సాక్షి, సిటీబ్యూరో: ప్రకటనలే పెట్టుబడిగా, రిజిస్ట్రేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ .. తమ ఉద్యోగులనే పెళ్లి వారిగా నమ్మించి కాలయాపన చేసి నిండా ముంచేసే కొత్త తరహా మాట్రిమోనియల్ మోసాలు ఇటీవల నగరంలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీటిలో బాధితులు నష్టపోతున్నది చిన్న మొత్తాలే కావడంతో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఈ నకిలీ మారేజ్ బ్యూరోల దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయని నగర సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్ ద్వారా నైజీరియన్లు...
మాట్రిమోనియల్ సైట్స్‌లో ఉండే ప్రొఫైల్ ఆధారంగా విదేశాల్లో ఉండే వధూవరుల పేరుతో పరిచయం చేసుకుని మోసం చేసే కేసులు తరచు నమోదవుతూ ఉంటాయి. ఈ కేసుల్లో అత్యధికం ఉత్తరాదిలో స్థిరపడిన నైజీరియన్లే నిందితులుగా ఉంటున్నారు. ఆయా ప్రొఫైల్స్‌ను యాక్సస్ చేసే వీరు వాట్సాప్ ద్వారా కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత పెళ్లి ప్రతిపాదన తెస్తారు. ఆపై కొన్ని బహుమతులు పంపిస్తున్నాని, తీసుకువస్తున్నానంటూ అసలు కథ మొదలెడతారు. తామో, తాము పంపిన బహుమతులో విమానాశ్రయంలో దిగినట్లు, కస్టమ్స్ అధికారుల అడ్డుకున్నట్లు మరొకరితో ఫోన్లు చేయించి పన్నుల పేరుతో డబ్బు డిపాజిట్ చేయించుకుని ముంచేస్తారు. వీటిలో బాధితులు నష్టపోయేది భారీ మొత్తాలు కావడంతో ఈ తరహా ఆన్‌లైన్ నేరాలు తరచుగా నమోదవుతూనే ఉంటున్నాయి.
ఆకర్షణీయమైన ప్రకటనలతో.
చిన్న చిన్న మొత్తాలతో ముడిపడి ఉండి, నేరుగా జరిగే మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. నగరంలోని కొన్ని బోగస్ మ్యారేజ్ బ్యూరోల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలిపారు. వివిధ పత్రికల్లో క్లాసిఫైడ్స్ రూపంలో ఇచ్చే ప్రకటనలే వీరికి పెట్టుబడి. ‘విదేశంలో ఉండే వధువు/వరుడు... నెలకు రూ.2 లక్షలకు సమానమైన జీతం, రూ.5 కోట్ల ఆస్తి, కుల పట్టింపు లేదు... ఆసక్తి ఉంటే సంప్రదించండి’ ఈ తరహాలో ఆ ప్రకటనలు ఉంటున్నాయి. ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌ను ఎవరైనా ఫోన్ చేస్తే నేరుగా వచ్చి కలవమని చెబుతారు. అలా వెళ్లిన వారికి వరుడు/వధువు ప్రొఫైల్, కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపై వీరికి ఆ వరుడు/వధువు తల్లిదండ్రులదంటూ ఓ సెల్ నంబర్ ఇస్తున్నారు.
బిజీ... ప్రమాదం... పెళ్లి...
ఈ సెల్ నంబర్లు సదరు మారేజ్‌బ్యూరో వారే వేరే పేర్లతో తీసుకుంటున్నారు. తమ ఉద్యోగినులకే వీటిని అప్పగించి వచ్చే కాల్స్‌కు స్పందించేలా సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాల్ చేస్తే ఈ ఉద్యోగినులు ఆ వధువు/వరుడు తల్లి లేదా సోదరిగా మాట్లాడతారు. తమకు మ్యారేజ్‌బ్యూరో వారు మీ ప్రొఫైల్ కూడా పంపారని, నచ్చిందంటూ నమ్మబలుకుతారు. అయితే ప్రస్తుతం తమ వరుడు/వధువు విదేశంలో ఉన్నారని, మూడు నెలల తర్వాత తిరిగి వస్తారని చెప్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత కాల్ చేస్తే... అక్కడ తమ వారికి యాక్సిడెంట్ అయ్యిందని, ఆరు నెలల తర్వాత వస్తారని చెబుతారు. ఈ కాలం ముగిసిన తర్వాత ఫోన్లు చేసే వారు తక్కువగా ఉంటున్నారని, ఎవరైనా సంప్రదిస్తే అనుకోని పరిస్థితుల్లో తమ వధువు/వరుడుకు విదేశంలోనే వివాహమైందని చెప్పి మోసం చేస్తుంటారు. చాలా మంది బాధితులకు అసలు ఇది మోసంగా తెలియట్లేదు. అనుమానించిన వాళ్లూ కట్టింది చిన్న మొత్తాలే కదా అనే ఉద్దేశంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయట్లేదు. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment