ఒకే కారులో సుప్రీం చీఫ్ జస్టిస్, మరో న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సరి-బేసి నిబంధన పాటించాలని ఎవరూ చెప్పరు, చెప్పలేరు. వీవీఐపీ హోదాలో ఆయనకు ఈ నిబంధన నుంచి మినహాయింపు కూడా ఉంది. అయినా.. తాను లేవనెత్తిన అంశానికి కట్టుబడి ఉండాలన్న నిబద్ధత ఆయనకు ఉంది. అందుకే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. తోటి న్యాయమూర్తి ఏకే సిక్రీతో కలిసి ఈ 15 రోజులూ కార్ పూలింగ్ పద్ధతిలో వస్తున్నారు. జస్టిస్ ఠాకూర్‌కు బేసి సంఖ్యతో ముగిసే నంబరున్న కారు ఉండగా, జస్టిస్ సిక్రీ కారు నెంబరు సరిసంఖ్యతో ముగుస్తుంది. ఈ ఇద్దరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉంటాయి.
శీతాకాల సెలవుల తర్వాత సోమవారమే తొలిసారి కోర్టు ప్రారంభమైంది. దాంతో ఇద్దరూ కలిసి జస్టిస్ సిక్రీ కారులో సుప్రీంకోర్టుకు వచ్చారు. మంగళవారం నాడు జస్టిస్ ఠాకూర్ కారులో వస్తున్నారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించిన కేసులను విచారిస్తుంది. సరి-బేసి ఫార్ములాను అమలుచేస్తే దానికి తాను మద్దతిస్తానని డిసెంబర్ 6వ తేదీన తాను ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. కోర్టు గదుల లోపల గాలి నాణ్యత ఎలా ఉందో శాంపిల్స్ తీసుకుని పరిశీలించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని జస్టిస్ ఠాకూర్ ఆదేశించారు.