థాంక్స్ టు 'ఆడ్-ఈవెన్'!
న్యూఢిల్లీ: ఆహ్లాదకరమైన వాతావరణం శనివారం హస్తిన వాసులను అలరించింది. సాధారణంగా చలికాలం పొగమంచుతో ఢిల్లీ వాతావరణం స్థానికులకు కొరుకుడు పడనిదిగా ఉంటుంది. దీనికితోడు కాలుష్యంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. కానీ తొమ్మిది రోజులుగా అమలుచేస్తున్న 'సరి-బేసి' అంకెల విధానం కారణంగా ఢిల్లీ వాతావరణంలో గణనీయమైన మార్పే వచ్చిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శనివారం బలమైన గాలులు వీయడం వల్ల ఢిల్లీ మొత్తం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానికులకు ఉపశమనం కలిగించింది.
'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం రోడ్లకు మీదకు వాహనాలు అనుమతించినా గత వారంలో పెద్దగా వాతావరణంలో మార్పు కనిపించలేదు. పొల్యూషన్ లెవల్స్ 2.5పీఎం, 10 పీఎం మధ్య కొనసాగి ఈ విధానం ప్రభావాన్ని ప్రశ్నించాయి. అయితే శనివారం వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపించింది. ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) గ్రాఫ్ శనివారం గంటగంటకు మెరుగవ్వడం కనిపించింది. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడింది. ఢిల్లీలో శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని.. వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు 'సరి-బేసి' వంటి అత్యవసర చర్యలు మరిన్ని తీసుకోవాల్సిన అవసరముందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ)కి చెందిన అనుమితా చౌదరి కోరారు.