సుప్రీం తీర్పు 17కి వాయిదా
• రాష్ట్ర సంఘాలకు
• నిధులు ఆపేయండి
• సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వు
న్యూఢిల్లీ: బీసీసీఐ కాస్త ఊపిరి పీల్చుకుంది. లోధా ప్యానెల్ సూచనల అమలుకు ఒక్క రోజులోగా హామీ ఇవ్వకపోతే ఆఫీస్ బేరర్లందరినీ తప్పిస్తామని హెచ్చరించిన సుప్రీం కోర్టు తమ తుది తీర్పును ఈనెల 17కు వాయిదా వేసింది. అయితే సంస్కరణల అమలుకు రాష్ట్ర సంఘాలు సుముఖత వ్యక్తం చేసే వరకు వాటికి ఎలాంటి నిధులు విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం ఈ విచారణ జరిపింది. ఇప్పటికే 13 సంఘాలకు రూ.16.72 కోట్ల చొప్పున బీసీసీఐ విడుదల చేసింది.
కానీ లోధా సంస్కరణలను అమలు చేస్తామని ఆయా సంఘాలు తీర్మానించేదాకా వాటిని ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకం కాదని, కొన్ని సాంకేతికపరమైన అడ్డంకులు ఉన్నాయని బోర్డు కౌన్సిల్ రాధా రంగస్వామి కోర్టుకు తెలిపారు. తాము వాట న్నింటినీ తొలగిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతకన్నా ముందు మీరు అఫిడవిట్ దాఖలు చేయండని సూచించి విచారణను 17కు వాయిదా వేసింది.
మరోవైపు లోధా ప్రతిపాదనల అమలును అడ్డుకునేందుకు ఐసీసీతో సంప్రదింపులు చేయడంపై పది రోజుల్లో వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను కోర్టు ఆదేశిం చింది. గత నెల 21న జరిగిన తమ ఏజీఎంలో లోధా ప్యానెల్ సూచనలను బేఖాతరు చేస్తూ అన్ని కమిటీల నియామకం చేపట్టడంతో పాటు కార్యదర్శి ఎన్నిక కూడా చేయడంతో ఈ వివాదం ముదిరిన విషయం తెలిసిందే.