భువనేశ్వర్: దేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు.
ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో, చామ్లింగ్ తర్వాతి స్థానంలోకి చేరారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా అయిదు పర్యాయాలు సీఎంగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మళ్లీ విజయం సాధించి, సీఎంగా పగ్గాలు చేపట్టిన పక్షంలో నవీన్ పటా్నయక్ దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నేతగా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment