Justice Mishra
-
జడ్జీలను వివాదాల్లోకి లాగకండి
న్యూఢిల్లీ: ‘ఎవరి గురించైనా నాలుగు మంచి మాటలు చెబితే.. కొంతమందికి నచ్చడం లేదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘జడ్జీలను వివాదాల్లోకి లాగకండి’ అని చమత్కరించారు. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోదీని జస్టిస్ మిశ్రా ప్రశంసించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ల్యుటెన్స్‌ఢిల్లీ ప్రాంతంలోని ఖాన్ మార్కెట్ ఎదురుగా ఉన్న పాఠశాలను సీజ్ చేయడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ మిశ్రా పై వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని సుసంపన్న ప్రాంతాల్లో ఖాన్ మార్కెట్ ప్రాంతం ఒకటి. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీతో జస్టిస్ మిశ్రా.. ‘మీరు కూడా ఖాన్ మార్కెట్ దగ్గర్లోనే నివసిస్తున్నారు కదా! ఆ ప్రాంతంలో సంపన్నులు ఉంటారు’ అన్నారు. దానికి సింఘ్వీ.. ‘నేను 30 ఏళ్ల క్రితమే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాను. ఖాన్ మార్కెట్ అనేది ఇప్పుడు తప్పు పదంగా మారింది. అయినా ఆ ప్రాంతంలో మంచి కాఫీ షాప్స్ ఉన్నాయి. జడ్జీలు కూడా ఖాన్ మార్కెట్లో షాపింగ్ చేస్తుంటారు’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ.. ‘జడ్జీలను వివాదాల్లోకి లాగకండి’ అని చమత్కరించారు. -
హిందూసేన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: కర్ణాటకలో మతం పేరుతో ఓట్లడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఆ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రీయ హిందూసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. ముస్లింల కోసం మదర్సా బోర్డు, క్రైస్తవులకు క్రిస్టియన్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ ఓట్లడుగుతోందని లాయర్ వాదించారు.కాగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని బెంచ్ పేర్కొంది. -
జడ్జీల నియామకంపై తకరారు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకానికి సంబంధించి న్యాయవ్యవస్థకు–కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకంపై శుక్రవారం సుప్రీంకోర్టు సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లు ఎన్ని కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ గుప్తా బెంచ్ అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. ఎన్ని పేర్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుంటానని ఏజీ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మీరు చెప్పే మాట ‘తెలుసుకుంటాను’ అనడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుల్లో 40 వరకూ ఖాళీలు ఉంటే కొలీజియం 3 పేర్లే సిఫార్సు చేసిందని, మరిన్ని పేర్లను సిఫార్సు చేయాలని ఏజీ అన్నారు. కొలీజియం సిఫార్సు చేస్తే ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కొలీజియం సిఫార్సులు లేకుండా కేంద్రం ఏమీ చేయలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తాము సిఫార్సులు చేశామని, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ యాకూబ్ మీర్.. మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ రామలింగం పేర్లను ప్రతిపాదించామని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని పేర్కొంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. వారి నియామకానికి సంబంధించి అతి త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన బెంచ్.. ఎంత త్వరగా.. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. తన కేసును మణిపూర్ హైకోర్టు నుంచి గౌహతి హైకోర్టుకు బదిలీ చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల అంశం తీవ్రంగా ఉందని ధర్మాసనం గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు కేసుల బదిలీ కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఢిల్లీ వచ్చి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.. స్వతంత్రత ప్రజాస్వామ్య పునాది న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటని సుప్రీంకోర్టు తాజా మాజీ న్యాయమూర్తి ఆర్కే అగర్వాల్ అన్నారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి∙సీజేఐ జస్టిస్ మిశ్రా, ఇతర సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు. -
ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: రాజ్యసభాధ్యక్షుడికి అందజేసిన నోటీసులోని విషయాలకు ముందస్తు ప్రచారం ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు సీజేఐ జస్టిస్ మిశ్రాపై పలు ఆరోపణలు చేస్తూ అభిశంసన తీర్మానం నోటీసులను రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్యకి అందజేయడం తెల్సిందే. ఈ నోటీసులోని వివరాలన్నీ శనివారం మీడియాలో రావటంపై అధికారులు స్పందించారు. సభలో ప్రస్తావించదలచిన నోటీసు చైర్మన్ అంగీకారం పొంది, దాని ప్రతులను సభ్యులకు పంపిణీ చేసేవరకు ఎవరూ దానిని వెల్లడి చేయరాదని పార్లమెంటరీ విధివిధానాలు చెబుతున్నాయన్నారు. -
సీజేఐ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ
-
సీజేఐ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అత్యున్నత అధికారాన్ని సుప్రీంకోర్టు మరోసారి నొక్కిచెప్పింది. సుప్రీంకోర్టులో సీజేఐది తిరుగులేని స్థానమని, ఆయనే ఒక వ్యవస్థ అని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం సీజేఐకే ఉంటుందని తేల్చిచెప్పింది. సీజేఐ సమానుల్లో ప్రథముడు(ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్) అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టుల్లో హేతుబద్ధంగా, పారదర్శకంగా కేసుల కేటాయింపులు జరిపేందుకు మార్గదర్శకాలు రూపొందించాలంటూ న్యాయవాది అశోక్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యవహారాల్లో సీజేఐ రాజ్యాంగ పరంగా అత్యున్నత వ్యక్తి అని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై అపనమ్మకం తగదని సుప్రీం పేర్కొంది. జనవరి 12న సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకి ఉన్న నిర్వహణ అధికారాలపై వివరణ కోరుతూ ఇటీవల సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ పిల్ దాఖలు చేయడంతో పాటు.. కేసుల కేటాయింపు బాధ్యతలను కొలీజియంకు గానీ, సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి గానీ అప్పగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనూ తీర్పుపై ఆసక్తి ఏర్పడింది. సీజేఐ.. సమానుల్లో ప్రథముడు అశోక్ పాండే పిల్‌పై ధర్మాసనం తరఫున జస్టిస్ చంద్రచూడ్ తీర్పు వెలువరిస్తూ కోర్టులోని న్యాయమూర్తులంతా సమానులేనని, అయితే, సీజేఐ వారిలో ప్రథముడని వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడు. సుప్రీంకోర్టు విధుల నిర్వహణలో అతని హోదా సాటిలేనిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 146 భారత ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో నడిపించే వ్యక్తిగా పునరుద్ఘాటించింది. సంస్థాగత దృష్టితో చూస్తే ప్రధాన న్యాయమూర్తిది సుప్రీంకోర్టును నడిపించే పాత్ర. కేసుల కేటాయింపు, బెంచ్‌ల ఏర్పాటు అధికారం ఆయనకే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ‘అత్యున్నత రాజ్యాంగ విధుల నిర్వహణలో సీజేఐ అధికారం తిరుగులేనిది. దానిని తప్పకుండా గౌరవించాలి. కోర్టుకు సంబంధించిన పరిపాలన, న్యాయసంబంధ పనుల్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే సీజేఐకు విశిష్ట అధికారాలు ఉండడం తప్పనిసరి. రాజ్యాంగ విధుల నిర్వహణ, రాజ్యాంగ సంరక్షణ అనే కీలక విధులను సమర్ధంగా నిర్వర్తించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ విశిష్ట అధికారాలు ఉండటం అత్యావశ్యకం. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే విషయంలో స్వతంత్ర రక్షణ వ్యవస్థగా వ్యవహరించేలా సుప్రీంకోర్టు స్థానాన్ని ఈ అధికారాలు సుస్థిరం చేస్తాయి’ అని ధర్మాసనం పేర్కొంది. సీజేఐ విధులకు సంబంధించిన మొదటి నిబంధన ప్రకారం వివాదం, అప్పీలు లేదా కేసు విచారణకు బెంచ్‌ను ఏర్పాటు చేసే సీజేఐనే ఆ కేసును విచారించే న్యాయమూర్తులను నామినేట్ చేస్తారు. విస్తృత ధర్మాసనం అవసరం ఉందని బెంచ్ భావిస్తే.. ఆ విషయాన్ని ఆ బెంచ్ చీఫ్ జస్టిస్‌కు రిఫర్ చేయాలి. ఆయన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారు’ అని తీర్పులో సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వివరించింది.. ఇటీవల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ జే.చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును ఐదుగురు జడ్జిల ధర్మాసనం పక్కనపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తీర్పుపై భిన్నాభిప్రాయాలు సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పు సరైనదే. రోస్టర్ రూపకల్పన, బెంచ్‌లకు కేసుల కేటాయింపులు సీజేఐ చేస్తున్నారు. హైకోర్టుల్లో సీజేలు చూసుకుంటున్నారు. సీజేలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అనుచితం’ అని అన్నారు. రోస్టర్, బెంచ్ ఏర్పాటు సీజేఐకున్న విశేషాధికారాలని సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా అన్నారు. ‘సీజేఐ అధికారాలపై శాంతిభూషణ్ పిటిషన్‌ను ముందుగానే అడ్డుకునేందుకు అకస్మాత్తుగా మాస్టర్ రోస్టర్‌కు సంబంధించి పాండే పిటిషన్‌ను తెరపైకి తెచ్చారు. సీజేఐ అధికారాల్నే ప్రశ్నించినప్పుడు కేసును ఆయన విచారించకూడదు’ అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కొన్నాళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పాండే పిటిషన్‌ను హడావుడిగా తెరపైకి తెచ్చి తోసిపుచ్చారు అంటూ తీర్పుపై న్యాయవాది కామిని జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు
కృష్ణా జలాలపై రాష్ట్ర అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం ♦ ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ ♦ అవార్డులో అన్యాయాన్ని సరిదిద్దండని అడగండి ♦ అంతేగానీ మళ్లీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే ఎలా? ♦ జలాల్లో అన్యాయం వల్లే విడిపోయామన్న తెలంగాణ న్యాయవాది ♦ ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఎలా అని ప్రశ్న ♦ ఉమ్మడి రాష్ట్ర కేటాయింపులను పంచుకోవచ్చు కదా అన్న ధర్మాసనం ♦ విచారణ సెప్టెంబర్ 10కి వాయిదా.. సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు’ అని పేర్కొంది. కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కూడా అభిప్రాయపడింది. ఈ దిశగా కేంద్రానికి నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించింది. కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తమ వాదనను కృష్ణా నదీ జలాల ట్రిబ్యునళ్లు ఏనాడూ వినలేదని, కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం-1956లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి ఏడాది కిందటే అర్జీ పెట్టుకుంది. ఈ అభ్యర్థనను కేంద్రం పరిష్కరించకుండా నాన్చింది. దీంతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కిందటి నెల 21న విచారణకు రాగా.. ఇప్పటివరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న 5 పిటిషన్లతోపాటు వింటామని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆ పిటిషన్లు బుధవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతిల ధ ర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఇలా అయితే ఎంత దాకా..?: మహారాష్ట్ర మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపిస్తూ.. ఈ వివాదాన్ని లాక్కుం టూ పోతే ఎంతకాలానికి పరిష్కారమవుతుందని ప్రశ్నించారు. ‘‘బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో తుది అవార్డు ఇచ్చింది. దాన్ని ఇంతవరకు కేంద్రం నోటిఫై చేయలేదు. ఎందుకంటే ఆ అవార్డు కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆ అవార్డు నోటిఫై కాకుండా కోర్టు స్టే ఇచ్చింది. ఆ సమస్య అలా ఉండగానే.. 