సమకూర్చేందుకు త్వరలోనే టెండర్లు పిలవనుందని చీఫ్ జస్టిస్ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కోర్టు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్టోబర్ 30 నాటికి 5 భవనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కక్షిదారులకు కోర్టు నియమాలు తెలియవని, కోర్టులో ఏమైనా తప్పుగా ప్రవర్తించినా వారికి నియమనిబంధనలు తెలియజేసి, వారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అడ్వొకేట్స్ ప్రాక్టీస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ ఫండ్ అందించడం చాలా ఊరటనిచ్చే అంశమని అన్నారు. విశాఖ కాస్మోపాలిటిన్ నగరమని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందువరసలో ఉన్న విశాఖ... రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలతో పోల్చితే కమర్షియల్ హబ్‌గా మారుతోందన్నారు. ఈ సందర్భంగా విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీమలపాటి రవి, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఆలపాటి గిరిధర్, విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతపల్లి రాంబాబు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
తనపై రెండు కేసులు కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్లు
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది ఉమేష్‌చంద్ర చెప్పారు. దీంతో ఈ వ్యాజ్యాలను మరో న్యాయమూర్తి ముందుంచేందుకు ఫైళ్లను సీజే ముందుంచాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు.. -
తెనాలిలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ ను బుధవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప హాజరయ్యారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ..మైనార్టీ తీరని మహిళలపై జరిగే అత్యాచారాలను అత్యంత త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చూడాలని అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు భావిస్తున్నాయని చెప్పారు. పోక్సో నేరాలను తీవ్రమైనవిగా పరిగణించి సత్వర న్యాయం చేయాలన్న సంకల్పంతో సాధ్యమైనన్ని ఎక్కువ పోక్సో కోర్టులను అవసరమైన ప్రదేశాల్లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గుంటూరులో పోక్సో కోర్టు ఉన్నప్పటికీ తెనాలిలో కూడా మరో పోక్సో కోర్టును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఇక్కడ 16 మండలాలకు సంబంధించిన పోక్సో కేసులను విచారణ చేస్తారని చెప్పారు. -
ఏపీ హైకోర్టు జడ్జిల నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదముద్ర వేశారు. అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడుగురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్ న్యాయమూర్తులు కాగా, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడుగురూ రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుతుంది. -
ఎన్నో కష్టాలు పడ్డా: జస్టిస్ బట్టు దేవానంద్
సాక్షి, గుడివాడ: గొప్ప న్యాయమూర్తిగా కన్నా.. మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంటానని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సత్కార కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. వారు కష్టపడి చదివించారని.. 30 సంవత్సరాలుగా న్యాయవృత్తిలో ఉన్నానని చెప్పారు. ('గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు') వ్యక్తిగత, వృత్తిపరంగా ఎన్నో కష్టాలు పడ్డానని పేర్కొన్నారు. డాక్టర్ కన్నా ఒక్క న్యాయ మూర్తినే మై లాట్ అని.. భగవంతుని ప్రతినిధి అంటారని పేర్కొన్నారు. గుడివాడ నుంచి ఈ స్థాయికి చేరడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. తాను ఈ స్థాయికి రావడానికి తాన కుటుంబసభ్యులే కారణమని తెలిపారు. గుడివాడకు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు. -
సెమీస్‌లో రమ్య, ఆయుషి
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రె డ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీ క్యాడెట్ బాలికల విభాగంలో రమ్య, ఆయుషి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.వి శేష సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆనంద్ నగర్ వె ల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో రమ్య (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-9, 11-8, 11-6తో మహితా చౌదరి (వీజేఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-4, 11-6, 11-4తో భవిత (జీఎస్ఎం)పై విజయం సాధించారు. వీరితో పాటు కాజోల్ (వీజేఏ) 11-9, 11-8, 11-3తో కీర్తన (వైఎంసీఏ)పై, నజ్రీబి (వీజేఏ) 11-3, 11-4, 11-1తో రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ) పై గెలుపొందారు. ఇతర ఫలితాలు సబ్ జూనియర్ బాలికల రెండో రౌండ్: వైశాలి (ఏటీపీ) 11-1, 11-2, 11-2 స్కోరుతో కీర్తన (వైఎంసీఏ)పై, రచన (జీఎస్ఎం) 11-4, 11-6, 11-5తో ప్రాచి గోలస్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, అనూష రెడ్డి (వీజేఏ) 11-4, 11-2, 11-5తో రుచిత (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, కాలామృత (వీజేఏ)పై వాకోవర్‌తో రాగ నివేదిత (జీటీటీఏ), నజ్రీబి (వీజేఏ) 11-8, 7-11, 11-9, 11-3తో పాలక్ షా (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-5, 11-7, 11-6తో భార్గవి (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11-3, 11-3, 11-3తో స్నేహిత (మెరిడియన్)పై, నూర్ బాషా (వీజేఏ) 11-2, 11-2, 11-5తో సమీరన్ సుల్తాన (వీజేఏ)పై, ప్రణీత (జీఎస్ఎం) 11-0, 11-6, 11-4తో సాయి శ్రీత (వీజేఏ)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-6, 11-2, 11-6తో రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, మహిత (వీజేఏ) 11-5, 11-6, 11-5తో హేమ ప్రియ (ఏస్ అకాడమీ)పై, సాయి భవాని (ఎన్ఎల్జీ) 11-2, 11-5, 11-9తో రమ్య (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై నెగ్గారు. జూనియర్ బాలికల రెండో రౌండ్: వైశాలి (ఏటీపీ) 11-3, 11-4, 11-6తో గ్రితికా అస్రాని (వీజేఏ)పై, పాలక్ షా (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-5, 11-4, 10-12, 12-10తో అఫ్సా (మెరిడియన్)పై, సైరా బాను (వీజేఏ) 9-11, 11-4, 11-8, 11-6తో స్నేహిత (మెరిడియన్)పై, అనూషా రెడ్డి (వీజేఏ) 11-8, 13-11, 11-3తో దిశ (ఎన్ఎల్జీ)పై, మిహిక (ఏడబ్ల్యూఏ) వాకోవర్‌తో మహితా చౌదరి (వీజేఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-2, 11-5, 11-6తో సాయి శ్రీత (వీజేఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 11-3, 11-5, 11-5తో సంవేద (డాన్ బాస్కొ)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 11-5, 11-3, 11-8తో రచన (జీఎస్ఎం)పై, సాయి భవాని (ఎన్ఎల్జీ) 11-3, 11-7, 11-4తో రాగ నివేదిత (జీటీటీఏ)పై, మౌనిక (జీఎస్ఎం) 11-2, 11-5, 11-2తో భార్గవి (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.