patents
-
ప్రతి 6 నిమిషాలకో కొత్త టెక్నాలజీ.. పేటెంట్ దరఖాస్తుల వెల్లువ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 92,000 పేటెంట్ దరఖాస్తులు నమోదయ్యాయి. ఇది సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి కేంద్రంగా భారత్‌లో పెరుగుతున్న పరిపక్వతను సూచిస్తుందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్ ఉన్నత్ పండిట్ తెలిపారు.ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ భారత్‌లో ఐపీ రక్షణను కోరుతోందని అసోచాం సదస్సులో చెప్పారు. మేధో సంపత్తి (ఐపీ) హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నామని, కొత్త నిబంధనల కోసం వివిధ వాటాదారుల నుండి అభిప్రాయాలను కోరుతున్నామని అన్నారు.‘వివిధ రంగాలలో ఐపీ రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నాం. ఈ కసరత్తు జరుగుతోంది. అటువంటి మార్గదర్శకాల ప్రభావాన్ని మరింత బలోపేతం చేయడానికి పరిశ్రమ సంఘాలు, ఐపీ వాటాదారులు కూడా సహకారం అందించవచ్చు. శక్తివంతమైన మేధో సంపత్తి (ఐపీ) హక్కుల వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన ఐపీ ఫైలింగ్‌ల దిశగా మేము పని చేస్తున్నాం. మంజూరైన పేటెంట్లలో ఈ వేగవంతమైన పెరుగుదల దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో, ఐపీ హక్కులను మంజూరు చేయడంలో భారత పేటెంట్ కార్యాలయ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనేక ఆవిష్కరణలతో దరఖాస్తుల నాణ్యత పెరగడాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది’ అని ఆయన అన్నారు. -
6జీ పేటెంట్లు లక్ష్యంగా పనిచేయాలి
న్యూఢిల్లీ: 2030 నాటికల్లా అంతర్జాతీయంగా 6జీ టెక్నాలజీ పేటెంట్లలో కనీసం 10 శాతం వాటానైనా దక్కించుకునేలా భారత్ కృషి చేయాల్సి ఉందని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత్ ప్రస్తుతం సాంకేతికతలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, 6జీకి సంబంధించి ఇప్పటికే 200 పేటెంట్లను పొందిందని ఆయన తెలిపారు. ఆరో తరం టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన భారత్ 6జీ ఫోరమ్‌ను ఆవిష్కరించిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. 2014–23 మధ్య కాలంలో దేశీ టెలికం రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దాదాపు 24 బిలియన్ డాలర్లకు చేరాయని ఆయన వివరించారు. గతంలో టెలికంలోకి ఎఫ్‌డీఐలను ఆకర్షించడం పెద్ద సవాలుగా ఉండేదని.. ప్రస్తుతం పెట్టుబడులు రావడం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా .. సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు అంగీకారాానికి వచ్చాయని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, అనేక దేశాలు మన దగ్గర్నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. భారతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు అమెరికా మార్కెట్‌కు కూడా ఎగుమతులు ప్రారంభించారని మంత్రి చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో టెలికం రంగం కోసం పూర్తిగా దేశీయంగా రూపొందించిన తొలి చిప్ అందుబాటులోకి రాగలదని ఆయన తెలిపారు. మైక్రాన్ ఏర్పాటు చేస్తున్న 2.75 బిలియన్ డాలర్ల చిప్ ప్లాంటుకు వచ్చే 40–45 రోజుల్లో శంకుస్థాపన జరగనుందని చెప్పారు. -
6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లు
న్యూఢిల్లీ: 6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన భారత్ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. 5జీ నెట్వర్క్ విస్తరణ .. ప్రభుత్వం నిర్దేశించిన 200 నగరాలను కూడా దాటి ప్రస్తుతం 397 నగరాలకు చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్.. పాలన, మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణలో మార్పులతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేస్తే .. 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఆవిర్భవించడాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన చెప్పారు. -
పోటాపోటీగా పేటెంట్లు.. రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ రైట్స్) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్కరణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్ 709, పశ్చిమ బెంగాల్ 505 రాజస్థాన్ 449, కేరళ 426, మధ్యప్రదేశ్ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్లలో ముందున్నవి ఇవే.. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ వర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
మానవ వనరుల కొరత.. పేటెంట్లపై ప్రభావం!
న్యూఢిల్లీ: మానవ వనరులు, నిబంధనలను పాటించడానికి కష్టతరమైన పరిస్థితులే దేశీయంగా పేటెంట్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొంది. అత్యవసరంగా పేటెంట్ వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంపై దీన్ని ఈఏసీ–పీఎం రూపొందించింది. భారత్‌లో ఇటీవలి కాలంలో దాఖలైన, మంజూరైన పేటెంట్ల సంఖ్య పెరిగినప్పటికీ .. అమెరికా, చైనా లాంటి వాటితో పోలిస్తే తక్కువగానే ఉందని ఇందులో పేర్కొంది. 2022 మార్చి ఆఖరు నాటికి పేటెంట్ ఆఫీసులో 860 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. చైనాలో ఈ సంఖ్య 13,704 కాగా అమెరికాలో 8,132గా ఉందని వివరించింది. చైనాలో సగటున పేటెంట్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి 20–21 నెలల సమయం పడుతుందని.. భారత్‌లో ఇందుకు 58 నెలలు పడుతోందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆఖరు నాటికి పేటెంటు కార్యాలయంలో కంట్రోలర్ స్థాయిలో 1.64 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. వచ్చే రెండేళ్లలో పేటెంట్ ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య కనీసం 2,800కి పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
పేటెంట్‌కు లేటెందుకు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సీరియస్‌గా ఇలా అంటాడు... ‘పేటెంట్ అనేది టెక్నాలజీకి కీ లాంటిది. టెక్నాలజీ అనేది ప్రొడక్షన్‌కు కీ లాంటిది’ ‘మోస్ట్ సీరియస్ మెన్’గా పేరున్న, మూడువందల పేటెంట్లకు సొంతదారైన సెర్బియన్–అమెరికన్ ఇన్వెంటర్ నికొల టెస్లా చాలా తేలికగా ఇలా అంటాడు... ‘నా ఐడియాను ఎవరో దొంగిలించారు అనే బాధ కంటే, వారికంటూ ఒక ఐడియా ఎందుకు లేదు అనే బాధ నాలో ఎక్కువగా ఉంటుంది’ ... ఎవరు ఎలా అన్నా, ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు పేటెంట్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మెరికల్లాంటి యూత్‌తో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ సౌత్ కొరియన్ సాంకేతిక దిగ్గజం శాంసంగ్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 7,500 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 50 శాతం మన దేశం నుంచే ఉన్నాయి. ఈ పేటెంట్ ఫైలర్స్ ఫస్ట్ టైమ్ ఇన్వెంటర్స్. మిలీనియల్స్, జెన్ జెడ్‌ను సాంకేతికంగా తీర్చిదిద్దడంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన శ్రీ–బి (శాంసంగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్–బెంగళూరు) బాగా ఉపయోగపడుతుంది. శ్రీ–బికి ప్రత్యేకమైన ఐపీ(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) బృందం ఉంది. ఇది యువతరానికి ఇన్వెన్షన్–క్రియేషన్ ట్రైనింగ్, ఇన్వెన్షన్ ప్రాసెస్‌కు ఉపకరించే అడ్వాన్స్డ్ ఇన్వెంటివ్ స్టెప్ ట్రైనింగ్ ఇస్తుంది. పేటెంట్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నల్ పోర్టల్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎమర్జింగ్ ఏరియాలుగా చెప్పుకునే 5జీ, ఏఐ, ఐవోటి, కెమెరా అండ్ విజన్ టెక్నాలజీస్‌కు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వాటిలో ఎక్కువ భాగం అంకుర సంస్థలుగా మొదలుకావడం విశేషం. ‘యువతరం ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్నాం. ఎదుగుతున్న దశలోనే అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. వారికి శాంసంగ్ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటున్నారు శ్రీ–బి సీటీవో అలోక్‌నాథ్. ‘కొత్త ఆవిష్కరణల కోసం జరుగుతున్న ఈ ప్రయాణం యువతరం మనస్తత్వానికి తగినట్లుగానే ఆటపాటలతో హుషారుగా సాగుతుంది’ అంటున్నారు శ్రీ–బి డిజైన్ మెనేజర్ స్వాధా జైశ్వాల్. సాంకేతిక జ్ఞానం మాత్రమే కాకుండా ఇన్స్పైరింగ్ స్టోరీలు వినిపించడం ద్వారా యువతరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి సంస్థలు. మచ్చుకు ఒకటి... పదిహేనేళ్ల వయసులోనే వైద్యరంగం ముక్కున వేలేసుకునేలా చేశాడు జాక్ అండ్రాక (యూఎస్). ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ముందుగా, తక్కువ ఖర్చుతో గుర్తించే సాధనానికి రూపలకల్పన చేసి ‘ఐకానిక్ ఇన్వెంటర్ ఆఫ్ జెనరేషన్ జెడ్’గా కీర్తి అందుకున్నాడు జాక్. అయితే జాక్ చదువులో అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థి ఏమీకాదు. సాధారణ విద్యార్థే. తన ఆవిష్కరణకు మూలం గూగుల్ అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం! తన దగ్గరి బంధువు ఒకరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో చనిపోయాడు. దీంతో ఆ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ క్యాన్సర్‌కు కారణం ఏమిటి? ఏ దశలో గుర్తిస్తున్నారు? పరీక్షలు ఏమిటి? సర్వైవర్ల శాతం ఎంత... మొదలైన విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకోగలిగాడు. ‘ఈజీ, చీప్, సింపుల్, సెన్సెటివ్ అండ్ సెలెక్టివ్’ అనే మూలసూత్రంతో రిసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకొని, క్యాన్సర్‌పై పరిశోధిస్తున్న 200 మందికి పంపించాడు. 199 మంది తిరస్కరించారు. ఒక్కరు మాత్రం ‘బహుశా వీలవుతుందేమో!’ అన్నారు. ఇక జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ(మేరిలాండ్)లో ప్రయోగాలు చేయడానికి అనుమతి అనేది చా...లా కష్టంగా దొరికింది. ఎన్నో అవాంతరాలను తట్టుకొని తన కలను సాకారం చేసుకున్న జాక్ ఇప్పుడు మరికొన్ని కలలు కంటున్నాడు. వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే జాక్ ది ఒంటరిపోరు. అయితే శ్రీ–బిలాంటి సంస్థల వల్ల కలలు కనే యువతరానికి ఒంటరిపోరు తప్పుతుంది. శక్తిమంతమైన మద్దతు దొరుకుతుంది. -
మరో సంచలనం దిశగా షావోమి
సాక్షి,న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ విభాగంలో రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న చైనా మొబైల్ తయారీ దారు షావోమి మరోమెట్టు పైకి ఎదగాలని భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో తదుపరి సెగ్మెంట్ ఫోల్డింగ్ ఫోన్ల తయారీలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనకు సంబంధించి డిజైన్ పేటెంట్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ఫోన్లో రొటేటింగ్ క్వాడ్-కెమెరా ప్రధాన ఫీచర్‌గా వుండటం ఆసక్తికరంగా మారింది. (రెడ్మి ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలు త్వరలో) గిజ్మో చైనా నివేదిక ప్రకారం షావోమి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెల్ఫీల కోసం ముందుకి, సాధారణ ఫోటోల కోసం వెనక్కి రొటేట్ అవుతుందట. దీనికి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 48 చిత్రాలను కూడా రీలీజ్చేసినట్టు తెలిపింది. అయితే సాధారణ స్మార్ట్ఫోన్లలో రొటేటింగ్ కెమెరా ఇప్పటికే ఉన్నప్పటికీ మడతఫోన్లలో ఇదే మొదటిది. ఇప్పటికే మోటరోలా రాజర్ మడతపోన్తో పాటు, శాంసగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ విజయవంతమైన నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తరువాతి సెగ్మెంట్లోకి షావోమి జంప్ చేయనుంది. అయితే ఈ అంచనాలపై షావోమి అధికారికంగా స్పందించాల్సి వుంది. -
సీజేఐ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అత్యున్నత అధికారాన్ని సుప్రీంకోర్టు మరోసారి నొక్కిచెప్పింది. సుప్రీంకోర్టులో సీజేఐది తిరుగులేని స్థానమని, ఆయనే ఒక వ్యవస్థ అని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం సీజేఐకే ఉంటుందని తేల్చిచెప్పింది. సీజేఐ సమానుల్లో ప్రథముడు(ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్) అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టుల్లో హేతుబద్ధంగా, పారదర్శకంగా కేసుల కేటాయింపులు జరిపేందుకు మార్గదర్శకాలు రూపొందించాలంటూ న్యాయవాది అశోక్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యవహారాల్లో సీజేఐ రాజ్యాంగ పరంగా అత్యున్నత వ్యక్తి అని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై అపనమ్మకం తగదని సుప్రీం పేర్కొంది. జనవరి 12న సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకి ఉన్న నిర్వహణ అధికారాలపై వివరణ కోరుతూ ఇటీవల సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ పిల్ దాఖలు చేయడంతో పాటు.. కేసుల కేటాయింపు బాధ్యతలను కొలీజియంకు గానీ, సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి గానీ అప్పగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనూ తీర్పుపై ఆసక్తి ఏర్పడింది. సీజేఐ.. సమానుల్లో ప్రథముడు అశోక్ పాండే పిల్‌పై ధర్మాసనం తరఫున జస్టిస్ చంద్రచూడ్ తీర్పు వెలువరిస్తూ కోర్టులోని న్యాయమూర్తులంతా సమానులేనని, అయితే, సీజేఐ వారిలో ప్రథముడని వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడు. సుప్రీంకోర్టు విధుల నిర్వహణలో అతని హోదా సాటిలేనిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 146 భారత ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో నడిపించే వ్యక్తిగా పునరుద్ఘాటించింది. సంస్థాగత దృష్టితో చూస్తే ప్రధాన న్యాయమూర్తిది సుప్రీంకోర్టును నడిపించే పాత్ర. కేసుల కేటాయింపు, బెంచ్‌ల ఏర్పాటు అధికారం ఆయనకే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ‘అత్యున్నత రాజ్యాంగ విధుల నిర్వహణలో సీజేఐ అధికారం తిరుగులేనిది. దానిని తప్పకుండా గౌరవించాలి. కోర్టుకు సంబంధించిన పరిపాలన, న్యాయసంబంధ పనుల్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే సీజేఐకు విశిష్ట అధికారాలు ఉండడం తప్పనిసరి. రాజ్యాంగ విధుల నిర్వహణ, రాజ్యాంగ సంరక్షణ అనే కీలక విధులను సమర్ధంగా నిర్వర్తించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ విశిష్ట అధికారాలు ఉండటం అత్యావశ్యకం. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే విషయంలో స్వతంత్ర రక్షణ వ్యవస్థగా వ్యవహరించేలా సుప్రీంకోర్టు స్థానాన్ని ఈ అధికారాలు సుస్థిరం చేస్తాయి’ అని ధర్మాసనం పేర్కొంది. సీజేఐ విధులకు సంబంధించిన మొదటి నిబంధన ప్రకారం వివాదం, అప్పీలు లేదా కేసు విచారణకు బెంచ్‌ను ఏర్పాటు చేసే సీజేఐనే ఆ కేసును విచారించే న్యాయమూర్తులను నామినేట్ చేస్తారు. విస్తృత ధర్మాసనం అవసరం ఉందని బెంచ్ భావిస్తే.. ఆ విషయాన్ని ఆ బెంచ్ చీఫ్ జస్టిస్‌కు రిఫర్ చేయాలి. ఆయన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారు’ అని తీర్పులో సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వివరించింది.. ఇటీవల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ జే.చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును ఐదుగురు జడ్జిల ధర్మాసనం పక్కనపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తీర్పుపై భిన్నాభిప్రాయాలు సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పు సరైనదే. రోస్టర్ రూపకల్పన, బెంచ్‌లకు కేసుల కేటాయింపులు సీజేఐ చేస్తున్నారు. హైకోర్టుల్లో సీజేలు చూసుకుంటున్నారు. సీజేలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అనుచితం’ అని అన్నారు. రోస్టర్, బెంచ్ ఏర్పాటు సీజేఐకున్న విశేషాధికారాలని సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా అన్నారు. ‘సీజేఐ అధికారాలపై శాంతిభూషణ్ పిటిషన్‌ను ముందుగానే అడ్డుకునేందుకు అకస్మాత్తుగా మాస్టర్ రోస్టర్‌కు సంబంధించి పాండే పిటిషన్‌ను తెరపైకి తెచ్చారు. సీజేఐ అధికారాల్నే ప్రశ్నించినప్పుడు కేసును ఆయన విచారించకూడదు’ అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కొన్నాళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పాండే పిటిషన్‌ను హడావుడిగా తెరపైకి తెచ్చి తోసిపుచ్చారు అంటూ తీర్పుపై న్యాయవాది కామిని జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సువెన్ లైఫ్‌కు మరో రెండు పేటెంట్లు
హైదరాబాద్, బిజి నెస్ బ్యూరో : ఫార్మా సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్ తాజాగా భారత్, జపాన్‌లో రెండు పేటెంట్లు దక్కించుకుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ తదితర కేంద్ర నాడీ మండల సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగపడే కొత్త రసాయన మేళవింపు (ఎన్సీఈ)లకు ఇవి లభించినట్లు వివరించింది. 2032 దాకా వీటి గడువు ఉంటుందని సంస్థ పేర్కొంది. దీంతో భారత్‌లో మొత్తం 19, జపాన్‌లో 19 పేటెంట్లు లభించినట్లయిందని కంపెనీ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు. సోమవారం బీఎస్ఈలో సువెన్ లైఫ్ సెన్సైస్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 189 వద్ద ముగిసింది. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
నకిరేకల్ : రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమన్వయాధికారి డా.పద్మజ కోరారు. బుధవారం నకిరేకల్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలోని రిజిస్టర్లను పరిశీలించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలను పరామర్శించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఫీ, డాక్టర్లు శేఖర్, రజిత, రమణారెడ్డి, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంపాటి శ్యామ్, సిబ్బంది ఝాన్సీరాణి, ప్రసాద్, సువర్ణ ఉన్నారు. -
సువెన్ లైఫ్ కు 4 పేటెంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్ తాజాగా నాడీ సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగించే ఔషధానికి సంబంధించి వివిధ దేశాల్లో పేటెంట్లు దక్కించుకుంది. అమెరికా, యూరేషియా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాలో తమ న్యూ కెమికల్ ఎంటిటీస్ (ఎన్సీఈ)కు పేటెంట్లు లభించినట్లు సంస్థ తెలిపింది. వీటికి 2032 దాకా గడువు వర్తిస్తుందని పేర్కొంది. తాజా అనుమతులతో ఆస్ట్రేలియాలో మొత్తం 24, యూరేషియాలో 17, ఇజ్రాయెల్‌లో 9, అమెరికాలో 24 పేటెంట్లు ఉన్నట్లవుతుందని సువెన్ లైఫ్ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు.