► ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక
► ఇక తామే రంగంలోకి దిగుతాం
► తీవ్రంగా స్పందించిన సీజే
అన్నా గ్రంథాలయం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదే చివరి అవకాశం అని,చేతకాకుంటే, తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీవ్రంగా స్పందించడంతో ప్రభుత్వానికి మరో మారు షాక్ తగిలినట్టు అయింది.
సాక్షి, చెన్నై : కోట్టూరు పురంలో డీఎంకే హయంలో అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద గ్రంథాలయంగా రూపుదిద్దుకున్న దీనికి, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నా పేరును నామకరణం చేశారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, డీఎంకే పథకాల్ని తుంగలో తొక్కే ప్రక్రియలో భాగంగా, అన్నా లైబ్రరీని నిర్వీర్యం చేసేందుకు సిద్ధం అయింది. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యారుు. ఆ గ్రంథాలయంలో వసతుల కరువు, తదితర అంశాల్ని హైకోర్టు తీవ్రంగానే పరిగణించింది. హైకోర్టు నేతృత్వంలోని కమిటీ ఆ గ్రంథాలయాన్ని సందర్శించి నివేదికను సైతం సమర్పించింది.
ఆ నివేదికలో ప్రభుత్వ తీరు స్పష్టం అయింది. దీంతో ఆ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచాలని, అన్ని రకాల వసతుల కల్పన మీద దృష్టి పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టు పలు మార్లు ఆదేశాలు ఇచ్చినా ఫలితం శూన్యం. రెండు నెలల క్రితం , ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి మహాదేవన్‌లతో కూడిన బెంచ్ ముందు సాగిన విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చుకున్నారు. రెండు నెలలు గడువు ఇవ్వాలని సమయాన్ని కోరారు. అయితే, ఆ సమయం ముగిసినా, ఇంత వరకు ఆ గ్రంథాలయం అభివృద్ధి మీద అధికార వర్గాలు దృష్టి పెట్ట లేదు. శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించక తప్పలేదు.
ఇదే చివరి అవకాశం
ఉదయం విచారణ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాది విల్సన్ హాజరై వాదనల్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ముందు వినిపించారు. గడువు మీద గడువు ఇస్తున్నా, ఇంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అక్కడ ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని వివరించారు. ఇంతలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకునే యత్నం చేయడంతో, బెంచ్ తీవ్రంగానే స్పందించింది.
ఎన్ని సార్లు గడువు ఇవ్వాలని, కోర్టు ఆదేశాల్ని అమలు చేయరా..? అని ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని బెంచ్ వ్యక్తం చేసింది. ఇక, గడువులు లేదు అని, ఇదే చివరి హెచ్చరికగా అవకాశం ఇస్తున్నామని , ఇకనైనా చలనం లేకుంటే, తామే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. చేత కాకుంటే, తామే కమిటీని నియమించి, ఆ గ్రంథాలయం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 14 వరకు ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణ అదే తేదీకి వారుుదా వేశారు.
ఇదే చివరి అవకాశం!
Published Sat, Nov 5 2016 1:47 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement