Odd even formula
-
‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది. ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు. సరి-బేసి విధానం అంటే ఏమిటి? రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5…. ఇక సరి (ఈవెన్) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది. గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్‌లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్‌లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? -
‘సరి- బేసి’ విధానం తొలుత ఏ దేశంలో మొదలయ్యింది?
కాలుష్యం కాటుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్ జనం అతలాకుతలం అవుతున్నారు. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ స్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి ఫార్ములాను అమలు చేస్తోంది. దీపావళి అనంతరం ఢిల్లీలో సరి-బేసి ఫార్ములా అమలుకానుంది. అయితే ఈ విధమైన ఫార్ములా తొలిసారిగా ఎక్కడ అమలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2016లో బేసి-సరి ఫార్ములాను అమలు చేసింది. ఆ సమయంలో ఈ విధానం అందరికీ కొత్తగా అనిపించింది. చాలామందికి దీని గురించి అర్థం కాలేదు. ఈ ఫార్ములా ప్రకారం చివర బేసి సంఖ్య (3,5,7,9) ఉన్న వాహనాలు మాత్రమే బేసి సంఖ్యగల తేదీలలో నడుస్తాయి. సరి సంఖ్య గల వాహనాలు (2,4,6,8) రోడ్లపైకి రావడానికి సరిసంఖ్య గల తేదీలలోనే అనుమతి ఉంటుంది. 2016లో ఢిల్లీలో అమలు చేసిన ఈ ఫార్ములాను తొలిసారిగా మెక్సికోలో ప్రవేశపెట్టారు. దీనికి ‘హోయ్ నో సర్కులా’ అనే పేరు పెట్టారు. దీని అర్థం ‘మీ కారు ఈరోజు నడవదు’. అనంతర కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటువంటి విధానాలను అమలు చేశారు. బీజింగ్, బ్రెజిల్, కొలంబియా, పారిస్ తదితర ప్రాంతాల్లో సరి-బేసి విధానానికి సంబంధించిన నిబంధనలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇది కూడా చదవండి: దీర్ఘాయుష్షు అంటే ఎంత? -
థాంక్స్ టు 'ఆడ్-ఈవెన్'!
న్యూఢిల్లీ: ఆహ్లాదకరమైన వాతావరణం శనివారం హస్తిన వాసులను అలరించింది. సాధారణంగా చలికాలం పొగమంచుతో ఢిల్లీ వాతావరణం స్థానికులకు కొరుకుడు పడనిదిగా ఉంటుంది. దీనికితోడు కాలుష్యంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. కానీ తొమ్మిది రోజులుగా అమలుచేస్తున్న 'సరి-బేసి' అంకెల విధానం కారణంగా ఢిల్లీ వాతావరణంలో గణనీయమైన మార్పే వచ్చిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శనివారం బలమైన గాలులు వీయడం వల్ల ఢిల్లీ మొత్తం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానికులకు ఉపశమనం కలిగించింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం రోడ్లకు మీదకు వాహనాలు అనుమతించినా గత వారంలో పెద్దగా వాతావరణంలో మార్పు కనిపించలేదు. పొల్యూషన్ లెవల్స్ 2.5పీఎం, 10 పీఎం మధ్య కొనసాగి ఈ విధానం ప్రభావాన్ని ప్రశ్నించాయి. అయితే శనివారం వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపించింది. ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) గ్రాఫ్ శనివారం గంటగంటకు మెరుగవ్వడం కనిపించింది. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడింది. ఢిల్లీలో శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని.. వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు 'సరి-బేసి' వంటి అత్యవసర చర్యలు మరిన్ని తీసుకోవాల్సిన అవసరముందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ)కి చెందిన అనుమితా చౌదరి కోరారు. -
ఒకే కారులో సుప్రీం చీఫ్ జస్టిస్, మరో న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సరి-బేసి నిబంధన పాటించాలని ఎవరూ చెప్పరు, చెప్పలేరు. వీవీఐపీ హోదాలో ఆయనకు ఈ నిబంధన నుంచి మినహాయింపు కూడా ఉంది. అయినా.. తాను లేవనెత్తిన అంశానికి కట్టుబడి ఉండాలన్న నిబద్ధత ఆయనకు ఉంది. అందుకే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. తోటి న్యాయమూర్తి ఏకే సిక్రీతో కలిసి ఈ 15 రోజులూ కార్ పూలింగ్ పద్ధతిలో వస్తున్నారు. జస్టిస్ ఠాకూర్‌కు బేసి సంఖ్యతో ముగిసే నంబరున్న కారు ఉండగా, జస్టిస్ సిక్రీ కారు నెంబరు సరిసంఖ్యతో ముగుస్తుంది. ఈ ఇద్దరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉంటాయి. శీతాకాల సెలవుల తర్వాత సోమవారమే తొలిసారి కోర్టు ప్రారంభమైంది. దాంతో ఇద్దరూ కలిసి జస్టిస్ సిక్రీ కారులో సుప్రీంకోర్టుకు వచ్చారు. మంగళవారం నాడు జస్టిస్ ఠాకూర్ కారులో వస్తున్నారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించిన కేసులను విచారిస్తుంది. సరి-బేసి ఫార్ములాను అమలుచేస్తే దానికి తాను మద్దతిస్తానని డిసెంబర్ 6వ తేదీన తాను ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. కోర్టు గదుల లోపల గాలి నాణ్యత ఎలా ఉందో శాంపిల్స్ తీసుకుని పరిశీలించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని జస్టిస్ ఠాకూర్ ఆదేశించారు. -
'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే రోజుతో పోల్చుకుంటే హస్తినలో వాయుకాలుష్యం దాదాపు 300శాతం తగ్గిందని తాజాగా తేలింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదించిన ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఈ విధానం ఢిల్లీలో అమల్లోకి వచ్చింది. అయితే, సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడం.. ఉద్యోగులు పెద్దసంఖ్యలో వాహనాలతో రోడ్ల మీదకు రానుండటంతో సోమవారం నుంచి 'సరి-బేసి' విధానం మీద అసలు పరీక్ష మొదలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమల్లో భాగంగా సైకిల్ మీద తన కార్యాలయానికి వెళ్లి అందరి దృష్టి ఆకర్షించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'సరి-బేసి' విధానం అమలు విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ విధానం అమలు వల్ల శనివారం ఒక్కరోజు 300శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపారు. 15 రోజులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తే.. నగరంలో కాలుష్యంపై ప్రజలకు చైతన్యం పెరిగి.. ప్రత్యామ్నాయా రవాణా సదుపాయాన్ని కూడా వారు వినియోగించుకునే అవకాశముందని ఆయన చెప్పారు. -
స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి!
రాజధాని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రారంభించిన సరి-బేసి కార్ల ఫార్ములా గురించి ఢిల్లీ తొలి మహిళా పోలీసు కమిషనర్ కిరణ్ బేడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, జనవరి ఒకటో తేదీ కూడా కావడంతో జనం ఇంకా సెలవు మూడ్‌లోనే ఉన్నారని ఆమె అన్నారు. దానివల్ల ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చని, అయితే స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా దీన్ని సమర్థంగా అమలు చేయగలిగితే మంచిదని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి పద్ధతిలో కార్లను అనుమతిస్తున్న సందర్భంగా ఈ 15 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో స్కూలు బస్సులను డీటీసీ తన ఆధీనంలోకి తీసుకుని, సిటీబస్సులుగా నడిపిస్తుంది. ప్రస్తుతం ఎవరూ సరి-బేసి వ్యవస్థను విజయవంతం అయ్యిందని గానీ, విఫలం అయ్యిందని గానీ చెప్పకూడదని, అందరూ దీనికి సహకరించాలనే చెప్పాలని అన్నారు. సరి బేసి ప్లాన్‌కు అసలైన పరీక్ష మాత్రం స్కూళ్లు తెరిచిన తర్వాతే ఎదురువుతుందని, అప్పుడే ఢిల్లీవాసులు అందరూ నిజంగా రోడ్లను ఉపయోగిస్తారని ఆమె అన్నారు. అలాగే, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయని, వాటి గురించి కూడా ఆలోచించాలని చెప్పారు. కిరణ్ బేడీ ఢిల్లీలో పనిచేసినప్పుడు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహనాలను క్రేన్లతో టోయింగ్ చేయించి, అక్కడినుంచి తరలించేవారు. అందుకే ఆమెను అప్పట్లో 'క్రేన్ బేడీ' అని కూడా పిలిచేవాళ్లు. Monday is the real test to be achieved to begin with for #OddEvenPlan as we are right now into school holiday holiday season & a weekend.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 The 2nd real test for #OddEvenPlan to succeed will b when d school holidayseason ends.It's then when all Delhites r truly back using roads.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 Huge problem on Delhi-UP border--Commuters stranded. Tackling Delhi Pollution needed a Comprehensive-Co-option,which did not happen.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 -
వీవీఐపీలకూ మినహాయింపు లేదు!
న్యూఢిల్లీ: దేశరాజధాని హస్తినలో కాలుష్య నివారణకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములాకు సంబంధించిన విధివిధానాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతిస్తామని, మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలకు వీలు కల్పిస్తామని తెలిపింది. అత్యవసర వాహనాలైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వ్యాన్లకు ఈ ప్రణాళిక వర్తించదని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అయితే, వీవీఐపీలైన మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు ఈ ప్రణాళిక నుంచి మినహాయింపు ఉండబోదని, వారు కూడా దీనికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీలో విషపూరితమైన వాయుకాలుష్యాన్ని నివారించేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను అమలుచేస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు ఈ ప్రణాళిక వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైతే.. పది, పదిహేను రోజులు చూసి.. ఈ ప్రణాళికను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.