స్కిల్‌ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ | No Interim Bail For CBN In Skill Scam Case Verdict Reserve on Quash | Sakshi
Sakshi News home page

స్కిల్‌ కేసులో మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ.. క్వాష్‌ పిటిషన్‌ తీర్పు రిజర్వ్‌

Published Tue, Oct 17 2023 4:59 PM | Last Updated on Tue, Oct 17 2023 7:55 PM

No Interim Bail For CBN In Skill Scam Case Verdict Reserve on Quash - Sakshi

సాక్షి, ఢిల్లీ:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి.  ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాదనలు ముగిసే సమయంలో ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్‌ కోసం అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. 

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రత్యేక కోర్టుల విచారణ అధికారం గురించి రోహత్గీ ప్రస్తావించారు. అయితే వాదనలు ముగియడంతో శుక్రవారానికి పిటిషన్‌ను వాయిదా వేసింది ధర్మాసనం. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే ఈ నెల 23 నుంచి 28 దాకా కోర్టుకి దసరా సెలవులు ఉన్నాయి. దీంతో.. దసరా తర్వాతే చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

రోహత్గీ సుదీర్ఘ వాదనలు
 ‘‘ఈ కేసులో 17ఏ సెక్షన్‌ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్‌ వర్తించదు. 17ఏ సెక్షన్‌ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్‌ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’’ అని రోహత్గీ వాదించారు.

అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. రూ.వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్‌ 422 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు’’

అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. ‘‘నేరం జరిగిందా లేదా? ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా? లేదా? అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ఎలా క్వాష్‌ చేస్తారు.మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి  ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి’’ అని రోహత్గీ వాదించారు.

 ‘‘మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది.. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉటుంది?’’ జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించారు.

ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్‌ ప్రకారమే కాకూడదు.. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు.

వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు
చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్‌ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్‌ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది అని వాదించారు.  

మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ
73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తాం అని సాల్వే కోరారు. ఈ క్రమంలో మరో లాయర్‌ సిద్ధార్థ లూథ్రా సైతం న్యాయమూర్తులకు అదే విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్‌ ప్రస్తావన లేదన్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌.. ప్రధాన కేసులో వాదనలు విన్నామని, తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement