Justice TS Thakur
-
అభివృద్ధి చెందిన దేశాల వల్లే పర్యావరణ కాలుష్యం
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యా వరణ కాలుష్యానికి అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల కంటే అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల వల్లే ఎక్కువ హాని కలుగుతోందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్. ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పర్యావరణ పరిరక్షణ, భారత్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అన్న అంశంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సోమవారం జాతీయ సదస్సు జరిగింది. ఢిల్లీకి చెందిన క్యాపిటల్ ఫౌండేషన్, హైదరాబాద్‌కి చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జస్టిస్ టీఎస్.ఠాకూర్ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని ప్రపంచ సమస్యగా అభివర్ణిం చారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ అవార్డును ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌కు, వార్షిక అవార్డులను మే ఫెయిర్ గ్రూప్ హోటల్స్ సీఎండీ దిలీప్ రే, సింబోటిక్ సైన్స్ సంస్థ చైర్మన్ రాకేష్ మల్హోత్రాలకు, ప్రొఫెసర్ టి.శివాజీ రావ్ జాతీయ అవార్డును ప్రొఫెసర్ ధర్మేంద్ర సింగ్‌కు ఇచ్చారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే.పట్నా యక్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్, క్యాపిటల్ ఫౌండే షన్ ప్రధాన కార్యదర్శి డా. వినోద్ సేతి, పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి, తూర్పు కనుమల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దిలీప్ రెడ్డి, డా. దొంతి నరసింహారెడ్డి, సంజీవరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
భవిష్యత్ సవాళ్లకు జడ్జీలు సిద్ధం కావాలి
వీడ్కోలు ప్రసంగంలో సీజేఐ న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్.. తన పదవీ విరమణ సందర్భంగా మంగళవారం చేసిన వీడ్కోలు ప్రసంగంలోనూ జడ్జీల కొరత, పెండింగ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల కేసు లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘మనకు మౌలిక సదుపాయాలు, జడ్జీల కొరత వంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో సైబర్ చట్టాలు, మెడికో – లీగల్, జెనెటిక్స్, గోప్యత వంటి తీవ్ర అంశాలూ మనముందుకు రానున్నాయి. దేశం సంఘటితంగా సాగేందుకు ఈ సవా ళ్లను ఎదుర్కోవడానికి జడ్జీలు సిద్ధం కావా లి’ అని చెప్పారు. న్యాయవాద వృత్తిపై తనకెంతో ప్రేమ అంటూ.. రిటైర్డ్ జడ్జీలు న్యాయవాద వృత్తిని కొనసాగించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తే బావుంటుందని సరదాగా అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బుధవారం సీజేఐగా బాధ్య తలు చేపట్టనున్న జస్టిస్ ఖేహర్ మాట్లా డుతూ.. ‘జస్టిస్ ఠాకూర్ దేశ మంతా తిరిగి చట్టాలపై మంచి మాటలు చెప్పారు. మీరు ఉపరాష్ట్రపతి కాబోతున్నట్లు ఓ పత్రికలో వచ్చిందని ఆయనతో చెప్పా. ఆయన నవ్వి ఏకంగా రాష్ట్రపతే కావాల నుకుంటున్నాం అని చెప్పార’న్నారు. -
రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు
► 9 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరపుతుందన్న సుప్రీం ► పాత నోట్ల వినియోగాన్ని పొడిగించాలన్న పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, వినియోగ బిల్లుల చెల్లింపులకు అనుమతించాలన్న విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వినతులతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ బెంచ్ మొత్తం 9 అంశాలపై విచారణ జరుపుతుందని తెలి పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులకు ఉన్న ప్రజా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు అప్పగించడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. ‘రద్దు చేసిన నోట్ల వినియోగాన్ని పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రమే సరైనది’ అని పేర్కొంది. ‘24 వేల విత్‌డ్రా’ను నెరవేర్చండి బ్యాంకుల్లో వారానికి విత్‌డ్రా పరిమితిని రూ. 24 వేలుగా నిర్ణయించినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అందజేయడం లేదని, ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని వచ్చిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ప్రభుత్వం కోరిన 50 రోజుల గడువు ఇంకా ముగియలేదని, ఆ సమయానికల్లా నగదు చలామణి పెరుగుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకూ 40 శాతం పాతనోట్లను కొత్త రూ.2,000, రూ.500 నోట్లతో భర్తీ చేసినట్టుగా కేంద్రం చెప్పింది. వారానికి రూ. 24 వేల విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ఆ హామీని నెరవేర్చాలని సూచించింది. హైకోర్టుల్లో నోట్ల రద్దు విచారణపై స్టే నోట్ల రద్దును సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే విధించింది. వీటన్నింటిని తామే విచారిస్తామంది. ఇకపై దీనికి సంబంధించిన రిట్ పిటిషన్లను ఇతర కోర్టు స్వీకరించరాదని పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చంది. అలాగే నవంబర్ 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు స్వీకరించిన రూ.8,000 కోట్లను కొత్త కరెన్సీతో నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అటార్నీ జనరల్ హామీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. -
హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి
ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం ► లైసెన్స్ లను మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయొద్దు ► దీన్ని ఆదాయ మార్గంగా చూడొద్దు ► సాధారణ ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకోవాలి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణా లను మూసేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసే వరకు మాత్రమే ఈ దుకాణాలను నిర్వహించుకోవచ్చంది. వచ్చే ఏడాది మార్చి 31 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి లిక్కర్ విక్రయాలను సూచించే బ్యానర్లన్నంటినీ తొలగించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతుండడంపై ఇటీవల సుప్రీం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిం దే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదా రులపై ఉన్న అన్ని మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలు జరగ కుండా చూసేలా ఎక్సైజ్ చట్టాలను సవరించాలంటూ దాఖలైన పలు వినతుల నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. హైవేల సమీపంలో లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వాలని, ఇందుకోసం నిబంధనలు సడలించాలన్న పంజాబ్ ప్రభుత్వం వైఖరిని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టింది. మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తు చేస్తూ.. సాధారణ ప్రజల మేలుకోసం చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాలు సైతం రోడ్ల వెంబడి ఉన్న లిక్కర్ షాపుల్ని తొలగించడంలో నిర్లక్ష్యం చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం పెరిగిపోతున్నదని, దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల వెంబడి లిక్కర్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఒక ఆదాయ మార్గంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూడరాదని హితవు పలికింది. ఈ విషయంలో కేంద్రం సైతం నిర్మాణాత్మకంగా వ్యవహరించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. -
విత్‌డ్రాకు సరిపడా నగదు లేదు
సుప్రీం కోర్టులో కేంద్రం వెల్లడి ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?: కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: ఎలాంటి అభ్యంతరం లేకుండా వారానికి బ్యాంకు ఖాతాదారుడు ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వారానికి రూ. 24 వేల పరిమితి ఉందని చెప్పినా... రూ. 8 వేలు, రూ. 10 వేలే ఇస్తున్నారని ఆక్షేపించింది. రద్దయిన నోట్ల రూపంలో ఎంత మొత్తం వచ్చింది? ఎంత మేర కొత్త నోట్లు ముద్రించారో చెప్పాలని ఆదేశించింది. ప్రజలు విత్‌డ్రా చేసుకునే మొత్తానికి సమానంగా ప్రభుత్వం వద్ద కరెన్సీ లేదని, సరిపడా నోట్లు ప్రింట్ కాలేదంటూ ప్రభుత్వం సమాధానమిచ్చింది. నోట్ల రద్దు, సహకార సంఘాలకు ఆంక్షలపై దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, డి.వై.చంద్రచూడ్‌ల బెంచ్ శుక్రవారం విచారించింది. పరిస్థితి చక్కపడేందుకు ఎంత సమయం అవసరమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 6 నెలలు పడుతుంది: చిదంబరం అటార్నీ జనరల్ రోహత్గీ సమాధానమిస్తూ... రద్దయిన నోట్ల రూపంలో రూ. 12 లక్షల కోట్లు వచ్చిందని, మరో లక్ష కోట్లు వస్తుందని చెప్పారు. రద్దయిన నోట్లలో 80 % తిరిగి ఖజానాకు చేరాయని, రూ. 3 లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయన్నారు. ఇంకా రూ. 9 లక్షల కోట్ల లోటు ఉందా? అంటూ కోర్టు ప్రశ్నించింది. కొంత అసౌకర్యం తప్పనిసరని, పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పిటిషనర్ తరఫు కపిల్ సిబల్ వాదిస్తూ... వాస్తవ పరిస్థితి ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉందని, బ్యాంకుల్లో నగదు లేదని అన్నారు. మాజీ ఆర్థిక మంత్రి, న్యాయవాది పి.చిదంబరం వాదిస్తూ... దేశంలోని ముద్రణా కేంద్రాలన్నీ కలిపి నెలకు రూ. 300 కోట్ల నగదునే ముద్రించగలవని, రద్దయిన ప్రతీ నోటును భర్తీ చేయాలంటే కనీసం 6 నెలలు పడుతుందన్నారు. సిబల్ జోక్యం చేసుకుంటూ చట్టబద్దమైన నా డబ్బును చట్టబద్ధంగా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించరా? అని ప్రశ్నించారు. అనుమతించరని రోహత్గీ చెప్పారు. ఎందుకు? అని సిబల్ ప్రశ్నించగా.. డబ్బు లేదు అని రోహత్గీ బదులిచ్చారు. -
చీఫ్ జస్టిస్ వర్సెస్ సెంటర్
జడ్జీల నియామకం విషయంలో న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైకోర్టులలో 500 వరకు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మండిపడ్డారు. ఈపాటికి పనిచేస్తూ ఉండాల్సిన 500 మంది జడ్జీలు పనిచేయడం లేదన్నారు. అసలు నియామకాలే జరగలేదని తాను అనట్లేదని.. ఇప్పటికి 121 మందిని నియమించారని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ భారీసంఖ్యలో ప్రతిపాదనలు పెండింగులోనే ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకుంటుందనే భావిస్తున్నానని చెప్పారు. అడ్వాన్స్ రూలింగ్ చైర్మన్ లేరని, సాయుధ దళాల అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని, కాంపిటీషన్ కమిషన్‌కు కూడా చైర్మన్ లేరని అన్నారు. కొంతమంది ఈ పదవులు చేపట్టడానికి నిరాకరిస్తున్న మాట వాస్తవమేనని.. ఎందుకంటే ప్రభుత్వం చైర్మన్లు కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం కూడా కల్పించలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాశానని.. నిబంధనలు మార్చాలని లేదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా ఇలాంటి నియామకాలకు అర్హులుగా చేయాలని చెప్పానన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ట్రిబ్యునళ్లకు అధ్యక్షత వహించేందుకు సుప్రీంకోర్టు జడ్జి ఒక్కరూ అందుబాటులో లేకపోవచ్చని ఆయన చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. చీఫ్ జస్టిస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ జడ్జీల నియామకంలో మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేమని ఆయన అన్నారు. ఈ ఏడాదే తాము 120 మంది హైకోర్టు జడ్జీలను నియమించామని చెప్పారు. -
ఎడతెగని కీచులాట
ప్రజాస్వామ్యంలో కీలక వ్యవస్థలు పరస్పరం తలపడటం... అది అంతూదరీ లేకుండా కొనసాగడం ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కేంద్రానికీ, న్యాయ వ్యవస్థకూ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం తీరు ఇలాగే ఉంది. కేంద్రంలో ఎవరున్నా ఇందులో మార్పుండటం లేదు. జస్టిస్ టీఎస్ ఠాకూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చాక దీని సంగతి తేల్చాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. గతంలో పనిచేసినవారు కేంద్రానికి ప్రతిపాదనలు పంపి ఊరుకునేవారు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసేవారు. కానీ పురోగతి శూన్యం. అందుకే కాబోలు... పాతవారికి భిన్నంగా జస్టిస్ ఠాకూర్ కేంద్రాన్ని ‘ఎలాగైనా...’ ఒప్పించి తీరాలన్న దృక్పథాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. న్యాయమూర్తుల నియామకంపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా నాలుగైదు రోజుల క్రితం ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు అందులో భాగమే. న్యాయమూర్తుల నియామకాలపై సాచివేత ధోరణి అవలంబించడం ద్వారా న్యాయవ్యవస్థను నిరోధించాలని చూస్తే... నాశనం చేయబూనుకుంటే చూస్తూ ఊరుకోబోమని కార్యనిర్వాహక వ్యవస్థను ఆయన హెచ్చరించారు. ‘మాకుగా మేం ఏ వ్యవస్థతోనూ ఘర్షణ పడాలని అనుకోవడం లేదు. కానీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని కూడా ఆయనన్నారు. జస్టిస్ ఠాకూర్ ఈ మాదిరి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదు. గత మార్చిలో ప్రధాని, ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు పాల్గొన్న జాతీయ సదస్సులో ఏకంగా ఆయన కంటతడి పెట్టారు. మరో సందర్భంలో ‘మేం న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించకండి’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆ మాదిరే ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ఉన్నవారు ఇలా మాట్లాడటం తగదని అభిప్రాయపడినవారున్నారు. సమస్య తీవ్రత నిజమే అయినా దాన్ని పరిష్క రించుకోవడానికి ఘర్షణ వైఖరి మంచిది కాదన్నవారున్నారు. ఆయన తీరుపై వ్యక్తమవుతున్న అభిప్రాయాల మాటెలా ఉన్నా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత ఉండటం, కేసుల పరిష్కారానికి అదొక అడ్డంకిగా ఉండటం కాదనలేని సత్యం. అయిదేళ్లుగా వివిధ కోర్టుల్లో 80 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 16 లక్షలకు పైగా కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్ పడితే, మిగిలినవి జిల్లా కోర్టుల్లో, సబార్డినేట్ కోర్టుల్లో కునుకు తీస్తున్నాయి. సుప్రీంకోర్టులో 27,184 కేసులు మూడేళ్లుగా ఎటూ తేల కుండా ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. లక్షలాది మంది పౌరుల జీవితాలు వీటితో ముడిపడి ఉన్నాయని... తుది నిర్ణయం కోసం వారంతా ఏళ్లతరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని సానుభూతితో అర్ధం చేసుకుంటే తప్ప ఈ పెండింగ్ సమస్య తీరదు. అయితే పెండింగ్ కేసుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి చొరవా లేదని చెప్పలేం. ఇందుకు దోహదపడుతున్న పలు అంశాలను అది గుర్తించింది. న్యాయ మూర్తుల కొరత అందులో ఒకటి మాత్రమే. కేంద్ర, రాష్ట్ర చట్టాలు లెక్కకు మిక్కిలి ఉండటం వీటిలో ప్రధానమైనదని భావించింది. మొదటి అప్పీళ్లు పేరుకుపోవడం, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్వంటివి వెలువరించే తీర్పులను హైకోర్టుల్లో సవాల్ చేసే ధోరణి పెరగడం, తరచుగా కేసుల వాయిదా, విచారణలో ఉన్న కేసుల తీరుతెన్ను లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే, ఏ స్థితిలో ఉన్నాయో ఆరా తీసే వ్యవస్థ అమల్లో లేకపోవడం వగైరాలు పెండింగ్‌కు ప్రధాన కారణమని భావించింది. లా కమిషన్ సైతం ఈ జాప్యాన్ని నివారించడానికి కొన్ని సూచనలు చేసింది. వీటన్నిటినీ లోతుగా సమీక్షించి తుది నిర్ణయానికి రావాలంటే రెండు వ్యవస్థలూ సదవగాహ నతో సమష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ధోరణి ఇరువైపులా కనబ డటం లేదు. సుప్రీంకోర్టు, హెకోర్టుల్లో కేసులు పెండింగ్ పడిపోవడం గురించి మాట్లాడుతున్న న్యాయవ్యవస్థ కింది కోర్టుల్లో తెమలని కేసుల గురించి మాట్లా డదేమని కేంద్రం అడుగుతోంది. అది సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నే. కింది కోర్టుల్లో 5,000కు పైగా ఖాళీలున్నా న్యాయవ్యవస్థ వాటిని భర్తీ చేయలేక పోతోంది. ఇలా ఎవరికి వారు ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ కాల క్షేపం చేయడంవల్ల సామాన్య పౌరులకు ఒరిగేదేమీ ఉండదు. వారికి కావలసింది సత్వర న్యాయం. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి గత నెలతో సంవత్సరం పూర్తయింది. అంతకుముందున్న కొలీజియం వ్యవస్థే ప్రస్తుతం అమలవుతోంది. కానీ దానికి అనుగుణంగా వెలువడాల్సిన విధాన పత్రం(ఎంఓపీ)పై పేచీ ఏర్పడింది. ఎంఓపీని ఖరారు చేసి పంపితే నియామకాలు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వమూ... దాని సంగతి విడిచి పెట్టి ముందు నియామకాల సంగతి చూడమని సర్వోన్నత న్యాయస్థానమూ భీష్మించుకు కూర్చున్నాయి. ఆ విషయంలో కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య అంగీకారం కుదిరితే తప్ప నియామకాల్లో పురోగతి సాధ్యం కాదు. సమస్య తీవ్రతను గమనించి పాత ఎంఓపీ ఆధారంగా వివిధ హైకోర్టుల్లో కొత్తగా 86మంది న్యాయమూర్తుల నియామకం, ఇప్పుడున్న 121మంది అదనపు న్యాయ మూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా ఖరారు చేయడంవంటివి పూర్తి చేశా మని... ఎన్నాళ్లిలా నెట్టుకురావాలని కేంద్రం అడుగుతోంది. కానీ చేయాల్సిన నియామకాలతో పోలిస్తే పూర్తయింది చాలా స్వల్పమన్నది సుప్రీంకోర్టు వాదన. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 160మంది న్యాయమూర్తులకు 77మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేస్తోంది. ఇది వ్యక్తుల మధ్యనో, వ్యవస్థల మధ్యనో ఆధిపత్య పోరుగా, అహంభావ సమస్యగా మారడం మంచిది కాదు. ప్రజల శ్రేయస్సును, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడం అవసరమని ఇద్దరూ గమనించాలి. సంయమనంతో పరిష్కారం దిశగా కదలాలి. -
సుప్రీం తీర్పు 17కి వాయిదా
• రాష్ట్ర సంఘాలకు • నిధులు ఆపేయండి • సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వు న్యూఢిల్లీ: బీసీసీఐ కాస్త ఊపిరి పీల్చుకుంది. లోధా ప్యానెల్ సూచనల అమలుకు ఒక్క రోజులోగా హామీ ఇవ్వకపోతే ఆఫీస్ బేరర్లందరినీ తప్పిస్తామని హెచ్చరించిన సుప్రీం కోర్టు తమ తుది తీర్పును ఈనెల 17కు వాయిదా వేసింది. అయితే సంస్కరణల అమలుకు రాష్ట్ర సంఘాలు సుముఖత వ్యక్తం చేసే వరకు వాటికి ఎలాంటి నిధులు విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం ఈ విచారణ జరిపింది. ఇప్పటికే 13 సంఘాలకు రూ.16.72 కోట్ల చొప్పున బీసీసీఐ విడుదల చేసింది. కానీ లోధా సంస్కరణలను అమలు చేస్తామని ఆయా సంఘాలు తీర్మానించేదాకా వాటిని ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకం కాదని, కొన్ని సాంకేతికపరమైన అడ్డంకులు ఉన్నాయని బోర్డు కౌన్సిల్ రాధా రంగస్వామి కోర్టుకు తెలిపారు. తాము వాట న్నింటినీ తొలగిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతకన్నా ముందు మీరు అఫిడవిట్ దాఖలు చేయండని సూచించి విచారణను 17కు వాయిదా వేసింది. మరోవైపు లోధా ప్రతిపాదనల అమలును అడ్డుకునేందుకు ఐసీసీతో సంప్రదింపులు చేయడంపై పది రోజుల్లో వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను కోర్టు ఆదేశిం చింది. గత నెల 21న జరిగిన తమ ఏజీఎంలో లోధా ప్యానెల్ సూచనలను బేఖాతరు చేస్తూ అన్ని కమిటీల నియామకం చేపట్టడంతో పాటు కార్యదర్శి ఎన్నిక కూడా చేయడంతో ఈ వివాదం ముదిరిన విషయం తెలిసిందే. -
దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ
అహ్మదాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ ముందున్న అసలైన సవాలు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. గుజరాత్ జ్యుడీషియల్ అకాడెమీని శనివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా 14 లక్షల కేసుల్ని పరిష్కరించానని ఆయన తెలిపారు. అయితే చిన్న కేసుల్ని పరిష్కరించడమంటే చీపురు చేతబట్టి.. ఇంటిలో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చటంలాంటిదేనన్న భావన కలిగిందని, దీర్ఘకాలంగా కోర్టుల్లో మూలుగుతున్న కేసులను పరిష్కరించడంలోనే అసలైన సవాలు దాగుందన్న విషయం అవగతమైందని పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు
కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. రోడ్డు ప్రమాదాల గురించిన విషయంలో సమాధానం ఇంతవరకు పంపనందుకు రవాణా మంత్రిత్వశాఖకు రూ. 25వేల జరిమానా విధించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్ అని, కానీ కోర్టులు సరిగా పనిచేయలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికి ఏడాది గడిచినా మీరు (కేంద్రం) అఫిడవిట్ దాఖలు చేయలేదని అంటూ.. ''ఇక్కడేమైనా పంచాయతీ నడుస్తోందని అనుకుంటున్నారా'' అని వ్యాఖ్యానించారు. దాంతో.. మూడు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. -
70 వేల మంది జడ్జీలు అవసరం
♦ పెండింగ్ కేసుల పరిష్కారంపై సీజేఐ ఠాకూర్ వెల్లడి ♦ జడ్జీల కొరతపై మళ్లీ ఆందోళన కటక్: దేశంలో జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఓ సదస్సులో జస్టిస్ ఠాకూర్ ప్రధాని మోదీ సమక్షంలో ఇదే అంశాన్ని ప్రస్తావించి కంటతడి పెట్టుకోవడం తెలిసిందే. తాజాగా ఆదివారమిక్కడ జరిగిన ఒడిశా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ.. జడ్జీల కొరత అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. జనాభా పెరుగుదల రేటు ప్రకారం...పెండింగ్ కేసుల పరిష్కారానికి 70 వేల మందికిపైగా జడ్జీల అవసరముందన్నారు. ‘జడ్జీల నియామకాలను సత్వరం చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అయితే ఈ నియామకాలతో సంబంధమున్న యంత్రాంగం మాత్రం చాలా నిదానంగా కదులుతోంది’ అని తెలిపారు. హైకోర్టు జడ్జీలకు సంబంధించి 170 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.న్యాయం పొందడమనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని వారు పొందకుండా ప్రభుత్వాలు నిరాకరించలేవని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. జడ్జీల కొరత ప్రధాన సవాలు.. ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో జడ్జీల కొరత ఒకటని ఆయన అన్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో మంజూరైన జడ్జీల పోస్టులు 900 కాగా.. వాటిలో 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరాన్ని 1987లో భారత లా కమిషన్ అప్పట్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి 44 వేల మంది జడ్జీలు అవసరమని సూచించిందన్నారు. ప్రస్తుతం కేవలం 18 వేల మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఆర్థికసాయం చేస్తామన్నారు. -
నేడే నీట్ తొలి విడత పరీక్ష
పరీక్ష వాయిదాపై పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ తొలి విడత (నీట్-1) పరీక్ష అన్ని అడ్డంకులను దాటుకుని నేడు జరగనుంది. ఈ పరీక్షను ఆపాలని, తేదీలు మార్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ‘చివరి నిమిషంలో ఏదీ జరగదు. ధర్మాసనం ఇంతకుముందే దీనిపై వాదనలు విన్నది. దీంట్లో మార్పులేమీ లేవు. పరీక్ష సజావుగా జరిగేలా అందరూ సహకరించాలి’ అని ఆదేశించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, కర్ణాటకతో పాటు సీఎంసీ, వెల్లూరు మైనారిటీ సంస్థలు తాము వ్యక్తిగతంగా నీట్ నిర్వహించుకుంటామనటాన్ని తిరస్కరించింది. అన్ని ప్రభుత్వ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు కచ్చితంగా నీట్ పరిధిలోకే వస్తాయని మరోసారి తెలిపింది. అంతకుముందు విద్యార్థుల తరపున కొందరు లాయర్లు వాదన వినిపిస్తూ.. ‘ఇప్పటికే వివిధ రాష్ట్రస్థాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి పరీక్షకు సన్నద్ధమవటం అంత సులభమేం కాదు. అందుకే పరీక్షను వాయిదా వేయాలి’ అని కోరారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2016-17 విద్యాసంవత్సరానికి మే 1న, జూన్ 24 రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించాల్సిందేనని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు పరీక్షల ఫలితాలు ఆగస్టు 17న విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబరు 30వ తేదీలోగా పూర్తి అవుతుందని పేర్కొంది. -
ప్రధాని సమక్షంలో సీజేఐ కంటతడి
న్యాయ వ్యవస్థపై ఏమిటీ విమర్శలు? ♦ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగం ♦ సీఎంలు, హైకోర్టుల సీజేల సదస్సులో ఉద్వేగ ప్రసంగం ♦ సీజేఐ ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ప్రధాని ♦ మంత్రులు, సుప్రీం సీనియర్ జడ్జీలతో చర్చకు ప్రతిపాదన న్యూఢిల్లీ: దేశంలో జడ్జీలు అసాధారణ స్థాయిలో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య నెలకొన్న భారీ అంతరాన్ని గణాంకాలతో సహా వివరిస్తూ పలుమార్లు కంటతడి పెట్టారు! అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే!! పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సులో సీజేఐ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తీవ్రంగా ఉన్న జడ్జీల కొరత, జడ్జీలపై పని భారం, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు.. ఇలా పలు అంశాలను స్పృశిస్తూ మోదీ సమక్షంలోనే భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ క్రమంలో మూడుసార్లు భావోద్వేగానికి గురై, ఉబికి వస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకున్నారు. ‘దేశంలో కేసులు గుట్టలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారణకు స్వీకరించేందుకు తగినంత మంది జడ్జీలు లేరు. మున్సిఫ్ కోర్టు జడ్జి నుంచి సుప్రీంకోర్టు జడ్జి వరకు ఏటా సగటున 2,600 కేసులను పరిష్కరిస్తున్నారు. అదే అమెరికాలో జడ్జీలు ఏటా సగటున పరిష్కరిస్తున్నది 81 కేసులే’’ అని వివరించారు. జడ్జీల సామర్థ్యానికీ పరిమితి ఉంటుందన్నారు. ‘కక్షిదారులు, జైళ్లలో మగ్గుతున్న వారి తరఫునా, దేశాభివృద్ధి, పురోగతి కోసం మిమ్మల్ని వేడుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా స్పందించండి. పెండింగ్ కేసుల విషయంలో న్యాయ వ్యవస్థపై విమర్శలు సరి కాదని అర్థం చేసుకోండి ’ అంటూ ప్రధానిని ఉద్దేశించి గద్గద స్వరంతో అన్నారు. కోట్లలో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి జడ్జీల సంఖ్యను ప్రస్తుతమున్న 21 వేల నుంచి 40 వేలకు పెంచాల్సి ఉన్నా (1987 నాటి సిఫార్సు) కేంద్రం నిష్క్రియగా వ్యవహరిస్తోందని సీజేఐ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసుల భారాన్ని పూర్తిగా న్యాయ వ్యవస్థపైనే నెట్టేయడం కుదరదని, అది సరికాదని తేల్చిచెప్పారు. నియామకాలు దశాబ్దాలుగా పెండింగే 1987లో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 10 మందిగా ఉన్న జడ్జీల సంఖ్యను 50కి పెంచాలని న్యాయ కమిషన్ ఆ ఏడాది సిఫార్సు చేసిందని సీజేఐ ఠాకూర్ గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని 2002లో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిందని, ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని పార్లమెంటు స్థాయీ సంఘం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. కానీ నాటి నుంచి ప్రభుత్వ నిష్క్రియాపరత్వం యథాతథంగా కొనసాగుతూనే ఉందన్నారు. ఫలితంగా నేటికీ దేశంలో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 15 మంది జడ్జీలే ఉన్నారని సీజేఐ తెలిపారు. ఇది అమెరికా, యూకే, కెనడాలలోకన్నా చాలా తక్కువన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ప్రస్తుతం సుమారు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారం రోజుల్లో కొలీజియం నిర్ణయం దేశవ్యాప్తంగా జడ్జిల నియామకాలకు సంబంధించి మార్చిన విధివిధానాలను సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయిస్తుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత కోసం కేంద్రం చేసిన సూచనలపై కొలీజియం చర్చించి వారం రోజుల్లో సమాధానం పంపించనున్నట్లు ఠాకూర్ తెలిపారు. సమస్యను పరిష్కరిద్దాం: ప్రధాని సీజేఐ ఠాకూర్ ఆవేదనపై ప్రధాని నరేంద్ర మోదీ అదే వేదికపై తక్షణం స్పందించారు. నిజానికి న్యాయ శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సదస్సులో ప్రధాని ప్రసంగం లేదు. అయినప్పటికీ ఆయన అప్పటికప్పుడు ఈ అంశంపై మాట్లాడారు. ‘‘1987 నుంచి ఎంతోకాలం గడచిపోయినందున ఈ విషయంలో సీజేఐ బాధను అర్థం చేసుకోగలను. రాజ్యాంగపరమైన అడ్డంకులు తలెత్తకుంటే మంత్రులు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలు అంతర్గతంగా సమావేశమై ఈ అంశానికి పరిష్కారం కనుక్కోవచ్చు’’ అంటూ ప్రధాని ప్రతిపాదించారు. అడ్‌హక్ జడ్జీలుగా మాజీలు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం దిశగా సీఎంలు, హైకోర్టుల సీజేల సదస్సు కీలక ముందడుగు వేసింది. రిటైరైన న్యాయాధికారులను అడ్‌హక్ జడ్జీలుగా నియమించేందుకు ఆర్టికల్ 224(ఏ)ను ప్రయోగించాలని తీర్మానించింది. ఈ విషయాన్ని సీజేఐ ఠాకూర్ ప్రకటించారు. గత ఐదేళ్లలో అప్పీళ్లపై విచారణ జరగని క్రిమినల్ కేసులను అడ్‌హక్ జడ్జీలు విచారిస్తారని వెల్లడించారు. రెండేళ్ల పదవీకాలం లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ జడ్జీలను నియమిస్తారన్నారు. -
మోదీ ముందు సుప్రీం చీఫ్ జస్టిస్ కంటతడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రధాని నరేంద్రమోదీ ముందు కంటతడి పెట్టారు. మొత్తం భారాన్ని న్యాయవ్యవస్థపైనే వేయొద్దని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరింతమంది న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. 'దేశ అభివృద్ధికోసం నేను మిమ్మల్ని(కేంద్ర ప్రభుత్వాన్ని) వేడుకుంటున్నాను. న్యాయవ్యవస్థపై మొత్తం భారాన్ని మోపవద్దు.. ప్రపంచ దేశాలతో ఒక్కసారి మా కార్యశీలతను పోల్చి చూసుకోండి' అని అన్నారు. మోదీగారు.. ఎఫ్‌డీఐ, మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు.. దాంతోపాటు ఇండియాకు ఇంకా న్యాయమూర్తులు కూడా చాలా అవసరం అని గుర్తించాలి అని ఆయన చెప్పారు. అమెరికాలో న్యాయమూర్తులు కేవలం 81 కేసులను పరిష్కరిస్తుంటే ఒక భారతీయ జడ్జీ మాత్రం కనీసం 2,600 కేసులు చూస్తున్నారని.. వారిపై ఎంతటి భారం పడుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. -
‘ముస్లిం పెళ్లి చట్టాల’పై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: ముస్లిం వైవాహిక చట్టాలపై అధ్యయనానికి నియమించిన కమిటీ రూపొందించిన నివేదికను 6 వారాల్లోగా తమ ముందుంచాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం అనుసరిస్తున్న బహుభార్యత్వం, తలాక్ విధానాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ థాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. కమిటీ నివేదికను తమ ముందుంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. -
ఒకే కారులో సుప్రీం చీఫ్ జస్టిస్, మరో న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సరి-బేసి నిబంధన పాటించాలని ఎవరూ చెప్పరు, చెప్పలేరు. వీవీఐపీ హోదాలో ఆయనకు ఈ నిబంధన నుంచి మినహాయింపు కూడా ఉంది. అయినా.. తాను లేవనెత్తిన అంశానికి కట్టుబడి ఉండాలన్న నిబద్ధత ఆయనకు ఉంది. అందుకే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. తోటి న్యాయమూర్తి ఏకే సిక్రీతో కలిసి ఈ 15 రోజులూ కార్ పూలింగ్ పద్ధతిలో వస్తున్నారు. జస్టిస్ ఠాకూర్‌కు బేసి సంఖ్యతో ముగిసే నంబరున్న కారు ఉండగా, జస్టిస్ సిక్రీ కారు నెంబరు సరిసంఖ్యతో ముగుస్తుంది. ఈ ఇద్దరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉంటాయి. శీతాకాల సెలవుల తర్వాత సోమవారమే తొలిసారి కోర్టు ప్రారంభమైంది. దాంతో ఇద్దరూ కలిసి జస్టిస్ సిక్రీ కారులో సుప్రీంకోర్టుకు వచ్చారు. మంగళవారం నాడు జస్టిస్ ఠాకూర్ కారులో వస్తున్నారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించిన కేసులను విచారిస్తుంది. సరి-బేసి ఫార్ములాను అమలుచేస్తే దానికి తాను మద్దతిస్తానని డిసెంబర్ 6వ తేదీన తాను ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. కోర్టు గదుల లోపల గాలి నాణ్యత ఎలా ఉందో శాంపిల్స్ తీసుకుని పరిశీలించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని జస్టిస్ ఠాకూర్ ఆదేశించారు. -
నిజాయితీ అనేది జడ్జీల గుత్తసొత్తు కాదు: సీజేఐ
న్యూఢిల్లీ: నిజాయితీ అనేది కేవలం జడ్జీల గుత్తసొత్తు కాదని.. వ్యవస్థలో వారే మాత్రమే నిజాయితీపరులని, మిగతావారంతా అనుమానితమని తాము చెప్పమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ పేర్కొన్నారు. ‘ప్రపంచీకరణ శకంలో మధ్యవర్తిత్వం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఢిల్లీలో సీజేఐ ప్రారంభించి ప్రసంగించారు. మధ్యవర్తులకు నిష్కళంకమైన నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు. -
సీజేగా జస్టిస్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం
భారత సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హెచ్.ఎల్. దత్తు డిసెంబర్ 2వ తేదీన పదవీ విరమణ చేశారు. కొత్త సీజేగా వచ్చిన జస్టిస్ ఠాకూర్ 2017 జనవరి 3వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే, ఆయనకు 13 నెలల పదవీ కాలం మిగిలి ఉంటుంది. -
సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియామకం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ టీఎస్ ఠాకూర్(63)ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీకాలం డిసెంబర్ 2న ముగియనుండటంతో.. డిసెంబర్ 3న జస్టిస్ ఠాకూర్ నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జడ్జీల నియామకానికి ముసాయిదా ఇవ్వండి! ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి నియమ, నిబంధనలతో ఒక ముసాయిదా(మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్)ను రూపొందించాల్సిందిగా బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీని తీసుకురావాలనుకున్న కేంద్ర నిర్ణయాన్ని ఇటీవల వ్యతిరేకించిన అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై నిబంధనావళిని రూపొందించాలంటూ అదే ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు.. తన స్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేరును సిఫారసు చేశారు. వచ్చే నెల 2న జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేసేముందు సుప్రీం కోర్టు సీజీ తన వారసుడి పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జస్టిస్ ఠాకూర్ ఏడాది ఒక నెల పాటు అనగా డిసెంబర్ 2 నుంచి 2017 జనవరి 3 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ ఠాకూర్ పంజాబ్, హర్యానా హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.