2014లో ఏపీ విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ కూడా మళ్లీ మొదట్నుంచి వాదనలు వినాలంటోంది. పైగా ఇప్పుడు కొత్త ట్రిబ్యునలే ఏర్పాటు చేయాలంటోంది. మరోవైపు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను రెండు కొత్త రాష్ట్రాల మధ్యే పంచుకోవాల్సి ఉంది. కానీ దానిపై విచారణ జరగాలని, తెలంగాణ కోరడంతో.. నిబంధనలు రూపకల్పన చేయాల్సిన ప్రక్రియ మొదలైంది. కానీ ఈలోగా ట్రిబ్యునల్‌లో ఒక సభ్యుడు రాజీనామా చేశారు. దాంతో విచారణ ఆగిపోయింది. ఆర్టికల్ 262 ప్రకారం ట్రిబ్యునల్ తీర్పులపై సుప్రీంకోర్టు సహా ఏ కోర్టూ జోక్యం చేసుకోజాలదు. అందువల్ల బ్రిజేష్‌కుమార్ అవార్డును కేంద్రం నోటిఫై చేసేలా ఆదేశాలు జారీచేయాలి..’’ అని ఆయన కోరారు. నోటీసులు జారీ చేయలేం.. తెలంగాణ తరఫున వైద్యనాథన్ వాదిస్తూ.. న్యాయం జరగాలన్న తలంపుతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా విచారణ జరుపుతూ కేంద్రానికి నోటీసులు జారీచేయాలని కోరారు. 1956 చట్టంలోని సెక్షన్ 3ను మరోసారి విడమరిచి చెప్పారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ఆ దిశగా నోటీసులు ఇవ్వలేం. సెక్షన్ 89ను మీరు ఇలా అర్థం చేసుకోవచ్చుగా.. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కేటాయింపులను రెండు రాష్ట్రాలు పంచుకోవచ్చని అనుకోవచ్చుగా..’’ అని పేర్కొన్నారు. దీనిపై వైద్యనాథన్ జవాబిస్తూ ‘‘సంబంధిత నియమావళిని ట్రిబ్యునల్ నిర్దేశించాలి.. కానీ మేమిప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం..’’ అని అన్నారు. అందుకు జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదు. మీరు ఏపీ నుంచి పంచుకుంటే సరిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో వైద్యనాథన్ మరోసారి రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడారు. అందుకు జస్టిస్ మిశ్రా.. ‘‘ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 20 మైన్లు ఉన్నాయనుకుందాం. వాటిని ఎలా పంచుకుంటారు?’’ అని అడిగారు. అందుకు వైద్యనాథన్ బదులిస్తూ.. ‘‘అసలు బ్రిజేష్‌కుమార్ అవార్డే నోటిఫై కాలేదు. ఆ అవార్డు ఇచ్చిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్‌కే సమ్మతం కాలేదు. అలాంటప్పుడు మేం ఉన్నవాటిలో ఎలా పంచుకుంటాం..?’’ అని అన్నారు. దీంతో జస్టిస్ మిశ్రా.. ‘‘అలాంటప్పుడు మీరు కొత్త ట్రిబ్యునల్ కావాలంటూ పట్టుబట్టడం కన్నా.. అవార్డు మీకు సమ్మతం కాదని పిటిషన్ వేయండి. ఒకవేళ ఉమ్మడి ఏపీకి కేటాయింపులు పెరుగుతాయేమో.. అప్పుడు మీకు కూడా పెరుగుతాయి కదా..’’ అన్నారు. అనంతరం ట్రిబ్యునల్‌లో సభ్యుడి నియామకానికి తీసుకున్న చర్యలేవో చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 10కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జలాల్లో అన్యాయంపైనే మేం విడిపోయాం.. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పైనే ప్రధానంగా విచారణ జరిగింది. విచారణ మొదలుకాగానే జస్టిస్ దీపక్ మిశ్రా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వైద్యనాథన్‌ను ఉద్దేశించి.. ‘‘మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిపిన కేటాయింపుల నుంచి పంచుకోవచ్చు కదా.. మీరు ఏపీ కేటాయింపుల నుంచి ఆశించవచ్చు.. సెక్షన్ 89 పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకే పెట్టుకుంటే సరిపోతుంది కదా..’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. ‘‘అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం మేం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. కానీ ఎలాంటి స్పందనా లేదు. ఏడాది దాటిపోయింది. అందువల్లే మీ వద్దకు వచ్చాం. మేం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలనుకున్నదే జలాల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్న బాధతో.. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా?’’ అని అన్నారు.