ఉబర్, ఓలాలతో అంతా ఉల్టా పల్టా | Pollution And Traffic Problems Arising Due To Cab Services | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 6 2018 11:27 PM | Last Updated on Fri, Sep 7 2018 10:33 AM

Pollution And Traffic Problems Arising Due To Cab Services - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలోని నగరాలు గంటల గంటల ట్రాఫిక్‌ జామ్‌లకు, కాలుష్య కషాయానికి పెట్టింది పేరు. భారత సిలికాన్‌ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగుళూరు నగరంలో 52,07,693 ద్విచక్ర వాహనాలు, 14,49,334 ప్రైవేటు కార్లు ఉన్నాయంటే అక్కడ రోడ్లపై ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రోజుకు ఓ రెండు, మూడు గంటలపాటైనా ఈ వాహనాలన్నీ రోడ్లపైనే ఉంటాయంటే ట్రాఫిక్‌ జామ్‌లు ఇంకా ఎలా ఉంటాయో ఊహించడమే కాదు, ప్రత్యక్షంగా చూస్తునే ఉంటాం. ఇలాంటి సమయాల్లోనే పాశ్చాత్య దేశాల్లో ‘కారు పూలింగ్‌’ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌ లేదా ఓ కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు లేదా పరిచయస్థులు ఒక్కొక్కరు ఒక్కో కారుతీయకుండా, ఒకే కారులో నలుగురైదుగురు కలిసి ఆఫీసులకు వెళ్లడం, ఆఫీసుల నుంచి తిరిగి రావడం కోసం ఈ ‘కారు పూలింగ్‌’ ఐడియా కొంత మేరకు బాగానే పనిచేసింది. 

ఒక్కొక్కరిని ఆఫీసుల వద్ద దించుకుంటూ పోవాలి, మళ్లీ ఎక్కించుకుంటు రావాలి కనుక ‘కారు పూలింగ్‌’లో ఆఫీసుకు ముందుకు బయల్దేరాల్సి వచ్చేది. వచ్చేటప్పుడు ఇంటికి లేటుగా రావాల్సి వచ్చేది. ఇదే సమయంలో ఉబర్, ఓలా, లిఫ్ట్‌ లాంటి క్యాబ్‌ సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ‘కారు పూలింగ్‌’ కష్టాలు తప్పాయి. ‘ఇలాంటి క్యాబ్‌ సర్వీసుల వల్ల రోడ్లపై ప్రైవేటు వాహనాలు తగ్గి ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గుతాయి. ప్రైవేటు కార్లతో పోలిస్తే క్యాబ్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక వాతావరణంలో కలిసే కాలుష్యం కూడా తక్కువే’ అని ఉబర్‌ క్యాబ్‌ల వ్యవస్థాపకుడు ట్రావిస్‌ కలానిక్‌ 2015లో వ్యాఖ్యానించారు. పలు పాశ్యాత్య దేశాలతోపాటు భారత్‌లోని అన్ని నగరాలకు ఈ క్యాబ్‌ సర్వీసులు విస్తరించిన నేపథ్యంలో ట్రావిస్‌ కలానిక్‌ వ్యాఖ్యలు నిజమయ్యాయా? ట్రాఫిక్‌ రద్దీ తగ్గిందా, పెరిగిందా? కాలుష్యం తగ్గిందా, పెరిగిందా?

ఈ క్యాబ్‌ సర్వీసులు విస్తరించాక పాశ్చాత్య నగరాలతోపాటు పలు భారతీయ నగరాల్లో కూడా ట్రాఫిక్‌ రద్దీ పెరిగి జామ్‌లు పెరగడమే కాకుండా కాలుష్యం కూడా పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యకర పరిణామాలు. బాస్టన్, న్యూయార్క్, లండన్‌ నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీలు బాగా పెరిగాయి. ఇక భారత్‌లోని నగరాల్లో క్యాబ్‌ సర్వీసుల విస్తరణ వల్ల వాహనాల సంఖ్య పెరిగి, ట్రాఫిక్‌ రద్దీ, జాములు కూడా పెరిగాయి. బెంగళూరులో 2015, మే నెల నాటికి 84,92 టాక్సీలు ఉండగా, 2018 సంవత్సరం నాటికి అవి ఏకంగా 89 శాతం పెరిగి, 1,59,519కి చేరుకున్నాయి. ఇక ఈ కాలంలో ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు 24 శాతం పెరగ్గా, కార్ల సంఖ్య 31 శాతం పెరిగింది. ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌కు ఎంత ప్రాధాన్యత పెరిగిందో తెలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో ముంబై నగరంలో నలుపు–పసుపు కార్ల సంఖ్య 70 శాతం తగ్గి, క్యాబల సంఖ్య అంతకన్నా పెరిగిందట.

దేశంలోని నగరాల్లో రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా వాటికీ పరిమితులు ఉంటాయి. పీక్‌ అవర్స్‌ (అత్యవసర వేళల్లో)లో క్యాబ్‌లు ఎక్కువగా రోడ్డపైనే తిరుగుతున్నాయి. సాధారణ వేళల్లో మాల్స్, ఆఫీసులు, విద్యాసంస్థల వద్ద రోడ్లపైనే నిలిచి ఉంటున్నాయి. పర్యవసానంగా వాహనాల రాకపోకలకు రోడ్డు ఇరుకవుతోంది. పీక్‌ అవర్స్‌లో ఈ కార్లన్నీ ఆఫీసులు, మాల్స్, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, మెట్రో స్టేషక్లకే ఎక్కువగా పరుగులు తీయడం వల్ల ఆ ప్రాంతాలన్నీ రద్దీ అవుతున్నాయి. క్యాబ్‌ సర్వీసులు ఎక్కువగా విస్తరించిన అమెరికాలోని ఏడు నగరాల్లో చేసిన సర్వేలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రైడ్‌ షేరింగ్‌ వల్ల ఈ నగరాల్లో 49 శాతం నుంచి 61 శాతం వరకు కొత్త ప్రయాణికుల శాతం పెరిగి వాహనాల కాలుష్యం పెరిగింది. రైడ్‌ షేరింగ్‌ కారణంగా క్యాబుల్లో ప్రయాణిస్తున్న ఈ 49 శాతం నుంచి 61 శాతం మంది ప్రయాణికులు ఇంతకుముందు కాలి నడకనో, సైకిల్‌పైనో, ప్రభుత్వ బస్సులోనే వెళ్లే వారు. 

ఇప్పుడు భారత్‌ నగరాల్లో కూడా ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కాలి నడక, సైకిల్‌ లేదా బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు క్యాబుల్లో షేరింగ్‌ రైడ్‌లను ఆశ్రయిస్తున్నారు. అమెరికా సర్వేలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు కార్లు తమ గమ్యం దిశలో ఒక మైలు వెల్లాల్సి వస్తే క్యాబ్‌లు అలా ప్రతి మైలుకు 2.8 మైళ్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నాయట. షేరింగ్‌ రైడ్‌లో ఒకరి ఒక చోట, మరొకరి మరోచోట ఎక్కించుకొని వారిని గమ్యస్థానాలకు చేర్చడం వల్ల ఈ అదనపు తిరుగుడు అవుతుందట. దేశంలోని నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ‘షేరింగ్‌ రైడ్లే’ ఉత్తమ మార్గమని కేంద్ర ప్రభుత్వ మేధో మండలి ‘నీతి ఆయోగ్‌’ ఇదే సమయంలో అభిప్రాయ పడడం గమనార్హం. ప్రభుత్వ బస్సు, మెట్రో రైలు సర్వీసులను విస్తరించడం, సర్వీసుల సంఖ్యను పెంచడం, వాకింగ్, సైక్లింగ్‌లను ప్రోత్సహించడం ట్రాఫిక్‌ రద్దీ నివారణకు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement