న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అత్యున్నత అధికారాన్ని సుప్రీంకోర్టు మరోసారి నొక్కిచెప్పింది. సుప్రీంకోర్టులో సీజేఐది తిరుగులేని స్థానమని, ఆయనే ఒక వ్యవస్థ అని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం సీజేఐకే ఉంటుందని తేల్చిచెప్పింది. సీజేఐ సమానుల్లో ప్రథముడు(ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్) అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టుల్లో హేతుబద్ధంగా, పారదర్శకంగా కేసుల కేటాయింపులు జరిపేందుకు మార్గదర్శకాలు రూపొందించాలంటూ న్యాయవాది అశోక్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యవహారాల్లో సీజేఐ రాజ్యాంగ పరంగా అత్యున్నత వ్యక్తి అని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై అపనమ్మకం తగదని సుప్రీం పేర్కొంది.
జనవరి 12న సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకి ఉన్న నిర్వహణ అధికారాలపై వివరణ కోరుతూ ఇటీవల సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ పిల్ దాఖలు చేయడంతో పాటు.. కేసుల కేటాయింపు బాధ్యతలను కొలీజియంకు గానీ, సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి గానీ అప్పగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనూ తీర్పుపై ఆసక్తి ఏర్పడింది.
సీజేఐ.. సమానుల్లో ప్రథముడు
అశోక్ పాండే పిల్‌పై ధర్మాసనం తరఫున జస్టిస్ చంద్రచూడ్ తీర్పు వెలువరిస్తూ కోర్టులోని న్యాయమూర్తులంతా సమానులేనని, అయితే, సీజేఐ వారిలో ప్రథముడని వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడు. సుప్రీంకోర్టు విధుల నిర్వహణలో అతని హోదా సాటిలేనిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 146 భారత ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో నడిపించే వ్యక్తిగా పునరుద్ఘాటించింది. సంస్థాగత దృష్టితో చూస్తే ప్రధాన న్యాయమూర్తిది సుప్రీంకోర్టును నడిపించే పాత్ర.
కేసుల కేటాయింపు, బెంచ్‌ల ఏర్పాటు అధికారం ఆయనకే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ‘అత్యున్నత రాజ్యాంగ విధుల నిర్వహణలో సీజేఐ అధికారం తిరుగులేనిది. దానిని తప్పకుండా గౌరవించాలి. కోర్టుకు సంబంధించిన పరిపాలన, న్యాయసంబంధ పనుల్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే సీజేఐకు విశిష్ట అధికారాలు ఉండడం తప్పనిసరి. రాజ్యాంగ విధుల నిర్వహణ, రాజ్యాంగ సంరక్షణ అనే కీలక విధులను సమర్ధంగా నిర్వర్తించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ విశిష్ట అధికారాలు ఉండటం అత్యావశ్యకం.
అలాగే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే విషయంలో స్వతంత్ర రక్షణ వ్యవస్థగా వ్యవహరించేలా సుప్రీంకోర్టు స్థానాన్ని ఈ అధికారాలు సుస్థిరం చేస్తాయి’ అని ధర్మాసనం పేర్కొంది. సీజేఐ విధులకు సంబంధించిన మొదటి నిబంధన ప్రకారం వివాదం, అప్పీలు లేదా కేసు విచారణకు బెంచ్‌ను ఏర్పాటు చేసే సీజేఐనే ఆ కేసును విచారించే న్యాయమూర్తులను నామినేట్ చేస్తారు. విస్తృత ధర్మాసనం అవసరం ఉందని బెంచ్ భావిస్తే.. ఆ విషయాన్ని ఆ బెంచ్ చీఫ్ జస్టిస్‌కు రిఫర్ చేయాలి. ఆయన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారు’ అని తీర్పులో సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వివరించింది.. ఇటీవల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ జే.చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును ఐదుగురు జడ్జిల ధర్మాసనం పక్కనపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తీర్పుపై భిన్నాభిప్రాయాలు
సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పు సరైనదే. రోస్టర్ రూపకల్పన, బెంచ్‌లకు కేసుల కేటాయింపులు సీజేఐ చేస్తున్నారు. హైకోర్టుల్లో సీజేలు చూసుకుంటున్నారు. సీజేలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అనుచితం’ అని అన్నారు. రోస్టర్, బెంచ్ ఏర్పాటు సీజేఐకున్న విశేషాధికారాలని సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా అన్నారు. ‘సీజేఐ అధికారాలపై శాంతిభూషణ్ పిటిషన్‌ను ముందుగానే అడ్డుకునేందుకు అకస్మాత్తుగా మాస్టర్ రోస్టర్‌కు సంబంధించి పాండే పిటిషన్‌ను తెరపైకి తెచ్చారు. సీజేఐ అధికారాల్నే ప్రశ్నించినప్పుడు కేసును ఆయన విచారించకూడదు’ అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కొన్నాళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పాండే పిటిషన్‌ను హడావుడిగా తెరపైకి తెచ్చి తోసిపుచ్చారు అంటూ తీర్పుపై న్యాయవాది కామిని జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment