కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు | The new Tribunal will not be possible | Sakshi
Sakshi News home page

కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు

Published Thu, Aug 27 2015 1:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు - Sakshi

కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు

కృష్ణా జలాలపై రాష్ట్ర అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం
♦  ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
♦  అవార్డులో అన్యాయాన్ని సరిదిద్దండని అడగండి
♦  అంతేగానీ మళ్లీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే ఎలా?
♦  జలాల్లో అన్యాయం వల్లే విడిపోయామన్న తెలంగాణ న్యాయవాది
♦  ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఎలా అని ప్రశ్న
♦  ఉమ్మడి రాష్ట్ర కేటాయింపులను పంచుకోవచ్చు కదా అన్న ధర్మాసనం
♦  విచారణ సెప్టెంబర్ 10కి వాయిదా..

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

‘ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు’ అని పేర్కొంది. కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కూడా అభిప్రాయపడింది. ఈ దిశగా కేంద్రానికి నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించింది. కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తమ వాదనను కృష్ణా నదీ జలాల ట్రిబ్యునళ్లు ఏనాడూ వినలేదని, కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం-1956లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి ఏడాది కిందటే అర్జీ పెట్టుకుంది. ఈ అభ్యర్థనను కేంద్రం పరిష్కరించకుండా నాన్చింది. దీంతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కిందటి నెల 21న విచారణకు రాగా.. ఇప్పటివరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న 5 పిటిషన్లతోపాటు వింటామని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆ పిటిషన్లు బుధవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతిల ధ ర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.
 
ఇలా అయితే ఎంత దాకా..?: మహారాష్ట్ర
మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపిస్తూ.. ఈ వివాదాన్ని లాక్కుం టూ పోతే ఎంతకాలానికి పరిష్కారమవుతుందని ప్రశ్నించారు. ‘‘బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో తుది అవార్డు ఇచ్చింది. దాన్ని ఇంతవరకు కేంద్రం నోటిఫై చేయలేదు. ఎందుకంటే ఆ అవార్డు కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆ అవార్డు నోటిఫై కాకుండా కోర్టు స్టే ఇచ్చింది. ఆ సమస్య అలా ఉండగానే.. 2014లో ఏపీ విడిపోయింది.

ఇప్పుడు తెలంగాణ కూడా మళ్లీ మొదట్నుంచి వాదనలు వినాలంటోంది. పైగా ఇప్పుడు కొత్త ట్రిబ్యునలే ఏర్పాటు చేయాలంటోంది. మరోవైపు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను రెండు కొత్త రాష్ట్రాల మధ్యే పంచుకోవాల్సి ఉంది. కానీ దానిపై విచారణ జరగాలని, తెలంగాణ కోరడంతో.. నిబంధనలు రూపకల్పన చేయాల్సిన ప్రక్రియ మొదలైంది. కానీ ఈలోగా ట్రిబ్యునల్‌లో ఒక సభ్యుడు రాజీనామా చేశారు. దాంతో విచారణ ఆగిపోయింది. ఆర్టికల్ 262 ప్రకారం ట్రిబ్యునల్ తీర్పులపై సుప్రీంకోర్టు సహా ఏ కోర్టూ జోక్యం చేసుకోజాలదు. అందువల్ల బ్రిజేష్‌కుమార్ అవార్డును కేంద్రం నోటిఫై చేసేలా ఆదేశాలు జారీచేయాలి..’’ అని ఆయన కోరారు.
 
నోటీసులు జారీ చేయలేం..
తెలంగాణ తరఫున వైద్యనాథన్ వాదిస్తూ.. న్యాయం జరగాలన్న తలంపుతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా విచారణ జరుపుతూ కేంద్రానికి నోటీసులు జారీచేయాలని కోరారు. 1956 చట్టంలోని సెక్షన్ 3ను మరోసారి విడమరిచి చెప్పారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ఆ దిశగా నోటీసులు ఇవ్వలేం. సెక్షన్ 89ను మీరు ఇలా అర్థం చేసుకోవచ్చుగా.. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కేటాయింపులను రెండు రాష్ట్రాలు పంచుకోవచ్చని అనుకోవచ్చుగా..’’ అని పేర్కొన్నారు.

దీనిపై వైద్యనాథన్ జవాబిస్తూ ‘‘సంబంధిత నియమావళిని ట్రిబ్యునల్ నిర్దేశించాలి.. కానీ మేమిప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం..’’ అని అన్నారు. అందుకు జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదు. మీరు ఏపీ నుంచి పంచుకుంటే సరిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో వైద్యనాథన్ మరోసారి రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడారు. అందుకు జస్టిస్ మిశ్రా.. ‘‘ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 20 మైన్లు ఉన్నాయనుకుందాం. వాటిని ఎలా పంచుకుంటారు?’’ అని అడిగారు.

అందుకు వైద్యనాథన్ బదులిస్తూ.. ‘‘అసలు బ్రిజేష్‌కుమార్ అవార్డే నోటిఫై కాలేదు. ఆ అవార్డు ఇచ్చిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్‌కే సమ్మతం కాలేదు. అలాంటప్పుడు మేం ఉన్నవాటిలో ఎలా పంచుకుంటాం..?’’ అని అన్నారు. దీంతో జస్టిస్ మిశ్రా.. ‘‘అలాంటప్పుడు మీరు కొత్త ట్రిబ్యునల్ కావాలంటూ పట్టుబట్టడం కన్నా.. అవార్డు మీకు సమ్మతం కాదని పిటిషన్ వేయండి. ఒకవేళ ఉమ్మడి ఏపీకి కేటాయింపులు పెరుగుతాయేమో.. అప్పుడు మీకు కూడా పెరుగుతాయి కదా..’’ అన్నారు. అనంతరం ట్రిబ్యునల్‌లో సభ్యుడి నియామకానికి తీసుకున్న చర్యలేవో చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 10కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
 
జలాల్లో అన్యాయంపైనే మేం విడిపోయాం..
తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పైనే ప్రధానంగా విచారణ జరిగింది. విచారణ మొదలుకాగానే జస్టిస్ దీపక్ మిశ్రా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వైద్యనాథన్‌ను ఉద్దేశించి.. ‘‘మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిపిన కేటాయింపుల నుంచి పంచుకోవచ్చు కదా.. మీరు ఏపీ కేటాయింపుల నుంచి ఆశించవచ్చు.. సెక్షన్ 89 పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకే పెట్టుకుంటే సరిపోతుంది కదా..’’ అని వ్యాఖ్యానించారు.

అనంతరం వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. ‘‘అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం మేం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. కానీ ఎలాంటి స్పందనా లేదు. ఏడాది దాటిపోయింది. అందువల్లే మీ వద్దకు వచ్చాం. మేం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలనుకున్నదే జలాల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్న బాధతో.. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా?’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement