రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు | cancel notes to Constitution bench | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు

Published Sat, Dec 17 2016 6:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు

రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు

9 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరపుతుందన్న సుప్రీం
పాత నోట్ల వినియోగాన్ని పొడిగించాలన్న పిటిషన్ల తిరస్కరణ


న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు,  వినియోగ బిల్లుల చెల్లింపులకు అనుమతించాలన్న విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వినతులతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ బెంచ్‌ మొత్తం 9 అంశాలపై విచారణ జరుపుతుందని   తెలి పింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులకు ఉన్న ప్రజా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంశాన్ని విస్తృత  బెంచ్‌కు అప్పగించడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. ‘రద్దు చేసిన నోట్ల వినియోగాన్ని పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రమే సరైనది’ అని పేర్కొంది.

‘24 వేల విత్‌డ్రా’ను నెరవేర్చండి
బ్యాంకుల్లో వారానికి విత్‌డ్రా పరిమితిని రూ. 24 వేలుగా నిర్ణయించినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అందజేయడం లేదని, ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని వచ్చిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ప్రభుత్వం కోరిన 50 రోజుల గడువు ఇంకా ముగియలేదని, ఆ సమయానికల్లా నగదు చలామణి పెరుగుతుందని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ చెప్పిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకూ 40 శాతం పాతనోట్లను కొత్త రూ.2,000, రూ.500 నోట్లతో భర్తీ చేసినట్టుగా కేంద్రం చెప్పింది. వారానికి రూ. 24 వేల విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ఆ హామీని నెరవేర్చాలని సూచించింది.

హైకోర్టుల్లో నోట్ల రద్దు విచారణపై స్టే
నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే విధించింది. వీటన్నింటిని తామే విచారిస్తామంది. ఇకపై దీనికి సంబంధించిన రిట్‌ పిటిషన్లను ఇతర కోర్టు స్వీకరించరాదని పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చంది. అలాగే నవంబర్‌ 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు స్వీకరించిన రూ.8,000 కోట్లను కొత్త కరెన్సీతో నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అటార్నీ జనరల్‌ హామీకి సుప్రీంకోర్టు అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement