
సాక్షి, సిటీబ్యూరో: సినిమాలపై ఉన్న ఆసక్తితో అవకాశాలు వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఓ యువతి సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారింది. ఆమెకు సినిమాలో ఓ పాత్ర ఇస్తామంటూ ఎర వేసిన దుండగులు వివిధ పేర్లు చెప్పి రూ.30వేలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ హైదరాబాద్‌కు చేరుకుంది.
ఎస్సార్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఈమె సినిమాల్లో అవకాశాలు ఇచ్చే సంస్థల కోసం ఇంటర్నెట్‌లోనూ అన్వేషించింది. ఈ నేపథ్యంలో తనకు లభించిన ఓ నంబర్‌ను సంప్రదించింది. ప్రాథమిక చర్చలు పూర్తయిన తర్వాత ఆమెకు ఓ సినిమాలో హీరో సోదరి పాత్ర ఇస్తున్నట్లు సదరు వ్యక్తులు చెప్పారు. దీనికోసం రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర చార్జీలు చెల్లించాలన్నారు. దీనికి ఆమె అంగీకరించడంతో రూ.500తో ప్రారంభించి పలు దఫాల్లో రూ.30వేలు తన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుని కాజేశారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధిత యువతి సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment