car pooling
-
కారుచౌక జర్నీ
నగరానికి చెందిన అఖిల్ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాలి. బస్సుల్లో రద్దీ చాలా ఉంది. రిజర్వేషన్‌లోనూ సీట్లు లేవు. వెంటనే తన వద్ద ఉన్న ఓ కార్‌పూలింగ్ యాప్ ఓపెన్ చేసి, సీటు బుక్ చేసుకుని రాజధానికి వెళ్లిపోయాడు. బదిలీల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు సైతం నలుగురు లేదా ఐదుగురు ఎంప్లాయీస్ కలిసి కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే ఆఫీసులో పనిచేయడం, కారు అయితే స్టాపుల్లేకుండా నేరుగా ఆఫీసుకే వెళ్లే వీలుండటంతో కార్ పూలింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. అద్దెకారు జర్నీ ఖరీదైంది. ఇద్దరు కలిసి కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే రూ.5వేలకు తక్కువ ఖర్చవడం లేదు. పెరిగిన ఇంధన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అంతకన్నా తక్కువ తీసుకుంటే తమకు గిట్టుబాటు కాదని చెప్పేస్తున్నారు. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో సరే అని వెళ్లిపోతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారు ప్రయాణాన్ని చౌకకే అందిస్తోంది. కార్ పూలింగ్‌కు కొన్నియాప్‌లు అందుబాటులో ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు కార్ పూలింగ్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరకే షేరింగ్ జర్నీ చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. కారు నిర్వాహకులకు సైతం ఇం‘ధన’ం ఆదా అవుతోంది. అసలేంటీ కారు‘చౌక’ జర్నీ అనుకుంటున్నారా..? చదవండీ సండే స్పెషల్..!! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కార్ పూలింగ్ కల్చర్ పెరిగిపోతోంది. పెరిగిన రద్దీ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఈ విధమైన ప్రయాణానికి పెద్దపీట వే స్తున్నారు. జిల్లాకేంద్రాలైన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల నుంచి ప్రతిరోజూ రాజధానితో పాటు వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని, నిజా మాబాద్ ఇలా ఏ ప్రాంతానికై నా కార్ పూలింగ్‌కే జై కొడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ తరువాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాదిమంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చైన్నె తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, కార్పొరేట్ తదితర మల్టీనేషనల్ కంపెనీల్లో కొలువు చేస్తున్నారు. వారాంతానికి ఉమ్మడి జిల్లాకు రావడం, తిరిగి సోమవారం ఉదయానికి వారి ఉద్యోగస్థానాలకు వెళ్లడం రివాజుగా మారింది. దీనికితోడు ప్రతిరోజూ కోర్టు కేసులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, రకరకాల అవసరాల రీత్యా రాజధానికి వెళ్లేవారి సంఖ్యకు లెక్కేలేదు. ఓనర్, రైడర్‌కు మేలు ఈ యాప్‌లు కార్లు లేని వారికి మాత్రమే కాదు సొంత వాహనాలు ఉన్న వారికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజూ చాలామంది ఉమ్మడి జిల్లాకు వివిధ పనులు, పండగలు, సెలవులకు వచ్చి, కుటుంబ సభ్యులను దింపి తిరిగి ఒంటరిగా వెళ్తుంటారు. అంటే గంటల కొద్దీ ప్రయాణం ఒంటరిగా చేయాలి. అదే సమయంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కొలీగ్స్ రానప్పుడు ఈ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నా రు. పెట్రోల్ ఖర్చు ఆదా కోసం బ్లాబ్లాకార్, క్విక్‌రైడ్ యాప్‌లో రైడ్ వివరాలు పోస్టు చేస్తున్నారు. క్షణాల్లో కారు ఖాళీ సీట్లు నిండిపోతున్నాయి. ఓనర్ ఆర్టీసీ చార్జీలే తీసుకుంటుండడం, అతనికి ప్రయాణంలో టైంపాస్.. పైగా పెట్రోల్ చార్జీలు కలిసొస్తున్నాయి. నచ్చిన చోట పికప్.. డ్రాప్ ఈ యాప్‌తో మరో సదుపాయం ఏంటంటే.. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లినప్పుడు ముందు రైల్వేస్టేషన్/బస్టాండ్‌లో దిగుతాం. అక్కడి నుంచి మనం అనుకున్న స్థానాలకు వెళ్లాలంటే క్యాబ్‌లకు రూ.200, 300 పెట్టాలి. ట్రాఫిక్‌తో గంటలపాటు ఇరుక్కుపోతుంటారు. కానీ, ఈ యాప్ ద్వారా ఓనరు ప్రయాణించే మార్గంలో మనకు నచ్చిన చోట దిగవచ్చు. ఉదా: నిమ్స్ వెళ్లాలనుకుంటే మెహదీపట్నం వెళ్లే కారును ఎంచుకోవచ్చు. హైటెక్ సిటీ వెళ్లాలనుకుంటే కొండాపూర్ వెళ్లే కారును సెలెక్ట్ చేసుకుని, అక్కడే దిగిపోవచ్చు. చాలా కార్లు ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండటంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. సమయానికి చేరుకోవచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కార్ పూలింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోని ప్రయాణించడం ద్వారా సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా గమ్యానికి అనుకున్న సమయంలోనే చేరుకునే వెసులుబాటు ఉంది. వివిధ వ్యాపారాల రీత్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కార్ పూలింగ్ యాప్‌ను ఎక్కవగా వినియోగించుకుంటున్నారు. – శనిగరపు రవీందర్, ప్రభుత్వ ఉద్యోగి టోల్గేట్ల వద్ద తాకిడి పాత జిల్లాలో రెండు ప్రధాన టోల్గేట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద కాగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ వద్ద రెండోది ఉంది. ఈ టోల్గేట్ల మీదుగా ప్రతీరోజూ రాకపోకలు సాగించే కార్ల వివరాలు (కిలోమీటర్లలో) ఇలా ఉన్నాయి. టోల్గేట్ హైదరాబాద్ వైపు హైదరాబాద్ నుంచి రేణిగుంట 5,500 సుమారు 5,000 సుమారు బసంత్‌నగర్ 1,500 సుమారు 1,100 సుమారు ఉమ్మడి జిల్లాలో కార్ల సంఖ్య ఇలా.. జిల్లాలో కార్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యాంకుల సులభ వాయిదా రుణాలు, మార్కెట్లోకి కొత్త కార్లు వస్తుండటం, కరోనా తరువాత భౌతిక దూరానికి ప్రాధాన్యం పెరగడంతో సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా ఊపందుకుంది. ఇందుకు ఉమ్మడి జిల్లాలో రిజిష్టర్ అయిన కార్ల వివరాలే నిదర్శనం. కరీంనగర్: 47,023 సిరిసిల్ల: 11,911 జగిత్యాల: 12,824 పెద్దపల్లి: 10,400 -
HYD: ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కార్ పూలింగ్ విధానం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఐటీ ఉద్యోగులు వరుసుగా ఆఫీసులకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కాగా, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసిఐసిఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానంపై వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు మరో ప్రతిపాదన చేశారు. ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పనివేళల్లో మార్పులపై సూచనలు తెలియజేశారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు. కార్ పూలింగ్ విధానం.. ఒకరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఒకరి కోసం కూడా కారును బయటకు తీస్తున్నారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. హైటెక్‌సిటీలో కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
సిటీలో కార్ పూలింగ్‌కు డిమాండ్..!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ‘కార్ పూలింగ్’కు డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం నగర ప్రజా రవాణాలో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సౌకర్యం ఉబర్, ఓలా వంటి క్యాబ్ సంస్థలతో పోటీ పడుతోంది. ప్రతి రోజు సుమారు 5000 రైడ్స్ నమోదవుతున్నట్లు కార్‌పూలింగ్ యాప్‌ల అంచనా. ఒకే ప్రాంతంలో ఉంటూ ఒకే చోట పనిచేసే ఉద్యోగులు ఎవరికి వారు సొంత కార్లలో విడివిడిగా వెళ్లడం కంటే నలుగురు కలిసి ఒకదాంట్లో వెళ్లడమే ఈ ‘కార్ పూలింగ్’. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ ఇబ్బంది ఉండకపోగా.. రవాణా ఖర్చులు సైతం భారీగా తగ్గుతాయి. ప్రతి రోజు సుమారు 50 వేల మందికి పైగా ఐటీ, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కార్‌పూలింగ్‌ను వినియోగించుకుంటున్నట్టు అంచనా. ఈ సేవ లను అందజేస్తున్న క్విక్ రైడ్, ఎస్ రైడ్ వంటి మొబైల్ అప్లికేషన్లలో సుమారు 2.5 లక్షల మంది పేర్లను నమోదు చేసుకొన్నారు. అవసరమైనప్పుడు కార్ పూలింగ్ సేవలను సద్వినియోగం చేసుకొనేందుకు అనువుగా పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, లిం గంపల్లి, మియాపూర్, నిజాంపేట్, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, వెంగళరావునగర్, అమీ ర్‌పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, కోకాపేట, తెల్లాపూర్ రూట్లలో కార్ పూలింగ్ సదుపాయం బాగా విస్తరించింది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. క్విక్ రైడ్ వంటి యాప్‌లు కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నాయి. గ్రేటర్లో వాహన విస్ఫోటం గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్కరు వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మెట్రో కొంతవరకు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు విస్తరిస్తే తప్ప మార్పు కనిపించదు. మరోవైపు గత పదేళ్లుగా ఆర్టీసీలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో రహదారులపై వాహనాలు పోటెత్తుతున్నాయి. సుమారు 35 లక్షల బైక్‌లు, మరో 15 లక్షల వ్యక్తిగత కార్లు పరుగులు తీస్తుండగా, 50 వేల క్యాబ్‌లు, ట్యాక్సీలు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 3500 ఆర్టీసీ బస్సులు మాత్రమే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. బంధాలు బలోపేతం కార్ పూలింగ్ మరో సరికొత్త సాంప్రదాయాన్ని కూడా నగరానికి పరిచయం చేస్తోం ది. అప్పటి వరకు ఒకే సంస్థలో లేదా పక్క పక్క సంస్థల్లో పనిచేసేవారు, ఒకే అపార్ట్మెంట్లో, ఒకే కాలనీలో ఉంటున్నా ఏ మాత్రం పరిచయం లేకుండా ఎవరికి వారే రాకపోకలు సాగించేవారు. కార్పూలింగ్లో ఇలాంటి వారి మధ్య స్నేహం పెరుగుతోంది. తమ సంస్థలో లేదా తమ పక్కన ఉన్న మరో సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కలిసి వెళ్లేందుకు చాలా మంది సంతోషంగానే ముందుకు వస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ఇది మరింత నమ్మకమైన రవాణా సదుపాయంగా ముందుకు వచ్చింది. అలా మొదలైంది.. హైటెక్‌సిటీలో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఇబ్బందులను తొలగించేందుకు 2015లో హైసియా ఆధ్వర్యంలో ‘కార్ ఫ్రీ థర్స్డే’కు శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం సొంత వాహనాలను ఇంటి వద్ద ఉంచి కేవలం ప్రజరవాణా వాహనాల్లోనే రావాలని ప్రతిపాదించగా అనూహ్య స్పందన వచ్చింది. ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. కొంతకాలం పాటు కార్ ఫ్రీ థర్స్డే కొనసాగింది. ఈ క్రమంలో కార్ పూలింగ్ కాన్సెప్ట్ బలంగా ముందుకు వచ్చింది. కొత్త స్నేహితులు.. కార్‌పూలింగ్‌తో రవాణా ఖర్చులు తగ్గాయి. ఓలా, ఊబర్‌లో రూ.250 ఖర్చయితే, ఇక్కడ రూ.100 మాత్రమే అవుతోంది. అంతేకాదు.. వేర్వేరు సంస్థల్లో పనిచేసే వారి మధ్య స్నేహం కూడా పెరుగుతోంది. కెరీర్‌కు ఈ పరిచరం ఉపయోగపడుతుంది. మహిళలకు ఒక నమ్మకమైన సదుపాయం ఇది.– విశాల, సాఫ్ట్వేర్ నిపుణురాలు ఆగస్టులో వేడుకలు సిటీలో కార్ పూలింగ్ సేవలు పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చు కావడం వల్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో ఇటీవల కార్‌పూలింగ్ అవార్డు వేడుకలు జరిగాయి. ఆగస్టులో ఇక్కడా నిర్వహించి అత్యధికంగా కార్‌పూలింగ్ సేవలందజేసిన వారిని సన్మానిస్తాం.– బ్రజేష్ నాయర్, క్విక్ రైడ్ హెడ్ శాశ్వత పరిష్కారం కాదు కార్ పూలింగ్ అదనపు సదుపాయం మాత్రమే. శాశ్వత పరిష్కారంగా భావించలేం. అన్ని రూట్లలో ప్రజారవాణా సదుపాయాలు మెరుగుపడాలి. ప్రజలు కచ్చితంగా బస్సుల్లో, రైళ్లలో తిరిగేలా ప్రజారవాణా విస్తరిస్తే తప్ప ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కాదు. – ప్రశాంత్ బచ్చు,రవాణా నిపుణుడు -
ఉబర్, ఓలాలతో అంతా ఉల్టా పల్టా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలోని నగరాలు గంటల గంటల ట్రాఫిక్ జామ్‌లకు, కాలుష్య కషాయానికి పెట్టింది పేరు. భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగుళూరు నగరంలో 52,07,693 ద్విచక్ర వాహనాలు, 14,49,334 ప్రైవేటు కార్లు ఉన్నాయంటే అక్కడ రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రోజుకు ఓ రెండు, మూడు గంటలపాటైనా ఈ వాహనాలన్నీ రోడ్లపైనే ఉంటాయంటే ట్రాఫిక్ జామ్‌లు ఇంకా ఎలా ఉంటాయో ఊహించడమే కాదు, ప్రత్యక్షంగా చూస్తునే ఉంటాం. ఇలాంటి సమయాల్లోనే పాశ్చాత్య దేశాల్లో ‘కారు పూలింగ్’ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒక అపార్ట్మెంట్ లేదా ఓ కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు లేదా పరిచయస్థులు ఒక్కొక్కరు ఒక్కో కారుతీయకుండా, ఒకే కారులో నలుగురైదుగురు కలిసి ఆఫీసులకు వెళ్లడం, ఆఫీసుల నుంచి తిరిగి రావడం కోసం ఈ ‘కారు పూలింగ్’ ఐడియా కొంత మేరకు బాగానే పనిచేసింది. ఒక్కొక్కరిని ఆఫీసుల వద్ద దించుకుంటూ పోవాలి, మళ్లీ ఎక్కించుకుంటు రావాలి కనుక ‘కారు పూలింగ్’లో ఆఫీసుకు ముందుకు బయల్దేరాల్సి వచ్చేది. వచ్చేటప్పుడు ఇంటికి లేటుగా రావాల్సి వచ్చేది. ఇదే సమయంలో ఉబర్, ఓలా, లిఫ్ట్ లాంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ‘కారు పూలింగ్’ కష్టాలు తప్పాయి. ‘ఇలాంటి క్యాబ్ సర్వీసుల వల్ల రోడ్లపై ప్రైవేటు వాహనాలు తగ్గి ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ప్రైవేటు కార్లతో పోలిస్తే క్యాబ్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక వాతావరణంలో కలిసే కాలుష్యం కూడా తక్కువే’ అని ఉబర్ క్యాబ్‌ల వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ 2015లో వ్యాఖ్యానించారు. పలు పాశ్యాత్య దేశాలతోపాటు భారత్‌లోని అన్ని నగరాలకు ఈ క్యాబ్ సర్వీసులు విస్తరించిన నేపథ్యంలో ట్రావిస్ కలానిక్ వ్యాఖ్యలు నిజమయ్యాయా? ట్రాఫిక్ రద్దీ తగ్గిందా, పెరిగిందా? కాలుష్యం తగ్గిందా, పెరిగిందా? ఈ క్యాబ్ సర్వీసులు విస్తరించాక పాశ్చాత్య నగరాలతోపాటు పలు భారతీయ నగరాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగి జామ్‌లు పెరగడమే కాకుండా కాలుష్యం కూడా పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యకర పరిణామాలు. బాస్టన్, న్యూయార్క్, లండన్ నగరాల్లో ట్రాఫిక్ రద్దీలు బాగా పెరిగాయి. ఇక భారత్‌లోని నగరాల్లో క్యాబ్ సర్వీసుల విస్తరణ వల్ల వాహనాల సంఖ్య పెరిగి, ట్రాఫిక్ రద్దీ, జాములు కూడా పెరిగాయి. బెంగళూరులో 2015, మే నెల నాటికి 84,92 టాక్సీలు ఉండగా, 2018 సంవత్సరం నాటికి అవి ఏకంగా 89 శాతం పెరిగి, 1,59,519కి చేరుకున్నాయి. ఇక ఈ కాలంలో ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు 24 శాతం పెరగ్గా, కార్ల సంఖ్య 31 శాతం పెరిగింది. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్కు ఎంత ప్రాధాన్యత పెరిగిందో తెలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో ముంబై నగరంలో నలుపు–పసుపు కార్ల సంఖ్య 70 శాతం తగ్గి, క్యాబల సంఖ్య అంతకన్నా పెరిగిందట. దేశంలోని నగరాల్లో రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా వాటికీ పరిమితులు ఉంటాయి. పీక్ అవర్స్ (అత్యవసర వేళల్లో)లో క్యాబ్‌లు ఎక్కువగా రోడ్డపైనే తిరుగుతున్నాయి. సాధారణ వేళల్లో మాల్స్, ఆఫీసులు, విద్యాసంస్థల వద్ద రోడ్లపైనే నిలిచి ఉంటున్నాయి. పర్యవసానంగా వాహనాల రాకపోకలకు రోడ్డు ఇరుకవుతోంది. పీక్ అవర్స్‌లో ఈ కార్లన్నీ ఆఫీసులు, మాల్స్, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, మెట్రో స్టేషక్లకే ఎక్కువగా పరుగులు తీయడం వల్ల ఆ ప్రాంతాలన్నీ రద్దీ అవుతున్నాయి. క్యాబ్ సర్వీసులు ఎక్కువగా విస్తరించిన అమెరికాలోని ఏడు నగరాల్లో చేసిన సర్వేలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రైడ్ షేరింగ్ వల్ల ఈ నగరాల్లో 49 శాతం నుంచి 61 శాతం వరకు కొత్త ప్రయాణికుల శాతం పెరిగి వాహనాల కాలుష్యం పెరిగింది. రైడ్ షేరింగ్ కారణంగా క్యాబుల్లో ప్రయాణిస్తున్న ఈ 49 శాతం నుంచి 61 శాతం మంది ప్రయాణికులు ఇంతకుముందు కాలి నడకనో, సైకిల్‌పైనో, ప్రభుత్వ బస్సులోనే వెళ్లే వారు. ఇప్పుడు భారత్ నగరాల్లో కూడా ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కాలి నడక, సైకిల్ లేదా బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు క్యాబుల్లో షేరింగ్ రైడ్లను ఆశ్రయిస్తున్నారు. అమెరికా సర్వేలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు కార్లు తమ గమ్యం దిశలో ఒక మైలు వెల్లాల్సి వస్తే క్యాబ్‌లు అలా ప్రతి మైలుకు 2.8 మైళ్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నాయట. షేరింగ్ రైడ్‌లో ఒకరి ఒక చోట, మరొకరి మరోచోట ఎక్కించుకొని వారిని గమ్యస్థానాలకు చేర్చడం వల్ల ఈ అదనపు తిరుగుడు అవుతుందట. దేశంలోని నగరాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ‘షేరింగ్ రైడ్లే’ ఉత్తమ మార్గమని కేంద్ర ప్రభుత్వ మేధో మండలి ‘నీతి ఆయోగ్’ ఇదే సమయంలో అభిప్రాయ పడడం గమనార్హం. ప్రభుత్వ బస్సు, మెట్రో రైలు సర్వీసులను విస్తరించడం, సర్వీసుల సంఖ్యను పెంచడం, వాకింగ్, సైక్లింగ్‌లను ప్రోత్సహించడం ట్రాఫిక్ రద్దీ నివారణకు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. -
క్యాబ్ షేరింగ్ మంచిదే కానీ...
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ షేరింగ్‌కు చెక్ పెట్టే దిశగా ఢిల్లీ సర్కార్ ప్రయత్నిస్తుంటే సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు క్యాబ్ యూజర్లకు ఊరట ఇస్తున్నాయి. క్యాబ్ షేరింగ్ మంచి ఐడియానే అని, అయితే మహిళ భద్రత గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. కొత్త వారితో కలిసి క్యాబ్‌లో వెళ్లడం మహిళల భద్రతకు ఇబ్బందికరమని అన్నారు. యాప్ ఆధారిత క్యాబ్ షేరింగ్ సేవల్లో మహిళల భద్రతపైనే రవాణా అధికారులతో, సంబంధిత వర్గాలతో చర్చిస్తున్నామని చెప్పారు. రైడ్ షేరింగ్‌కు అనుమతిస్తూనే మహిళల భద్రతకు పెద్దపీట వేసేలా సూచనలు చేయాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. మొత్తం మీద క్యాబ్ షేరింగ్ నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
క్యాబ్‌ల్లో షేర్ రైడ్స్‌కు చెక్
సాక్షి,న్యూఢిల్లీ: క్యాబ్‌ల్లో షేరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో గమ్యస్ధానాలకు చేరుకునే వెసులుబాటు ఇక ఉండకపోవచ్చు. యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్స్‌కు త్వరలో చెక్ పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం నూతన ట్యాక్సీ స్కీమ్ ద్వారా వీటికి చెక్ పెట్టనుంది. సీటీ ట్యాక్సీ స్కీమ్ 2017కు ఢిల్లీ ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. ఈ నిబంధనల కింద షేర్ రైడ్‌ను అనుమతించబోరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా విధానాన్ని ప్రజల ముందుంచి వారి సూచనల మేరకు షేర్ రైడ్‌ను అనుమతించాలా లేదా అనేది నిర్ణయిస్తామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. షేర్ రైడ్, కార్ పూల్‌ను ఢిల్లీలో అనుమతించమని గతంలో ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్‌పై తిరిగే వాహనాలను పలువురు ప్రయాణీకులను ఎక్కించుకోవడాన్ని మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం అనుమతించరు. స్టేజ్ క్యారేజ్ పర్మిట్ కలిగిన బస్సుల వంటి ప్రజా రవాణా వాహనాలను మాత్రమే వివిధ లొకేషన్ల నుంచి ప్రయాణీకుల పికప్, డ్రాప్‌లకు అనుమతిస్తారు.ప్రస్తుతం యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్లు చట్టపరిధికి వెలుపల ఉన్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అందుబాటు ధరలో సౌకర్యవంతమైన ప్రయాణంగా రైడ్ షేర్ ఢిల్లీలో ఆదరణ చూరగొంది.ఢిల్లీలో క్యాబ్ ప్రయాణాల్లో 30 శాతం పైగా షేర్ రైడ్లే ఉంటున్నాయి. ఏడాదిలో షేర్ రైడ్లు ఐదు రెట్లు పెరిగాయని ఇటీవల ఓలా ప్రకటించింది. ఓలా షేర్‌కు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం కీలక మార్కెట్‌గా ఓలా ప్రతనిధి చెబుతున్నారు.మరోవైపు కర్ణాటక ప్రభుత్వం షేర్ రైడ్ చట్టవిరుద్ధమంటూ దాన్ని నిషేధించేందుకు రవాణా శాఖ సంసిద్ధమైంది. -
ఒకే కారులో సుప్రీం చీఫ్ జస్టిస్, మరో న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సరి-బేసి నిబంధన పాటించాలని ఎవరూ చెప్పరు, చెప్పలేరు. వీవీఐపీ హోదాలో ఆయనకు ఈ నిబంధన నుంచి మినహాయింపు కూడా ఉంది. అయినా.. తాను లేవనెత్తిన అంశానికి కట్టుబడి ఉండాలన్న నిబద్ధత ఆయనకు ఉంది. అందుకే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. తోటి న్యాయమూర్తి ఏకే సిక్రీతో కలిసి ఈ 15 రోజులూ కార్ పూలింగ్ పద్ధతిలో వస్తున్నారు. జస్టిస్ ఠాకూర్‌కు బేసి సంఖ్యతో ముగిసే నంబరున్న కారు ఉండగా, జస్టిస్ సిక్రీ కారు నెంబరు సరిసంఖ్యతో ముగుస్తుంది. ఈ ఇద్దరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉంటాయి. శీతాకాల సెలవుల తర్వాత సోమవారమే తొలిసారి కోర్టు ప్రారంభమైంది. దాంతో ఇద్దరూ కలిసి జస్టిస్ సిక్రీ కారులో సుప్రీంకోర్టుకు వచ్చారు. మంగళవారం నాడు జస్టిస్ ఠాకూర్ కారులో వస్తున్నారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించిన కేసులను విచారిస్తుంది. సరి-బేసి ఫార్ములాను అమలుచేస్తే దానికి తాను మద్దతిస్తానని డిసెంబర్ 6వ తేదీన తాను ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. కోర్టు గదుల లోపల గాలి నాణ్యత ఎలా ఉందో శాంపిల్స్ తీసుకుని పరిశీలించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని జస్టిస్ ఠాకూర్ ఆదేశించారు.