
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 92,000 పేటెంట్ దరఖాస్తులు నమోదయ్యాయి. ఇది సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి కేంద్రంగా భారత్‌లో పెరుగుతున్న పరిపక్వతను సూచిస్తుందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్ ఉన్నత్ పండిట్ తెలిపారు.
ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ భారత్‌లో ఐపీ రక్షణను కోరుతోందని అసోచాం సదస్సులో చెప్పారు. మేధో సంపత్తి (ఐపీ) హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నామని, కొత్త నిబంధనల కోసం వివిధ వాటాదారుల నుండి అభిప్రాయాలను కోరుతున్నామని అన్నారు.
‘వివిధ రంగాలలో ఐపీ రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నాం. ఈ కసరత్తు జరుగుతోంది. అటువంటి మార్గదర్శకాల ప్రభావాన్ని మరింత బలోపేతం చేయడానికి పరిశ్రమ సంఘాలు, ఐపీ వాటాదారులు కూడా సహకారం అందించవచ్చు. శక్తివంతమైన మేధో సంపత్తి (ఐపీ) హక్కుల వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన ఐపీ ఫైలింగ్‌ల దిశగా మేము పని చేస్తున్నాం. మంజూరైన పేటెంట్లలో ఈ వేగవంతమైన పెరుగుదల దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో, ఐపీ హక్కులను మంజూరు చేయడంలో భారత పేటెంట్ కార్యాలయ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనేక ఆవిష్కరణలతో దరఖాస్తుల నాణ్యత పెరగడాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment