సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గవర్నరుకు సమాచారమివ్వకుండా తనను అరెస్టు చెయ్యటం చెల్లదు కనుక ఈ కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో మంగళవారం కూడా ఎలాంటి ఉపశమనం లభించలేదు. మంగళవారమే దీన్ని ముగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులుపట్టుబట్టినప్పటికీ.. దర్మాసనం ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
విశేషమేంటంటే తాను స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి పాల్పడలేదని కానీ... షెల్ కంపెనీల ద్వారా నిధులను కొల్లగొట్టడం జరగలేదని కానీ మొదటి నుంచీ ఒక్క ముక్క కూడా చెప్పని చంద్రబాబు... తాజా విచారణలో సైతం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద తన అరెస్టు చెల్లదని, కాబట్టి కేసును కొట్టేయాలనే సాంకేతిక అంశాలనే సుప్రీంకోర్టు ధర్మాసనానికి వినిపించారు. నిజానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)ను 2018లో సవరించారు. కొన్ని పదవుల్లో ఉన్నవారికి అరెస్టు విషయంలో రక్షణ ఉండేలా... తగిన అనుమతితో అరెస్టు చేసేలా ఈ సవరణ చేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం... ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని ప్రతి కోర్టులోనూ చెబుతున్నా... సుప్రీంకోర్టులో సైతం ఇదే విషయంపై చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించటం గమనార్హం.
సెక్షన్ 17ఏ అవినీతి కేసుల నుంచి కాపాడటానికా?
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అనేది అవినీతి కేసుల నుంచి కాపాడటానికి కాదని మంగళవారం నాటి వాదనల్లో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు. మంగళవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం ఎదుట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ నేరం కొన్నేళ్ల తర్వాత బయట పడితే అప్పటి చట్టాలకు లోబడే దర్యాప్తు జరుగుతుందని రోహత్గి ధర్మాసనానికి చెప్పారు. ‘‘చంద్రబాబు నాయుడి కేసు విషయానికొస్తే ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. కానీ నేరం 2018 కంటే ముందు జరిగింది. మరి అప్పట్లో జరిగిన నేరాన్ని అప్పటి చట్టాల ప్రకారమే దర్యాప్తు చేస్తారు కదా? 17ఏ అనేది ఈ కేసులో ఒక భాగం మాత్రమే’’ అని వివరించారు. దర్యాప్తు అధికారి వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను బట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పారాయన. ఈ సందర్భంగా ఇరు పక్షాలనూ ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. ప్రధానంగా ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తించడంపై ఇరు పక్షాల న్యాయవాదులనూ తీసింది.
తొలుత చంద్రబాబు నాయుడి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సోమవారం నాటి వాదనలను కొనసాగించారు. తనకు మరో గంట సమయమివ్వాలని ధర్మాసనాన్ని కోరగా అనుమతించింది. మూడు రోజులుగా వేచి చూస్తున్నామని ఇది ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అసలు నోటీసులివ్వకుండా మరోసారి వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వకూడదన్నారు. క్రిమినల్ కేసులకు కౌంటరు అఫిడవిట్ అక్కర్లేదని హరీష్ సాల్వే పేర్కొనగా... ముకుల్ రోహత్గి విబేదించారు. కోర్టు ప్రొసీజర్‌ను అనుసరించాలని కోరారు. నిందితుడికి రక్షణ కల్పించే అంశాలు కోర్టుకు వివరిస్తానని, గంట సేపు వాదనలకు అవకాశం ఇవ్వాలని సాల్వే మరోసారి కోరగా ధర్మాసనం అనుమతించింది.
గవర్నరు అనుమతి లేకుండా అరెస్టు చేశారు: సాల్వే
సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా దర్యాప్తు చేయడం సరికాదని సాల్వే తెలిపారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే చర్యలు చేపట్టాలన్నారు. సెక్షన్ 17ఏ దుర్వినియోగం కాకుండా ఉండాలనే తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో యశ్వంత్ సిన్హాపై దాఖలైన కేసుతో సహా మూడు కేసుల్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు అనేది హక్కు కాదని అవినీతి నిరోధక చట్టం చెబుతోందంటూ... ఆర్టికల్ 20(1)కి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా సాల్వే ఉదహరించారు. సాల్వే ఇలా పలు తీర్పులను ప్రస్తావిస్తుండగా... జస్టిస్ బోస్ వారించారు.
చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి ఉండాలని చెప్పడమే తన ఉద్దేశమని సాల్వే వ్యాఖ్యానించారు. దీంతో అసలు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అభియోగాలేంటని జస్టిస్ బేలా ఎం త్రివేదీ ఆరా తీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కుట్రకు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం అని సాల్వే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 120బీ, సెక్షన్ 420, సెక్షన్ 465 , అవినీతి నిరోధక (పీసీ) చట్టం సెక్షన్ 12, సెక్షన్ 13 వంటివి ఈ కేసులో ఉన్నాయన్నారు. ‘‘ఈ కేసు పూర్తిగా అవినీతి నిరోధక చట్టం కిందనే ఉంది.
ఆ చట్టం లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి వచ్చేది’’ అన్నారు. అయితే ఈ అభియోగాలన్నీ మేజిస్ట్రేట్ ముందు విచారణ చేయతగిన అభియోగాలేనా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. పీసీ చట్టం మినహాయిస్తే ఇవన్నీ మేజిస్ట్రేట్ పరిధిలోవేనని సాల్వే తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కొన్ని అంశాల్లో సెషన్స్ కోర్టు వెళ్లిన ధాఖలాలున్నాయని చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా చెప్పగా... జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని దేశమంతా ఒకే విధంగా ఉంటందని, మేజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు తరఫున వాదనలు ముగించారు.
సవరణల పేరుతో కేసు కొట్టేయమంటే ఎలా?: రోహత్గి
ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి... చంద్రబాబుపై నమోదైన కేసులో ఎలాంటి రాజకీయ కక్షా లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘‘ఎఫ్‌ఐఆర్ 2021లో నమోదయింది. 2023లో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు’’ అంటూ సెపె్టంబరు 8 నుంచీ జరిగిన పరిణామాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసు పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏకు లోబడే ఉందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అరెస్టయిన వెంటనే బెయిలు గురించో, రిమాండ్ వద్దనో కాకుండా నేరుగా పూర్తి కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారంటే చంద్రబాబు ఏంటో అర్థం చేసుకోవాలి. రెండు రోజుల్లోనే హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చిందంటే నిందితుడి ఉద్దేశాలను కోర్టు ఆలోచించాలి.
కాకపోతే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసింది’’ అని రోహత్గీ వివరించారు. ఒకే కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్లు ఉన్నప్పుడు ఏం చేయాలనే దానిపై కోర్టుకు రోహత్గి వివరణ ఇచ్చారు. చేసిన నేరానికి రెండు సెక్షన్లు వర్తింపజేసినప్పుడు ఏసీబీ కోర్టుకి రెండింటినీ విచారించే పరిధి ఉంటుందన్నారు. అయితే, సాల్వే చెప్పినట్లుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే.. సీఆర్‌పీసీ సెక్షన్ 3 కింద పేర్కొన్న నేరంతోపాటు ఇతర అభియోగాలు కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చునని చెప్పారు. ఈ దశలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని అవినీతి నిరోధక చట్టం తొలగించినప్పుడు సెక్షన్ 4(3) కూడా వర్తించదు కదా? అని ప్రశ్నించారు.
అందుకే ఒకే కేసులో వేర్వేరు అభియోగాలుంటే ఏం చేయాలనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని రోహత్గీ చెప్పారు. చంద్రబాబు కేసులో పీసీ చట్టాన్ని తొలగించినా మిగతా అభియోగాలపై ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేయొచ్చని వివరించారు. ‘‘చంద్రబాబు న్యాయవాది సాల్వే ప్రకారం ఈ కేసులో పీసీ చట్టం అభియోగాలు తొలగిస్తే.. సెక్షన్ 4(3) అభియోగాలకు అర్హత లేదు. అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి... ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సంగతేంటి’’ అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించారు.
సెక్షన్ 420 కింద అభియోగాలు ఉంటే వాటిని తొలగించలేమని, అదే విధంగా ఈ కేసులో పీసీ చట్టాన్ని కూడా తొలగించలేమని రోహత్గీ చెప్పారు. ‘‘ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొడితే ఆ కేసులో ఉద్దేశపూర్వకంగా కొట్టడంతో పాటు స్వచ్ఛందంగా హాని కలిగించడానికి సంబంధించిన సెక్షన్ 323 కూడా ఉంటుంది. ఆ సెక్షన్‌ను గనక తొలగిస్తే అభియోగాలు పోతాయా? చట్ట ప్రకారం సదరు వ్యక్తికి శిక్ష పడాలి కదా? సవరణల ద్వారా వచ్చిన కొత్త సెక్షన్లు చట్టానికి బలం చేకూర్చాలి తప్ప సవరణ పేరుతో కేసును కొట్టేయమంటే ఎలా?’’ అని రోహత్గి ప్రశ్నించారు.
ఎప్పటి నేరాలకు అప్పటి సెక్షన్లు...
2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ చెప్పారు. ‘‘సెక్షన్ 17ఏ వల్ల దర్యాప్తునకు కొన్ని మినహాయింపులు వచ్చాయి. అంతే!. 2018లో పీసీ చట్టంలో కొన్ని సెక్షన్లు తొలగించారు. కానీ అంతకు ముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. బాబు కేసు కూడా అంతే. చంద్రబాబుపై పీసీ చట్టం సెక్షన్ 13(1), (సీ), (డీ) అభియోగాలు ఉన్నాయి’’ అన్నారు.
ఆ సెక్షన్లను చట్టం నుంచి తొలగించారుగా? అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించగా... ఇంతకు ముందు తాను చెప్పిన అంశం ఇదేనని, సవరణకు ముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు వర్తిస్తాయని రోహత్గీ వివరించారు. చంద్రబాబు నిర్ణయాలు, అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందన్నారు. ఈ అంశాలు దర్యాప్తు సంస్థ ఎప్పుడు గుర్తించిందో తెలపాలని జస్టిస్ త్రివేదీ కోరారు. ట్రయల్ దశలోనే గుర్తించారని రోహత్గి తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయని, భారీ స్థాయిలో అవినీతి జరిగినప్పుడు ప్రాథమికంగానే కేసు కొట్టేయాలని కోరడం సరికాదని రోహత్గి తెలిపారు.
చట్ట సవరణ ఎప్పుడు చేయాలి? దాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తేవాలి? అనేది పార్లమెంటు అధికారమని, అయితే ఈ కేసులో 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవాలని సవరణలో ఎక్కడా లేదని రోహత్గీ వివరించారు. ‘‘తప్పు చేసిన వారంతా సెక్షన్ 17ఏను చూపించి అనుమతులు తీసుకురమ్మంటే ఎలా? ఇలాగైతే దర్యాప్తు చేయడానికి అధికారులు ముందుకొస్తారా? మన పార్లమెంటు విధానమే అవినీతి రహిత దేశం... ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి.
కాబట్టి అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17ఏ అండ కాకూడదు. అది ఉన్నది నిజాయితీ పరులకు మద్దతు ఇవ్వటానికి’’ అని రోహత్గీ వివరించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు కనక ఈ దశలో మెరిట్స్‌లోకి వెళ్లకూడదని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. అధికారిక విధులంటే ఏంటి? సిఫార్సులు అంటే ఏంటి? నిర్ణయాలంటే ఏంటి? ఇవన్నీ సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటాయని, మౌఖికంగా వాదించేది కాదని రోహత్గి తెలిపారు. సెక్షన్ 17ఏ రక్షణ కల్పిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా.. గతంలో జరిగిన వాటికి రక్షణగా ఉండదని, కానీ పిటిషనర్ అదే కోరుకుంటున్నారని రోహత్గి తెలిపారు.
ఎప్పుడైనా కేసు నమోదు చేయొచ్చు...
ఈ దశలో జస్టిస్ త్రివేదీ జోక్యం చేసుకొని సవరణ తర్వాత సదరు చట్టంనుంచి సెక్షన్‌ను తొలగిస్తే.. ఆ సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చా? అని ప్రశ్నించారు. దానికి వెసులుబాటు ఉందని రోహత్గి చెప్పారు. ‘‘ఫలానా నేరానికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడని ఏ చట్టమూ చెప్పలేదు. కాబట్టి సెక్షన్ తొలగించారని అనడం సరికాదు’’ అన్నారు. దీన్ని వివరించాలని జస్టిస్ త్రివేది కోరగా... ‘‘ఆర్టికల్ 20(1) ప్రకారం ఓ వ్యక్తి నేరం చేసిన విషయం కొన్నేళ్ల తర్వాత తెలిసినా కూడా కేసు నమోదు చేయొచ్చని చట్టం చెబుతోంది. దీనికి కొన్ని పరిధులు ఉండొచ్చు కానీ కేసు నమోదుకు ఆటంకమేమీ ఉండదు.
మూడేళ్లకు మించి శిక్ష పడే కేసులకు ఏదో ఒక దశలో ఎఫ్‌ఐఆర్ ఉండాలని సీఆర్‌పీసీ సెక్షన్ 468 చెబుతోంది‘‘ అంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 6 గురించి రోహత్గి చెప్పబోతుండగా.. విచారణ అవసరం లేదంటోందిగా?! అని జస్టిస్ త్రివేది అడిగారు. ‘‘అవును నిజమే. కానీ ఇక్కడ ఎఫ్‌ఐఆర్ నమోదయిందా లేదా అనేది ముఖ్యం’’ అని రోహత్గి చెప్పారు. భోజన విరామ అనంతరం మధ్యాహ్నాం వేరే కేసులు ఉన్నాయని విచారణను శుక్రవారం మధ్యాహా్ననికి వాయిదా వేస్తామని ధర్మాసనం పేర్కొంది. అయితే వాదనలు మంగళవారమే ముగించాలని లూత్రా కోరగా ధర్మాసనం నిరాకరించింది.
Skill Scam Case: అవినీతిని కాపాడటానికా సెక్షన్ 17ఏ?
Published Wed, Oct 11 2023 4:19 AM | Last Updated on Wed, Oct 11 2023 7:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment