సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. పెండింగ్ కేసులను తగ్గించే క్రమంలో వివాహ వివాదాలకు చెందిన బదిలీ, బెయిలు పిటిషన్లు చెరో పది చొప్పున అన్ని కోర్టులు విచారించాలని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయించామని సీజేఐ తెలిపారు. ‘‘ఫుల్ కోర్టు సమావేశంలో ప్రతి బెంచ్ రోజూ కుటుంబ వ్యవహారాలకు చెందిన పది బదిలీ పిటిషన్లు చేపట్టాలని నిర్ణయించాం. ఆ తర్వాత రోజూ పది బెయిలు సంబంధిత కేసులు.. శీతాకాల సెలవులకు ముందు పరిష్కరించాలని నిర్ణయించాం. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
వివాహ వివాదాలకు సంబంధించి ప్రస్తుతం 3 వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 13 కోర్టులు రోజూ పది బదిలీ కేసులు తీసుకుంటే రోజుకు 130 కేసులు చొప్పున వారానికి సుమారు 650 కేసులు పరిష్కరించొచ్చని సీజేఐ ఉదాహరించారు. శీతాకాల సెలవులకు ముందుగా ఈ బదిలీ కేసులు కొలిక్కి వస్తాయని తెలిపారు. అన్ని కోర్టులూ బెయిలు, బదిలీ పిటిషన్లు విచారించిన తర్వాత సాధారణ కేసులు విచారిస్తాయన్నారు. న్యాయమూర్తులు అర్ధరాత్రి వరకూ దస్త్రాలు చూడాల్సి వస్తుండడంతో వారిపై భారం తగ్గించాలని, అనుబంధ జాబితా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment