'ఇదేంటీ.. ప్రతి చిన్న సమస్య కోర్టు దృష్టికేనా' | madras high court takes on lawyers | Sakshi
Sakshi News home page

'ఇదేంటీ.. ప్రతి చిన్న సమస్య కోర్టు దృష్టికేనా'

Published Wed, Dec 23 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

madras high court takes on lawyers

ప్రతి సమస్య కోర్టుకేనా!
న్యాయవాదులకు హైకోర్టు చురక
మృత్యుఘోషపై విచారణ
సర్కారుకు నోటీసులు
 
చెన్నై : ‘ఇదేంటీ.. ప్రతి చిన్న సమస్య కోర్టు దృష్టికేనా, ఎంపీ, ఎమ్మెల్యేలను కలవండి. వారు పట్టించుకోకుంటే రండి’ అని బస్సు ఫుట్‌బోర్డు విరిగిన వ్యవహారంలో న్యాయవాదులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ చురకలు అంటించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వరద తాకిడి సమయంలో 18 మంది రోగులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.

తాంబరం సమీపంలో పరుగులు తీస్తున్న నగర రవాణా సంస్థకు చెందిన బస్సు ఫుట్ బోర్డు విరిగి రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఫుట్ మీద వేలాడుతున్న పలువురు గాయ పడ్డారు. ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు న్యాయవాది జార్జ్ విల్సన్ ప్రయత్నించారు. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి పుష్పా సత్యనారాయణన్‌లతో కూడిన బెంచ్ పిటిషన్ల విచారణలకు శ్రీకారం చుట్టింది. 

ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయవాది జార్జ్ విల్సన్ బస్సు ఫుట్ బోర్డు విరిగిన వ్యవహారాన్ని బెంచ్ దృష్టికి తెచ్చారు. ప్రజా వ్యాజ్యం దాఖలు చేయండి అంటూ బెంచ్ సూచించింది. ఈ సమయంలో మరో న్యాయవాది విజయ్ జోక్యం చేసుకుని అన్ని  ప్రభుత్వ బస్సుల్లో  తలుపులు తప్పని సరి అని 2013లో పిటిషన్ దాఖలు అయిందని, ఇందుకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అందుకుని న్యాయవాదులకు చురకలు అంటించే పనిలో పడ్డారు.

ఇదేంటీ...!: పత్రికల్లో వచ్చిన వార్తలు, కథనాలు చూసి ఇక్కడకు వచ్చినట్టున్నారని స్పందించారు. తామూ రోజూ పత్రికలు చూస్తున్నాం... సమాజంలో ఏమి జరుగుతున్నదో తెలుసు అని వ్యాఖ్యానించారు. సమస్య అన్నది ఒక్క వైపు మాత్రమే లేదని అన్ని వైపులా ఉన్నదని వివరించారు. ప్రతి ఏటా బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయిస్తున్నది, ఎవరికైనా  కోపం వస్తే ఆ బస్సుల మీద ప్రభావాన్ని చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

చిన్న చిన్న సమస్యలను కూడా వెను వెంటనే  కోర్టు దృష్టికి తీసుకు రావడం కన్నా, ప్రజాప్రతినిధుల్ని తొలుత కలవండి వాళ్లు స్పందించకుంటే, రండి.. అని సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే, వాటిని  ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఒక వేళ వాళ్లు స్పందించని పక్షంలో కోర్టుకు రావాలని, అలా కాకుండా చిన్న సమస్య ఎదురైతే చాలు తక్షణం కోర్టుకు రావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందుకు ఆక్షేపణ వ్యక్తం చేస్తూ న్యాయవాది విజయ్ స్పందించారు. అన్ని సమస్యలను కోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అవశ్యం ఏర్పడి ఉందని వ్యాఖ్యానించారు. ఇందుకు ఏకీభవించని బెంచ్ వ్యవహారాన్ని తోసి పుచ్చింది. తదుపరి వరదల సమయంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాగిన మృత్యుతాండవంపై విచారణ చేపట్టింది.

మృత్యుఘోషపై విచారణ : వరదలు నగరాన్ని చుట్టుముట్టిన సమయంలో రామాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక ఐసీయూలో ఉన్న 18 మంది రోగులు మరణించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి నిర్వాకాన్ని కోర్టు దృష్టికి తెస్తూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ పరిగణలోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మాణం సాగిందని, ఆ భవనాన్ని కూల్చి వేయాలని, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన సీఎండీఏ వర్గాలపై చర్యలు తీసుకోవాలని, ఈ మృత్యు తాండవంపై హత్య కేసు నమోదు చేయాలని బెంచ్ ఎదుట ట్రాఫిక్ రామస్వామి స్పందించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ నగరంలో ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారో అన్న వివరాల్లో ఆరి తేరిన వ్యక్తి ట్రాఫిక్ రామస్వామి అని కితాబు ఇచ్చారు. తాజా, వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించాల్సి ఉందని పేర్కొంటూ, చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(సీఎండీఏ), చెన్నై కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లోపు  వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement