కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు
కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. రోడ్డు ప్రమాదాల గురించిన విషయంలో సమాధానం ఇంతవరకు పంపనందుకు రవాణా మంత్రిత్వశాఖకు రూ. 25వేల జరిమానా విధించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్ అని, కానీ కోర్టులు సరిగా పనిచేయలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికి ఏడాది గడిచినా మీరు (కేంద్రం) అఫిడవిట్ దాఖలు చేయలేదని అంటూ.. ''ఇక్కడేమైనా పంచాయతీ నడుస్తోందని అనుకుంటున్నారా'' అని వ్యాఖ్యానించారు. దాంతో.. మూడు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు.