సాక్షి,న్యూఢిల్లీ: క్యాబ్‌ల్లో షేరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో గమ్యస్ధానాలకు చేరుకునే వెసులుబాటు ఇక ఉండకపోవచ్చు. యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్స్‌కు త్వరలో చెక్ పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం నూతన ట్యాక్సీ స్కీమ్ ద్వారా వీటికి చెక్ పెట్టనుంది. సీటీ ట్యాక్సీ స్కీమ్ 2017కు ఢిల్లీ ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. ఈ నిబంధనల కింద షేర్ రైడ్‌ను అనుమతించబోరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా విధానాన్ని ప్రజల ముందుంచి వారి సూచనల మేరకు షేర్ రైడ్‌ను అనుమతించాలా లేదా అనేది నిర్ణయిస్తామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు.
షేర్ రైడ్, కార్ పూల్‌ను ఢిల్లీలో అనుమతించమని గతంలో ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్‌పై తిరిగే వాహనాలను పలువురు ప్రయాణీకులను ఎక్కించుకోవడాన్ని మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం అనుమతించరు. స్టేజ్ క్యారేజ్ పర్మిట్ కలిగిన బస్సుల వంటి ప్రజా రవాణా వాహనాలను మాత్రమే వివిధ లొకేషన్ల నుంచి ప్రయాణీకుల పికప్, డ్రాప్‌లకు అనుమతిస్తారు.ప్రస్తుతం యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్‌లు చట్టపరిధికి వెలుపల ఉన్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా అందుబాటు ధరలో సౌకర్యవంతమైన ప్రయాణంగా రైడ్ షేర్ ఢిల్లీలో ఆదరణ చూరగొంది.ఢిల్లీలో క్యాబ్ ప్రయాణాల్లో 30 శాతం పైగా షేర్ రైడ్‌లే ఉంటున్నాయి. ఏడాదిలో షేర్ రైడ్లు ఐదు రెట్లు పెరిగాయని ఇటీవల ఓలా ప్రకటించింది. ఓలా షేర్‌కు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం కీలక మార్కెట్‌గా ఓలా ప్రతనిధి చెబుతున్నారు.మరోవైపు కర్ణాటక ప్రభుత్వం షేర్ రైడ్ చట్టవిరుద్ధమంటూ దాన్ని నిషేధించేందుకు రవాణా శాఖ సంసిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment