న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది.
రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.
రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్‌లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.
దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.
కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment