70 వేల మంది జడ్జీలు అవసరం | 70 thousand judges Need | Sakshi
Sakshi News home page

70 వేల మంది జడ్జీలు అవసరం

Published Mon, May 9 2016 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

70 వేల మంది జడ్జీలు అవసరం

70 వేల మంది జడ్జీలు అవసరం

♦ పెండింగ్ కేసుల పరిష్కారంపై సీజేఐ ఠాకూర్ వెల్లడి
♦ జడ్జీల కొరతపై మళ్లీ ఆందోళన
 
 కటక్: దేశంలో జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఓ సదస్సులో జస్టిస్ ఠాకూర్ ప్రధాని మోదీ సమక్షంలో ఇదే అంశాన్ని ప్రస్తావించి కంటతడి పెట్టుకోవడం తెలిసిందే. తాజాగా ఆదివారమిక్కడ జరిగిన ఒడిశా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ.. జడ్జీల కొరత అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. జనాభా పెరుగుదల రేటు ప్రకారం...పెండింగ్ కేసుల పరిష్కారానికి 70 వేల మందికిపైగా జడ్జీల అవసరముందన్నారు.

‘జడ్జీల నియామకాలను సత్వరం చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అయితే ఈ నియామకాలతో సంబంధమున్న యంత్రాంగం మాత్రం చాలా నిదానంగా కదులుతోంది’ అని తెలిపారు. హైకోర్టు జడ్జీలకు సంబంధించి 170 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.న్యాయం పొందడమనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని వారు పొందకుండా ప్రభుత్వాలు నిరాకరించలేవని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు.  

 జడ్జీల కొరత ప్రధాన సవాలు.. ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో జడ్జీల కొరత ఒకటని ఆయన అన్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో మంజూరైన జడ్జీల పోస్టులు 900 కాగా.. వాటిలో 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరాన్ని 1987లో భారత లా కమిషన్ అప్పట్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి 44 వేల మంది జడ్జీలు అవసరమని సూచించిందన్నారు. ప్రస్తుతం కేవలం 18 వేల మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు.  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఆర్థికసాయం చేస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement