జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు  | Pick And Choose Must Stop: Supreme Court Warns Centre | Sakshi
Sakshi News home page

జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు 

Published Wed, Nov 8 2023 8:20 AM | Last Updated on Wed, Nov 8 2023 8:23 AM

Pick And Choose Must Stop: Supreme Court Warns Centre - Sakshi

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి కొలీజియం సిఫార్సు చేసిన జాబితా నుంచి కొంతమందిని మాత్రమే న్యాయమూర్తులుగా కేంద్రం ఎంపిక చేసుకుంటోందని సుప్రీంకోర్టు ఆరోపించింది. కొలీజియం సిఫారసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఈ విషయంలో కేంద్రం వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ తీవ్ర అసహనం వెలిబుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధూలియా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.

ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన పలు సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెట్టడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ‘‘ఈ పరిస్థితి చివరికి సర్వోన్నత న్యాయస్థానమో, కొలీజియమో దీనిపై కేంద్రానికి రుచించని నిర్ణయం తీసుకునేందుకు దారి తీయదనే మేం ఆశిస్తున్నాం’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం ఈ తీరుగా చేయడం చాలా సమస్యలకు దారి తీస్తోందని జస్టిస్‌ కౌల్‌ ఆందోళన వెలిబుచ్చారు.
చదవండి: సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

‘‘ఇది పదేపదే సమస్యగా మారుతోంది. దీన్ని మేం గతంలోనూ అటార్నీ జనరల్‌ దృష్టికి తీసుకొచ్చాం. కొన్ని సిఫార్సులను ఆమోదించి మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టడం న్యాయమూర్తుల సీనియారిటీ తదితర కీలక విషయాల్లో అనవసర సమస్యలకు తావిస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేంద్రం వ్యవహార శైలిని చూసి సీనియర్‌ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం కూడా లేదన్నారు.

‘‘కొన్ని సిఫార్సులను కేంద్రం వెంటనే ఆమోదిస్తోంది. అది అభినందనీయమే. కానీ చాలాసార్లు కొలీజియం సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే ఎంచుకుని ఆమోదిస్తుండటం ఆందోళనకరం. దయచేసి దీనికి అడ్డుకట్ట వేయండి’’ అని ఆటార్నీ జనరల్‌ వెంకట రమణికి సూచించారు. ఏ న్యాయమూర్తి ఏ హైకోర్టులో పని చేయాలన్నది న్యాయవ్యవస్థ నిర్ణయానికే వదిలేయడం సబబన్నారు. ఈ అంశంపై కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంతో సహనంతో వ్యవహరించిందని పిటిషనర్‌ తరఫున వాదించిన ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

ఇక దీనిపై కోర్టే కేంద్రాన్ని ఆదేశించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేదంటే తామేం చేసినా చెల్లుతుందని అలుసుగా తీసుకునే ఆస్కారముందని చెప్పారు. దీనిపై గతంలోనే ఏజీని హెచ్చరించామని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఆయన హామీ ఇచ్చారని జస్టిస్‌ కౌల్‌ గుర్తు చేశారు. కేంద్రంతో లోతైన చర్చలకు మరింత సమయం కోరారన్నారు. కానీ ఆ తర్వాత కూడా కొలీజియం చేసిన ఇటీవలి సిఫార్సుల నుంచి కూడా కేంద్రం కొన్ని పేర్లనే ఎంచుకుని ఆమోదించిందంటూ అభ్యంతరం వెలిబుచ్చారు. దీనిపై విచారణను నవంబర్‌ 20కి ధర్మాసనం వాయిదా వేసింది.   
చదవండి: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement