ప్రజల నెత్తిపై మోది వేశారు
► పెద్దలను వదలి పేదలపై పడ్డారు
► ప్రధానిది అనాలోచిత చర్య : జయప్రకాష్ నారాయణ్
► పెద్దల అభిప్రాయాలతో ప్రధానికి నివేదిక
► ‘నోట్ల రద్దు–భావి మార్గం’ అంశంపై ఇండియా నెక్ట్స్ చర్చా గోష్టి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వివిధ రంగాలకు చెందిన పెద్దలంతా ముక్తకంఠంతో నిరసించారు. ఇది అనాలోచిత, తొందరపాటు చర్య అని అభివర్ణించారు. ఖాతాదారులు బ్యాంకుల్లోని తమ సొమ్మునే డ్రా చేసుకునే వీలులేకుండా చేయడం రాజ్యాగం ఉల్లంఘన కిందకే వస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నోట్ల రద్దు–భావి మార్గం’ అంశంపై ఇండియా నెక్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ శనివారం చెన్నైలో చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ కీలకోపన్యాసం చేస్తూ, ప్రధాని ఆశయం మంచిదైనా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఆచరణలో సాధకబాధకాలు బేరీజు వేసుకోకుండా ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు.
కొత్త నోట్ల ముద్రణలో ఆర్బీఐ సామర్థ్యాన్ని తెలుసుకోకుండా పాత నోట్ల రద్దు దేశ ప్రజలను గందరగోళానికి గురిచేసిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించినపుడు మద్దతు ప్రకటించిన వాళ్లలో తాను ప్ర«థముడని అన్నారు. అయితే కాలక్రమేణా దాని పర్యవసానాలు గమనిస్తే ఇది ఎంత అనాలోచిత చర్యనో అర్థమైందని అన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ఉద్యోగులు, చిన్నపాటి వ్యాపారస్తులు, ప్రజలు ఇలా అన్ని వర్గాలవారు తమ డబ్బును తాముతీసుకోలేక పడుతున్న కష్టాలను, దీని వల్ల స్తంభించిపోయిన ఆర్థిక కార్యకలాపాలను వివరించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద వాళ్లను వదిలేసి కాయకష్టం మీద చిన్నచిన్న సంపాదనలపై ఆధారపడి జీవిస్తున్న చిరుద్యోగులు, కార్మికులు, రైతుల జీవనం అస్తవ్యస్తమైందని ఆయన అన్నారు.
మాజీ ప్రధాన మంత్రి సమాచార సలహాదారు, కేంద్ర ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఎస్ నరేంద్ర మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు పాలనపారమైన సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రధాని తొందరపాటుæ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలోని అవినీతి సమస్యను చర్చించి ముందుజాగ్రత్త చర్యలతో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.
వ్యాధి నివారణకు కొన్నిసార్లు చేదు మందులు, మరికొన్నిసార్లు సర్జరీలు కూడా అవసరమని డాక్టర్ సీఎంకే రెడ్డి అన్నారు. ఈ నోట్ల రద్దును కూడా ఆదే దృష్టితో చూడాలని అన్నారు. గతాన్ని వదిలేసి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియా నెక్ట్స్ సలహామండలి వైస్ చైర్మన్ అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు నల్లకుబేరులను పట్టుకునేందుకు ప్రజలందరినీ క్రిమినల్స్‌గా చూడటం సరికాదని హితవు పలికారు. పైగా నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కబెట్టడంలో ప్రభుత్వం సమర్దవంతంగా వ్యవహరించలేదని అన్నారు. దక్షిణ భారత తెలుగు చలన చిత్ర మండలి గౌరవ కార్యదర్శి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం సినిమా రంగాన్ని తీవ్రంగా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోయారు, షూటింగులు నిలిచిపోయాయని అన్నారు. నగదు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సినిమారంగానికి కొంత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇండియా నెక్ట్స్ ప్రధాన కార్యదర్శి మాలినేని అమరేంద్ర స్వాగతోపన్యాసం చేస్తూ, నల్ల ధనం నిర్మూలనకు నోట్ల రద్దు నిర్ణయం మంచిదైనా ప్రభుత్వం చేసిన ప్రకటనలు, ఆంక్షలు ప్రజల్లో అనేక భయ సందేహాలను సృష్టించాయని అన్నారు. దీనిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఅన్నారు. సదస్సులో మాట్లాడిన ప్రముఖలంతా ఏటీఎంల పరిస్థితిని సరిచేసి సామాన్య, పేద ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఏకపక్షంగా ఎలాంటి ముందుస్తు చర్యలు లేకుండా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని అన్నారు. ఇది ప్రాధమిక హక్కులకు భంగకలిగించేంతటి పరిణామాలకు దారితీసిన ఈ దేశ ప్రజలు సహనంతో భరిస్తున్నారని జేపీ, నరేంద్ర తదితరులు అన్నారు. వక్తల అభిప్రాయాలతో ఒక నివేదికను ప్రధానికి, ఆర్దికశాఖస్థాయి సంఘానికి సమర్పించాలని సదస్సు తీర్మానించింది.
ఈ సదస్సులో తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, హిందూ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ కే టీ జగన్నాథన్, మాజీ ఐఏఎస్ అధికారులు ఎన్ మురుగన్, రాజ్‌కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ల సంఘం దక్షిణాది రాష్ట్రాల విభాగం అధ్యక్షులు వీ మురళి, సైబర్ సొసైటీ ఆఫ్ ఇండియా పాలనామండలి చైర్మన్ వీ రాజేంద్రన్, డాక్టర్ సీఎంకే రెడ్డి, ఐక్యరాజ్యసమితి ఉద్యోగి వీ హరిప్రసాద్, ప్రైంపాయింట్ ఫౌండేషన్ చైర్మన్ ఏ శ్రీనివాసన్, అడయార్ ఆనంద భవన్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీ శ్రీనివాసరాజా, కేసీపీ సిమెంట్ లిమిటెడ్ ఎగ్జిక్యుటీవ్ ప్రెసిడెండ్ ఏ శివరామప్రసాద్, విజయ్ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ డీ రాంబాబు, ఎస్‌ఏఈ ఎండి ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ శేషాద్రి, సిమ్సన్ అండ్ కంపెనీ కార్యదర్శి, కలప, బంగారు వ్యాపారవేత్త జోయల్ వక్తలుగా పాల్గొని తమరంగాల్లో నోట్లరద్దు ప్రభావాన్ని, సాధకబాధకాలు వివరించారు. ఇండియన్ నెక్ట్స్ అధ్యక్షులు దువ్విగుంట వెంకటేశ్వర్లు, కోశాధికారి పెమ్మసాని మురళి, సలహా మండలి చైర్మన్ పద్మయ్య, పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్ రెడ్డి ఈ సదస్సుకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.