ప్రధాని సమక్షంలో సీజేఐ కంటతడి
న్యాయ వ్యవస్థపై ఏమిటీ విమర్శలు?
♦ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగం
♦ సీఎంలు, హైకోర్టుల సీజేల సదస్సులో ఉద్వేగ ప్రసంగం
♦ సీజేఐ ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ప్రధాని
♦ మంత్రులు, సుప్రీం సీనియర్ జడ్జీలతో చర్చకు ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశంలో జడ్జీలు అసాధారణ స్థాయిలో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య నెలకొన్న భారీ అంతరాన్ని గణాంకాలతో సహా వివరిస్తూ పలుమార్లు కంటతడి పెట్టారు! అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే!! పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సులో సీజేఐ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తీవ్రంగా ఉన్న జడ్జీల కొరత, జడ్జీలపై పని భారం, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు.. ఇలా పలు అంశాలను స్పృశిస్తూ మోదీ సమక్షంలోనే భావోద్వేగంతో ప్రసంగించారు.
ఈ క్రమంలో మూడుసార్లు భావోద్వేగానికి గురై, ఉబికి వస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకున్నారు. ‘దేశంలో కేసులు గుట్టలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారణకు స్వీకరించేందుకు తగినంత మంది జడ్జీలు లేరు. మున్సిఫ్ కోర్టు జడ్జి నుంచి సుప్రీంకోర్టు జడ్జి వరకు ఏటా సగటున 2,600 కేసులను పరిష్కరిస్తున్నారు. అదే అమెరికాలో జడ్జీలు ఏటా సగటున పరిష్కరిస్తున్నది 81 కేసులే’’ అని వివరించారు. జడ్జీల సామర్థ్యానికీ పరిమితి ఉంటుందన్నారు. ‘కక్షిదారులు, జైళ్లలో మగ్గుతున్న వారి తరఫునా, దేశాభివృద్ధి, పురోగతి కోసం మిమ్మల్ని వేడుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా స్పందించండి.
పెండింగ్ కేసుల విషయంలో న్యాయ వ్యవస్థపై విమర్శలు సరి కాదని అర్థం చేసుకోండి ’ అంటూ ప్రధానిని ఉద్దేశించి గద్గద స్వరంతో అన్నారు. కోట్లలో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి జడ్జీల సంఖ్యను ప్రస్తుతమున్న 21 వేల నుంచి 40 వేలకు పెంచాల్సి ఉన్నా (1987 నాటి సిఫార్సు) కేంద్రం నిష్క్రియగా వ్యవహరిస్తోందని సీజేఐ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసుల భారాన్ని పూర్తిగా న్యాయ వ్యవస్థపైనే నెట్టేయడం కుదరదని, అది సరికాదని తేల్చిచెప్పారు.
నియామకాలు దశాబ్దాలుగా పెండింగే
1987లో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 10 మందిగా ఉన్న జడ్జీల సంఖ్యను 50కి పెంచాలని న్యాయ కమిషన్ ఆ ఏడాది సిఫార్సు చేసిందని సీజేఐ ఠాకూర్ గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని 2002లో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిందని, ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని పార్లమెంటు స్థాయీ సంఘం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. కానీ నాటి నుంచి ప్రభుత్వ నిష్క్రియాపరత్వం యథాతథంగా కొనసాగుతూనే ఉందన్నారు. ఫలితంగా నేటికీ దేశంలో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 15 మంది జడ్జీలే ఉన్నారని సీజేఐ తెలిపారు. ఇది అమెరికా, యూకే, కెనడాలలోకన్నా చాలా తక్కువన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ప్రస్తుతం సుమారు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
వారం రోజుల్లో కొలీజియం నిర్ణయం
దేశవ్యాప్తంగా జడ్జిల నియామకాలకు సంబంధించి మార్చిన విధివిధానాలను సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయిస్తుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత కోసం కేంద్రం చేసిన సూచనలపై కొలీజియం చర్చించి వారం రోజుల్లో సమాధానం పంపించనున్నట్లు ఠాకూర్ తెలిపారు.
సమస్యను పరిష్కరిద్దాం: ప్రధాని
సీజేఐ ఠాకూర్ ఆవేదనపై ప్రధాని నరేంద్ర మోదీ అదే వేదికపై తక్షణం స్పందించారు. నిజానికి న్యాయ శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సదస్సులో ప్రధాని ప్రసంగం లేదు. అయినప్పటికీ ఆయన అప్పటికప్పుడు ఈ అంశంపై మాట్లాడారు. ‘‘1987 నుంచి ఎంతోకాలం గడచిపోయినందున ఈ విషయంలో సీజేఐ బాధను అర్థం చేసుకోగలను. రాజ్యాంగపరమైన అడ్డంకులు తలెత్తకుంటే మంత్రులు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలు అంతర్గతంగా సమావేశమై ఈ అంశానికి పరిష్కారం కనుక్కోవచ్చు’’ అంటూ ప్రధాని ప్రతిపాదించారు.
అడ్‌హక్ జడ్జీలుగా మాజీలు
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం దిశగా సీఎంలు, హైకోర్టుల సీజేల సదస్సు కీలక ముందడుగు వేసింది. రిటైరైన న్యాయాధికారులను అడ్‌హక్ జడ్జీలుగా నియమించేందుకు ఆర్టికల్ 224(ఏ)ను ప్రయోగించాలని తీర్మానించింది. ఈ విషయాన్ని సీజేఐ ఠాకూర్ ప్రకటించారు. గత ఐదేళ్లలో అప్పీళ్లపై విచారణ జరగని క్రిమినల్ కేసులను అడ్‌హక్ జడ్జీలు విచారిస్తారని వెల్లడించారు. రెండేళ్ల పదవీకాలం లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ జడ్జీలను నియమిస్తారన్నారు.