సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఐటీ ఉద్యోగులు వరుసుగా ఆఫీసులకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
కాగా, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసిఐసిఐ, హెచ్ఎస్‌బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానంపై వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు మరో ప్రతిపాదన చేశారు. ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పనివేళల్లో మార్పులపై సూచనలు తెలియజేశారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు.
కార్ పూలింగ్ విధానం..
ఒకరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఒకరి కోసం కూడా కారును బయటకు తీస్తున్నారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. హైటెక్‌సిటీలో కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లేనని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు!
Comments
Please login to add a commentAdd a comment