న్యూఢిల్లీ: 2030 నాటికల్లా అంతర్జాతీయంగా 6జీ టెక్నాలజీ పేటెంట్లలో కనీసం 10 శాతం వాటానైనా దక్కించుకునేలా భారత్ కృషి చేయాల్సి ఉందని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత్ ప్రస్తుతం సాంకేతికతలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, 6జీకి సంబంధించి ఇప్పటికే 200 పేటెంట్లను పొందిందని ఆయన తెలిపారు. ఆరో తరం టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన భారత్ 6జీ ఫోరమ్‌ను ఆవిష్కరించిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. 2014–23 మధ్య కాలంలో దేశీ టెలికం రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దాదాపు 24 బిలియన్ డాలర్లకు చేరాయని ఆయన వివరించారు.
గతంలో టెలికంలోకి ఎఫ్‌డీఐలను ఆకర్షించడం పెద్ద సవాలుగా ఉండేదని.. ప్రస్తుతం పెట్టుబడులు రావడం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా .. సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు అంగీకారాానికి వచ్చాయని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, అనేక దేశాలు మన దగ్గర్నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. భారతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు అమెరికా మార్కెట్‌కు కూడా ఎగుమతులు ప్రారంభించారని మంత్రి చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో టెలికం రంగం కోసం పూర్తిగా దేశీయంగా రూపొందించిన తొలి చిప్ అందుబాటులోకి రాగలదని ఆయన తెలిపారు. మైక్రాన్ ఏర్పాటు చేస్తున్న 2.75 బిలియన్ డాలర్ల చిప్ ప్లాంటుకు వచ్చే 40–45 రోజుల్లో శంకుస్థాపన జరగనుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment