ప్రమాణ స్వీకారం
కొత్త వాళ్లకు బాధ్యతలు
హైకోర్టులో 54కు చేరిన జడ్జీల సంఖ్య
కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు
మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 54కు చేరింది. కొత్తగా నియమితులైన పదిహేను మంది న్యాయమూర్తులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. వీరి చేత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త వాళ్లకు న్యాయవాదులు, హైకోర్టు వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి.
సాక్షి,చెన్నై: రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టు పరిధిలో మదురై ధర్మాసనం కూడా ఉంది. ఈ రెండు చోట్ల సుమారు డెబ్బై మంది న్యాయమూర్తులు తప్పనిసరి. అయితే, ఆ సంఖ్యకు భిన్నంగా న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం 39 మంది మాత్రమే న్యాయమూర్తులు పనుల భారంతో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత నెల 24 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి తగ్గ నివేదిక రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, ఇందులో తొమ్మిది మందిని పక్కన పెట్టి, పదిహేను మందికి అవకాశం కల్పించేందు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇందుకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఆమోదముద్ర వేశారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మద్రాసు హైకోర్టుకు చేరడంతో కొత్త వాళ్ల ప్రమాణ స్వీకారానికి తగ్గ ఏర్పాట్లను అధికార వర్గాలు చేశారు. ప్రమాణ స్వీకారం: రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్రతో కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో బార్ కౌన్సిల్ తరఫున ఎంపిక చేసిన తొమ్మిది మంది న్యాయవాదులు ఉన్నారు. వీరిలో సీనియర్ న్యాయవాదులు పార్తిబన్, ఆర్.సుబ్రమణియన్, స్వాతంత్య్ర సమరయోధుడు రాజగోపాలనాయుడు కుటుంబానికి చెందిన న్యాయవాది ఎం.గోవిందరాజ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విభాగాలకు న్యాయవాదిగా పనిచేసిన ఎం. సుందర్, కేంద్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రన్, హైకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షురాలు నిషా భాను, చెన్నైకు చెందిన న్యాయవాది ఎంఎస్.రమేష్, ఎస్‌ఎం. సుబ్రమణియన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అనితా సుమంత్ ఉన్నారు. ఇక, మరో ఐదుగురు జిల్లాల జడ్జీలుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారు.
వీరిలో న్యాయశాఖ కార్యదర్శిగా, చెన్నై మెజిస్ట్రేట్‌గా పనిచేసిన జయచంద్రన్, మదురై మెజిస్ట్రేట్‌గా పనిచేసిన ఎంఏ బషీర్ అహ్మద్, హైకోర్టు రిజిస్ట్రార్ రవీంద్రన్, పుదుచ్చేరి మెజిస్ట్రేట్ కార్తికేయన్, హైకోర్టు పర్యవేక్షణాధికారి వేల్ మురుగన్, న్యాయవాద సంఘం మాజీ నేత భాస్కరన్ ఉన్నారు. హైకోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో ఉదయం వీరి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ కొత్త వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
నియామక ఉత్తర్వులను అందజేశారు. బాధ్యతలకు తగ్గ ఉత్తర్వుల్ని అందుకున్న కొత్త న్యాయమూర్తులకు న్యాయవాదులు, హైకోర్టు వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి. ఇది వరకు హైకోర్టులో 39 మంది మంది న్యాయమూర్తులు ఉండగా, ప్రస్తుతం పదిహేను మందితో కలుపుకుంటే, ఆ సంఖ్య 54కు చేరింది. దీంతో హైకోర్టు, మదురై ధర్మాసనంలలో ఇక, ఏఏ బెంచ్‌లకు ఎవరెవరు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారో అన్న వివరాలను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రకటించిన తదుపరి, ఆయా న్యాయమూర్తులు ఇక, తమ విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు.