వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ మిశ్రా, జస్టిస్ అగర్వాల్
న్యూఢిల్లీ: జడ్జీల నియామకానికి సంబంధించి న్యాయవ్యవస్థకు–కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకంపై శుక్రవారం సుప్రీంకోర్టు సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లు ఎన్ని కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ గుప్తా బెంచ్ అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్‌ను ప్రశ్నించింది.
ఎన్ని పేర్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుంటానని ఏజీ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మీరు చెప్పే మాట ‘తెలుసుకుంటాను’ అనడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుల్లో 40 వరకూ ఖాళీలు ఉంటే కొలీజియం 3 పేర్లే సిఫార్సు చేసిందని, మరిన్ని పేర్లను సిఫార్సు చేయాలని ఏజీ అన్నారు.
కొలీజియం సిఫార్సు చేస్తే ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కొలీజియం సిఫార్సులు లేకుండా కేంద్రం ఏమీ చేయలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తాము సిఫార్సులు చేశామని, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ యాకూబ్ మీర్.. మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ రామలింగం పేర్లను ప్రతిపాదించామని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని పేర్కొంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. వారి నియామకానికి సంబంధించి అతి త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు.
దీనిపై స్పందించిన బెంచ్.. ఎంత త్వరగా.. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. తన కేసును మణిపూర్ హైకోర్టు నుంచి గౌహతి హైకోర్టుకు బదిలీ చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల అంశం తీవ్రంగా ఉందని ధర్మాసనం గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు కేసుల బదిలీ కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఢిల్లీ వచ్చి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది..
స్వతంత్రత ప్రజాస్వామ్య పునాది
న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటని సుప్రీంకోర్టు తాజా మాజీ న్యాయమూర్తి ఆర్కే అగర్వాల్ అన్నారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి∙సీజేఐ జస్టిస్ మిశ్రా, ఇతర సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment