నగరానికి చెందిన అఖిల్ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాలి. బస్సుల్లో రద్దీ చాలా ఉంది. రిజర్వేషన్‌లోనూ సీట్లు లేవు. వెంటనే తన వద్ద ఉన్న ఓ కార్‌పూలింగ్ యాప్ ఓపెన్ చేసి, సీటు బుక్ చేసుకుని రాజధానికి వెళ్లిపోయాడు.
బదిలీల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు సైతం నలుగురు లేదా ఐదుగురు ఎంప్లాయీస్ కలిసి కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే ఆఫీసులో పనిచేయడం, కారు అయితే స్టాపుల్లేకుండా నేరుగా ఆఫీసుకే వెళ్లే వీలుండటంతో కార్ పూలింగ్‌కు మొగ్గు చూపుతున్నారు.
అద్దెకారు జర్నీ ఖరీదైంది. ఇద్దరు కలిసి కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే రూ.5వేలకు తక్కువ ఖర్చవడం లేదు. పెరిగిన ఇంధన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అంతకన్నా తక్కువ తీసుకుంటే తమకు గిట్టుబాటు కాదని చెప్పేస్తున్నారు. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో సరే అని వెళ్లిపోతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారు ప్రయాణాన్ని చౌకకే అందిస్తోంది. కార్ పూలింగ్‌కు కొన్నియాప్‌లు అందుబాటులో ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు కార్ పూలింగ్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరకే షేరింగ్ జర్నీ చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. కారు నిర్వాహకులకు సైతం ఇం‘ధన’ం ఆదా అవుతోంది. అసలేంటీ కారు‘చౌక’ జర్నీ అనుకుంటున్నారా..? చదవండీ సండే స్పెషల్..!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కార్ పూలింగ్ కల్చర్ పెరిగిపోతోంది. పెరిగిన రద్దీ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఈ విధమైన ప్రయాణానికి పెద్దపీట వే స్తున్నారు. జిల్లాకేంద్రాలైన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల నుంచి ప్రతిరోజూ రాజధానితో పాటు వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని, నిజా మాబాద్ ఇలా ఏ ప్రాంతానికై నా కార్ పూలింగ్‌కే జై కొడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ తరువాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాదిమంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చైన్నె తదితర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, కార్పొరేట్ తదితర మల్టీనేషనల్ కంపెనీల్లో కొలువు చేస్తున్నారు. వారాంతానికి ఉమ్మడి జిల్లాకు రావడం, తిరిగి సోమవారం ఉదయానికి వారి ఉద్యోగస్థానాలకు వెళ్లడం రివాజుగా మారింది. దీనికితోడు ప్రతిరోజూ కోర్టు కేసులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, రకరకాల అవసరాల రీత్యా రాజధానికి వెళ్లేవారి సంఖ్యకు లెక్కేలేదు.
ఓనర్, రైడర్‌కు మేలు
ఈ యాప్‌లు కార్లు లేని వారికి మాత్రమే కాదు సొంత వాహనాలు ఉన్న వారికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజూ చాలామంది ఉమ్మడి జిల్లాకు వివిధ పనులు, పండగలు, సెలవులకు వచ్చి, కుటుంబ సభ్యులను దింపి తిరిగి ఒంటరిగా వెళ్తుంటారు. అంటే గంటల కొద్దీ ప్రయాణం ఒంటరిగా చేయాలి. అదే సమయంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కొలీగ్స్ రానప్పుడు ఈ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నా రు. పెట్రోల్ ఖర్చు ఆదా కోసం బ్లాబ్లాకార్, క్విక్‌రైడ్ యాప్‌లో రైడ్ వివరాలు పోస్టు చేస్తున్నారు. క్షణాల్లో కారు ఖాళీ సీట్లు నిండిపోతున్నాయి. ఓనర్ ఆర్టీసీ చార్జీలే తీసుకుంటుండడం, అతనికి ప్రయాణంలో టైంపాస్.. పైగా పెట్రోల్ చార్జీలు కలిసొస్తున్నాయి.
నచ్చిన చోట పికప్.. డ్రాప్
ఈ యాప్‌తో మరో సదుపాయం ఏంటంటే.. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లినప్పుడు ముందు రైల్వేస్టేషన్/బస్టాండ్‌లో దిగుతాం. అక్కడి నుంచి మనం అనుకున్న స్థానాలకు వెళ్లాలంటే క్యాబ్‌లకు రూ.200, 300 పెట్టాలి. ట్రాఫిక్‌తో గంటలపాటు ఇరుక్కుపోతుంటారు. కానీ, ఈ యాప్ ద్వారా ఓనరు ప్రయాణించే మార్గంలో మనకు నచ్చిన చోట దిగవచ్చు. ఉదా: నిమ్స్ వెళ్లాలనుకుంటే మెహదీపట్నం వెళ్లే కారును ఎంచుకోవచ్చు. హైటెక్ సిటీ వెళ్లాలనుకుంటే కొండాపూర్ వెళ్లే కారును సెలెక్ట్ చేసుకుని, అక్కడే దిగిపోవచ్చు. చాలా కార్లు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్తుండటంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి.
సమయానికి చేరుకోవచ్చు
హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కార్ పూలింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోని ప్రయాణించడం ద్వారా సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా గమ్యానికి అనుకున్న సమయంలోనే చేరుకునే వెసులుబాటు ఉంది. వివిధ వ్యాపారాల రీత్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కార్ పూలింగ్ యాప్‌ను ఎక్కవగా వినియోగించుకుంటున్నారు.
– శనిగరపు రవీందర్, ప్రభుత్వ ఉద్యోగి
టోల్‌గేట్‌ల వద్ద తాకిడి
పాత జిల్లాలో రెండు ప్రధాన టోల్‌గేట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద కాగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ వద్ద రెండోది ఉంది. ఈ టోల్‌గేట్ల మీదుగా ప్రతీరోజూ రాకపోకలు సాగించే కార్ల వివరాలు (కిలోమీటర్లలో) ఇలా ఉన్నాయి.
టోల్‌గేట్ హైదరాబాద్ వైపు హైదరాబాద్ నుంచి
రేణిగుంట 5,500 సుమారు 5,000 సుమారు
బసంత్‌నగర్ 1,500 సుమారు 1,100 సుమారు
ఉమ్మడి జిల్లాలో కార్ల సంఖ్య ఇలా..
జిల్లాలో కార్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యాంకుల సులభ వాయిదా రుణాలు, మార్కెట్‌లోకి కొత్త కార్లు వస్తుండటం, కరోనా తరువాత భౌతిక దూరానికి ప్రాధాన్యం పెరగడంతో సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా ఊపందుకుంది. ఇందుకు ఉమ్మడి జిల్లాలో రిజిష్టర్ అయిన కార్ల వివరాలే నిదర్శనం.
కరీంనగర్: 47,023
సిరిసిల్ల: 11,911
జగిత్యాల: 12,824
పెద్దపల్లి: 10,400
Comments
Please login to add a commentAdd a comment