నేడే నీట్ తొలి విడత పరీక్ష
పరీక్ష వాయిదాపై పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ తొలి విడత (నీట్-1) పరీక్ష అన్ని అడ్డంకులను దాటుకుని నేడు జరగనుంది. ఈ పరీక్షను ఆపాలని, తేదీలు మార్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ‘చివరి నిమిషంలో ఏదీ జరగదు. ధర్మాసనం ఇంతకుముందే దీనిపై వాదనలు విన్నది. దీంట్లో మార్పులేమీ లేవు. పరీక్ష సజావుగా జరిగేలా అందరూ సహకరించాలి’ అని ఆదేశించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, కర్ణాటకతో పాటు సీఎంసీ, వెల్లూరు మైనారిటీ సంస్థలు తాము వ్యక్తిగతంగా నీట్ నిర్వహించుకుంటామనటాన్ని తిరస్కరించింది.
అన్ని ప్రభుత్వ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు కచ్చితంగా నీట్ పరిధిలోకే వస్తాయని మరోసారి తెలిపింది. అంతకుముందు విద్యార్థుల తరపున కొందరు లాయర్లు వాదన వినిపిస్తూ.. ‘ఇప్పటికే వివిధ రాష్ట్రస్థాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి పరీక్షకు సన్నద్ధమవటం అంత సులభమేం కాదు. అందుకే పరీక్షను వాయిదా వేయాలి’ అని కోరారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2016-17 విద్యాసంవత్సరానికి మే 1న, జూన్ 24 రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించాల్సిందేనని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు పరీక్షల ఫలితాలు ఆగస్టు 17న విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబరు 30వ తేదీలోగా పూర్తి అవుతుందని పేర్కొంది.