హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి
ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
► లైసెన్స్ లను మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయొద్దు
► దీన్ని ఆదాయ మార్గంగా చూడొద్దు
► సాధారణ ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణా లను మూసేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసే వరకు మాత్రమే ఈ దుకాణాలను నిర్వహించుకోవచ్చంది. వచ్చే ఏడాది మార్చి 31 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి లిక్కర్ విక్రయాలను సూచించే బ్యానర్లన్నంటినీ తొలగించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతుండడంపై ఇటీవల సుప్రీం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిం దే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదా రులపై ఉన్న అన్ని మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలు జరగ కుండా చూసేలా ఎక్సైజ్ చట్టాలను సవరించాలంటూ దాఖలైన పలు వినతుల నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. హైవేల సమీపంలో లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వాలని, ఇందుకోసం నిబంధనలు సడలించాలన్న పంజాబ్ ప్రభుత్వం వైఖరిని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టింది. మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తు చేస్తూ.. సాధారణ ప్రజల మేలుకోసం చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.
అదే సమయంలో వివిధ రాష్ట్రాలు సైతం రోడ్ల వెంబడి ఉన్న లిక్కర్ షాపుల్ని తొలగించడంలో నిర్లక్ష్యం చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం పెరిగిపోతున్నదని, దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల వెంబడి లిక్కర్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఒక ఆదాయ మార్గంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూడరాదని హితవు పలికింది. ఈ విషయంలో కేంద్రం సైతం నిర్మాణాత్మకంగా వ్యవహరించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది.