Sanjay Kishan Kaul
-
Justice Sanjay Kishan Kaul: సహనశీలత తగ్గుతోంది
న్యూఢిల్లీ: ఎదుటి వారి అభిప్రాయాల పట్ల ప్రజలు సహనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో నేడు సహనశీలత స్థాయిలు తగ్గుతూండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ధైర్యం కలిగి ఉండటం చాలా కీలకమైన అంశమన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడే బాధ్యత బార్ అసోసియేషన్‌దేనని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్ల 10 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ ఎస్కే కౌల్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు శీతాకాల సెలవులు. దీంతో, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో సమావేశమైన వీడ్కోలు ధర్మాసనంలో జస్టిస్ కౌల్ మాట్లాడారు. ‘సర్వోన్నత న్యాయస్థానం నిర్భయంగా న్యాయాన్ని అందించిన న్యాయ దేవాలయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి’అని ఆయన ఆకాంక్షించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్.. జస్టిస్ కౌల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘70ల్లో నేనూ జస్టిస్ కౌల్ కలిసి కాలేజీకి వెళ్లాం. పుట్టస్వామి గోపత్యా హక్కు కేసు, వైవాహిక సమానత్వ కేసు, తాజాగా ఆరి్టకల్ 370 కేసు..ఇలా పలు కేసుల్లో ఇరువురం కలిసి ఇదే వేదికపై నుంచి తీర్పులు వెలువరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కేనంటూ తీర్పు వెలువరించిన తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ కౌల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఉన్నారు. 1958లో జని్మంచిన కౌల్ 1982లో ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1999లో సీనియర్ న్యాయవాది గుర్తింపు పొందారు. 2001లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా, 2003లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2014లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి కొలీజియం సిఫార్సు చేసిన జాబితా నుంచి కొంతమందిని మాత్రమే న్యాయమూర్తులుగా కేంద్రం ఎంపిక చేసుకుంటోందని సుప్రీంకోర్టు ఆరోపించింది. కొలీజియం సిఫారసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఈ విషయంలో కేంద్రం వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ తీవ్ర అసహనం వెలిబుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన పలు సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెట్టడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ‘‘ఈ పరిస్థితి చివరికి సర్వోన్నత న్యాయస్థానమో, కొలీజియమో దీనిపై కేంద్రానికి రుచించని నిర్ణయం తీసుకునేందుకు దారి తీయదనే మేం ఆశిస్తున్నాం’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం ఈ తీరుగా చేయడం చాలా సమస్యలకు దారి తీస్తోందని జస్టిస్ కౌల్ ఆందోళన వెలిబుచ్చారు. చదవండి: సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు ‘‘ఇది పదేపదే సమస్యగా మారుతోంది. దీన్ని మేం గతంలోనూ అటార్నీ జనరల్ దృష్టికి తీసుకొచ్చాం. కొన్ని సిఫార్సులను ఆమోదించి మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టడం న్యాయమూర్తుల సీనియారిటీ తదితర కీలక విషయాల్లో అనవసర సమస్యలకు తావిస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేంద్రం వ్యవహార శైలిని చూసి సీనియర్ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం కూడా లేదన్నారు. ‘‘కొన్ని సిఫార్సులను కేంద్రం వెంటనే ఆమోదిస్తోంది. అది అభినందనీయమే. కానీ చాలాసార్లు కొలీజియం సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే ఎంచుకుని ఆమోదిస్తుండటం ఆందోళనకరం. దయచేసి దీనికి అడ్డుకట్ట వేయండి’’ అని ఆటార్నీ జనరల్ వెంకట రమణికి సూచించారు. ఏ న్యాయమూర్తి ఏ హైకోర్టులో పని చేయాలన్నది న్యాయవ్యవస్థ నిర్ణయానికే వదిలేయడం సబబన్నారు. ఈ అంశంపై కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంతో సహనంతో వ్యవహరించిందని పిటిషనర్ తరఫున వాదించిన ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇక దీనిపై కోర్టే కేంద్రాన్ని ఆదేశించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేదంటే తామేం చేసినా చెల్లుతుందని అలుసుగా తీసుకునే ఆస్కారముందని చెప్పారు. దీనిపై గతంలోనే ఏజీని హెచ్చరించామని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఆయన హామీ ఇచ్చారని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. కేంద్రంతో లోతైన చర్చలకు మరింత సమయం కోరారన్నారు. కానీ ఆ తర్వాత కూడా కొలీజియం చేసిన ఇటీవలి సిఫార్సుల నుంచి కూడా కేంద్రం కొన్ని పేర్లనే ఎంచుకుని ఆమోదించిందంటూ అభ్యంతరం వెలిబుచ్చారు. దీనిపై విచారణను నవంబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. చదవండి: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ రిటైరయ్యారు. ఆఖరి పనిదినమైన శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ..న్యాయవ్యవస్థ కోసం ముఖ్యంగా రాజ్యాంగ సంబంధ అంశాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమని కొనియా డారు. 1979 నుంచి ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ అగర్వాల్ పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 23న జస్టిస్ భట్ సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్లపాటు సేవలందించారు. పలు చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 1958లో మైసూరులో జన్మించిన జస్టిస్ భట్ 1982లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విమర్శ హద్దు దాటితే వ్యవస్థకే ప్రమాదం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం, దానికి గ్రేడింగ్స్ ఇవ్వడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వ్యవస్థలపై నెలకొన్న అసహనానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. ‘నా తరువాత అంతా నాశనమే’ అన్న తరహాలో కొందరు మాజీ జడ్జీల తీరు ఉందన్నారు. మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ‘కోవిడ్ కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ’ అంశంపై ఆదివారం ఆయన ఆన్లైన్ ప్రసంగం చేశారు. ‘గతంలో మన న్యాయవ్యవస్థలో భాగంగా ఉన్న కొందరిలో ఒక సమస్య ఉంది. నా తర్వాత∙అన్నీ తప్పులే జరుగుతున్నాయి అనే భావనలో వారున్నారు. ఆ భావనే ప్రమాదకరం. ఇప్పుడు మాట్లాడుతున్నవారే గతంలో చాలా తప్పులు చేశారు’ అని అన్నారు. కొంతమందికి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టమన్నారు. హద్దులు దాటి ఆరోపణలు చేయడం ‘తప్పుడు సమాచార మహమ్మారి’ వంటిదన్నారు. విమర్శలు అవసరమే కానీ హద్దులు దాటకూడదని సూచించారు. ‘విమర్శలు హద్దులు దాటితే వ్యవస్థపై అనుమానాలు ఎక్కువవుతాయి. ఏ వ్యవస్థకయినా అది మంచిది కాదు. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే వ్యవస్థే మనుగడలో లేకుండా పోతుంది. అప్పుడంతా అరాచకమే’ అని హెచ్చరించారు. సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న వలస కూలీల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు సుమారు 20 మంది ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. వలస శ్రామికులపై కోర్టు చూపుతున్న నిర్లిప్తత సరికాదని వారు అందులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఎప్పుడూ ప్రతికూల భావజాలాన్ని ప్రచారం చేసేవారు, ఇళ్లల్లో కూర్చుని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించే మేథావులు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. -
ఇదే చివరి అవకాశం!
► ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక ► ఇక తామే రంగంలోకి దిగుతాం ► తీవ్రంగా స్పందించిన సీజే అన్నా గ్రంథాలయం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదే చివరి అవకాశం అని,చేతకాకుంటే, తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీవ్రంగా స్పందించడంతో ప్రభుత్వానికి మరో మారు షాక్ తగిలినట్టు అయింది. సాక్షి, చెన్నై : కోట్టూరు పురంలో డీఎంకే హయంలో అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద గ్రంథాలయంగా రూపుదిద్దుకున్న దీనికి, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నా పేరును నామకరణం చేశారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, డీఎంకే పథకాల్ని తుంగలో తొక్కే ప్రక్రియలో భాగంగా, అన్నా లైబ్రరీని నిర్వీర్యం చేసేందుకు సిద్ధం అయింది. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యారుు. ఆ గ్రంథాలయంలో వసతుల కరువు, తదితర అంశాల్ని హైకోర్టు తీవ్రంగానే పరిగణించింది. హైకోర్టు నేతృత్వంలోని కమిటీ ఆ గ్రంథాలయాన్ని సందర్శించి నివేదికను సైతం సమర్పించింది. ఆ నివేదికలో ప్రభుత్వ తీరు స్పష్టం అయింది. దీంతో ఆ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచాలని, అన్ని రకాల వసతుల కల్పన మీద దృష్టి పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టు పలు మార్లు ఆదేశాలు ఇచ్చినా ఫలితం శూన్యం. రెండు నెలల క్రితం , ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి మహాదేవన్లతో కూడిన బెంచ్ ముందు సాగిన విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చుకున్నారు. రెండు నెలలు గడువు ఇవ్వాలని సమయాన్ని కోరారు. అయితే, ఆ సమయం ముగిసినా, ఇంత వరకు ఆ గ్రంథాలయం అభివృద్ధి మీద అధికార వర్గాలు దృష్టి పెట్ట లేదు. శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించక తప్పలేదు. ఇదే చివరి అవకాశం ఉదయం విచారణ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాది విల్సన్ హాజరై వాదనల్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ముందు వినిపించారు. గడువు మీద గడువు ఇస్తున్నా, ఇంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అక్కడ ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని వివరించారు. ఇంతలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకునే యత్నం చేయడంతో, బెంచ్ తీవ్రంగానే స్పందించింది. ఎన్ని సార్లు గడువు ఇవ్వాలని, కోర్టు ఆదేశాల్ని అమలు చేయరా..? అని ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని బెంచ్ వ్యక్తం చేసింది. ఇక, గడువులు లేదు అని, ఇదే చివరి హెచ్చరికగా అవకాశం ఇస్తున్నామని , ఇకనైనా చలనం లేకుంటే, తామే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. చేత కాకుంటే, తామే కమిటీని నియమించి, ఆ గ్రంథాలయం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 14 వరకు ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణ అదే తేదీకి వారుుదా వేశారు. -
ప్రమాణ స్వీకారం
కొత్త వాళ్లకు బాధ్యతలు హైకోర్టులో 54కు చేరిన జడ్జీల సంఖ్య కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 54కు చేరింది. కొత్తగా నియమితులైన పదిహేను మంది న్యాయమూర్తులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. వీరి చేత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త వాళ్లకు న్యాయవాదులు, హైకోర్టు వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి. సాక్షి,చెన్నై: రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టు పరిధిలో మదురై ధర్మాసనం కూడా ఉంది. ఈ రెండు చోట్ల సుమారు డెబ్బై మంది న్యాయమూర్తులు తప్పనిసరి. అయితే, ఆ సంఖ్యకు భిన్నంగా న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం 39 మంది మాత్రమే న్యాయమూర్తులు పనుల భారంతో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత నెల 24 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి తగ్గ నివేదిక రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, ఇందులో తొమ్మిది మందిని పక్కన పెట్టి, పదిహేను మందికి అవకాశం కల్పించేందు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఆమోదముద్ర వేశారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మద్రాసు హైకోర్టుకు చేరడంతో కొత్త వాళ్ల ప్రమాణ స్వీకారానికి తగ్గ ఏర్పాట్లను అధికార వర్గాలు చేశారు. ప్రమాణ స్వీకారం: రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్రతో కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో బార్ కౌన్సిల్ తరఫున ఎంపిక చేసిన తొమ్మిది మంది న్యాయవాదులు ఉన్నారు. వీరిలో సీనియర్ న్యాయవాదులు పార్తిబన్, ఆర్.సుబ్రమణియన్, స్వాతంత్య్ర సమరయోధుడు రాజగోపాలనాయుడు కుటుంబానికి చెందిన న్యాయవాది ఎం.గోవిందరాజ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విభాగాలకు న్యాయవాదిగా పనిచేసిన ఎం. సుందర్, కేంద్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రన్, హైకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షురాలు నిషా భాను, చెన్నైకు చెందిన న్యాయవాది ఎంఎస్.రమేష్, ఎస్ఎం. సుబ్రమణియన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అనితా సుమంత్ ఉన్నారు. ఇక, మరో ఐదుగురు జిల్లాల జడ్జీలుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారు. వీరిలో న్యాయశాఖ కార్యదర్శిగా, చెన్నై మెజిస్ట్రేట్‌గా పనిచేసిన జయచంద్రన్, మదురై మెజిస్ట్రేట్‌గా పనిచేసిన ఎంఏ బషీర్ అహ్మద్, హైకోర్టు రిజిస్ట్రార్ రవీంద్రన్, పుదుచ్చేరి మెజిస్ట్రేట్ కార్తికేయన్, హైకోర్టు పర్యవేక్షణాధికారి వేల్ మురుగన్, న్యాయవాద సంఘం మాజీ నేత భాస్కరన్ ఉన్నారు. హైకోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో ఉదయం వీరి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ కొత్త వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నియామక ఉత్తర్వులను అందజేశారు. బాధ్యతలకు తగ్గ ఉత్తర్వుల్ని అందుకున్న కొత్త న్యాయమూర్తులకు న్యాయవాదులు, హైకోర్టు వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి. ఇది వరకు హైకోర్టులో 39 మంది మంది న్యాయమూర్తులు ఉండగా, ప్రస్తుతం పదిహేను మందితో కలుపుకుంటే, ఆ సంఖ్య 54కు చేరింది. దీంతో హైకోర్టు, మదురై ధర్మాసనంలలో ఇక, ఏఏ బెంచ్‌లకు ఎవరెవరు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారో అన్న వివరాలను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రకటించిన తదుపరి, ఆయా న్యాయమూర్తులు ఇక, తమ విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. -
'ఇదేంటీ.. ప్రతి చిన్న సమస్య కోర్టు దృష్టికేనా'
ప్రతి సమస్య కోర్టుకేనా! న్యాయవాదులకు హైకోర్టు చురక మృత్యుఘోషపై విచారణ సర్కారుకు నోటీసులు చెన్నై : ‘ఇదేంటీ.. ప్రతి చిన్న సమస్య కోర్టు దృష్టికేనా, ఎంపీ, ఎమ్మెల్యేలను కలవండి. వారు పట్టించుకోకుంటే రండి’ అని బస్సు ఫుట్‌బోర్డు విరిగిన వ్యవహారంలో న్యాయవాదులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ చురకలు అంటించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వరద తాకిడి సమయంలో 18 మంది రోగులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. తాంబరం సమీపంలో పరుగులు తీస్తున్న నగర రవాణా సంస్థకు చెందిన బస్సు ఫుట్ బోర్డు విరిగి రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఫుట్ మీద వేలాడుతున్న పలువురు గాయ పడ్డారు. ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు న్యాయవాది జార్జ్ విల్సన్ ప్రయత్నించారు. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి పుష్పా సత్యనారాయణన్‌లతో కూడిన బెంచ్ పిటిషన్ల విచారణలకు శ్రీకారం చుట్టింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయవాది జార్జ్ విల్సన్ బస్సు ఫుట్ బోర్డు విరిగిన వ్యవహారాన్ని బెంచ్ దృష్టికి తెచ్చారు. ప్రజా వ్యాజ్యం దాఖలు చేయండి అంటూ బెంచ్ సూచించింది. ఈ సమయంలో మరో న్యాయవాది విజయ్ జోక్యం చేసుకుని అన్ని ప్రభుత్వ బస్సుల్లో తలుపులు తప్పని సరి అని 2013లో పిటిషన్ దాఖలు అయిందని, ఇందుకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అందుకుని న్యాయవాదులకు చురకలు అంటించే పనిలో పడ్డారు. ఇదేంటీ...!: పత్రికల్లో వచ్చిన వార్తలు, కథనాలు చూసి ఇక్కడకు వచ్చినట్టున్నారని స్పందించారు. తామూ రోజూ పత్రికలు చూస్తున్నాం... సమాజంలో ఏమి జరుగుతున్నదో తెలుసు అని వ్యాఖ్యానించారు. సమస్య అన్నది ఒక్క వైపు మాత్రమే లేదని అన్ని వైపులా ఉన్నదని వివరించారు. ప్రతి ఏటా బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయిస్తున్నది, ఎవరికైనా కోపం వస్తే ఆ బస్సుల మీద ప్రభావాన్ని చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలను కూడా వెను వెంటనే కోర్టు దృష్టికి తీసుకు రావడం కన్నా, ప్రజాప్రతినిధుల్ని తొలుత కలవండి వాళ్లు స్పందించకుంటే, రండి.. అని సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే, వాటిని ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఒక వేళ వాళ్లు స్పందించని పక్షంలో కోర్టుకు రావాలని, అలా కాకుండా చిన్న సమస్య ఎదురైతే చాలు తక్షణం కోర్టుకు రావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందుకు ఆక్షేపణ వ్యక్తం చేస్తూ న్యాయవాది విజయ్ స్పందించారు. అన్ని సమస్యలను కోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అవశ్యం ఏర్పడి ఉందని వ్యాఖ్యానించారు. ఇందుకు ఏకీభవించని బెంచ్ వ్యవహారాన్ని తోసి పుచ్చింది. తదుపరి వరదల సమయంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాగిన మృత్యుతాండవంపై విచారణ చేపట్టింది. మృత్యుఘోషపై విచారణ : వరదలు నగరాన్ని చుట్టుముట్టిన సమయంలో రామాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక ఐసీయూలో ఉన్న 18 మంది రోగులు మరణించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి నిర్వాకాన్ని కోర్టు దృష్టికి తెస్తూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ పరిగణలోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మాణం సాగిందని, ఆ భవనాన్ని కూల్చి వేయాలని, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన సీఎండీఏ వర్గాలపై చర్యలు తీసుకోవాలని, ఈ మృత్యు తాండవంపై హత్య కేసు నమోదు చేయాలని బెంచ్ ఎదుట ట్రాఫిక్ రామస్వామి స్పందించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ నగరంలో ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారో అన్న వివరాల్లో ఆరి తేరిన వ్యక్తి ట్రాఫిక్ రామస్వామి అని కితాబు ఇచ్చారు. తాజా, వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించాల్సి ఉందని పేర్కొంటూ, చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(సీఎండీఏ), చెన్నై కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు. -
హక్కులు పరిరక్షిద్దాం
సాక్షి, చెన్నై: కార్మికుల హక్కుల్ని పరిరక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళదామని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ పిలుపునిచ్చారు. న్యాయమూర్తుల పదవుల భర్తీల్లో మహిళలకు సముచిత న్యాయం జరుగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో మంగళవారం న్యాయ సంబంధిత అంశాలపై సదస్సు జరిగింది. ఆ వర్సిటీ వీసీ వనగాముడి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రంగం కీలక భూమిక పోషిస్తున్నదని పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సముచిత న్యాయం దక్కే విధంగా , వారి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగంలు కీలక భూమిక పోషిస్తున్నా, ఆర్థిక పరంగా సేవా రంగం ముఖ్యపాత్రను కల్గి ఉన్నదని వివరించారు. మహిళా న్యాయమూర్తులకు సముచిత న్యాయం దక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో యాభై శాతం మేరకు మహిళల్ని ఇప్పటికే నియమించారని తెలిపారు. -
కొత్త సీజేగా సంజయ్ కిషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సంజయ్ కిషన్ కౌల్ శనివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే ముఖ్యమంత్రి జయలలిత రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ కే రోశయ్య న్యాయమూర్తి చేత ఉదయం 11.30 గంటలకు ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం, గవర్నర్లు వేర్వేరుగా జస్టిస్ సంజయ్ కిషన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. సీఎం జయలలితతోపాటూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంగత్, మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, టీకేఎస్ ఇళంగోవన్, మాధవరం మూర్తి హాజరయ్యూరు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యా యవాదులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు లో అందరూ పాల్గొన్నారు. మద్రా స్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండిన రాజేష్ కుమార్ అగర్వాల్ ఐదు నెలల క్రితం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. సంతోష్‌కుమార్ అగ్నిహోత్రి తాత్కాలిక న్యాయమూర్తిగా ఇంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు.1958లో ఢిల్లీలో జన్మించిన సంజయ్ కిషన్ కౌల్ 1976లో బీకాం పూర్తిచేసి 1982లో లా పట్టాను అందుకున్నారు. సివిల్, రిట్, కంపెనీ లా లో ప్రతిభావంతులుగా పేరుతెచ్చుకున్నారు. 2011 మే 3న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2013 నాటికి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరి 6 నుంచి పంజాబ్-హర్యానా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తూ ప్రస్తుతం చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈనెల 30న హైకోర్టు ప్రాంగణంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి.