ఈడొచ్చిన ఆడపిల్లను అమ్మానాన్నలు ‘గుండెల మీద కుంపటి’లా భావించే వారు. పెళ్లి చేసి, ఓ అయ్య చేతిలో పెట్టడం పెనుభారంగా పరిగణించే వారు. ఆడబిడ్డను కన్నవారికి అలాంటి గడ్డు రోజులకు కాలం చెల్లుతోంది. మగపెళ్లి వారి కోర్కెల కొండవీటి చేంతాడు జాబితాను చూసి జడుసుకునే అగత్యం గతంగా మారుతోంది. పెళ్లిళ్ల పేరయ్యలకు, మ్యారేజ్ బ్యూరోలకు వధువులకు వరులను వెతకడం సునాయాసం కాగా.. వరులకు వధువులను వెతకడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. కారణం యువతుల సంఖ్య తగ్గిపోవడమే. వరకట్న దురాచారం దూరమై.. కన్యాశుల్కపు కాలం మళ్లీ వచ్చేలా ఉందన్న భావనా వ్యక్తమవుతోంది.
రాయవరం (మండపేట): మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లిళ్ల పేరయ్యల వద్ద ‘వధువు కావలెను’ అని వివరా లిచ్చే యువకుల జాబితా పెరిగిపోతోంది. కొడుకే పుట్టాలని ఇష్టదైవాలను కోరుకు న్న తల్లిదండ్రులు ఇప్పుడు వారిని ఓ ఇంటివారిని చేయడానికి మొక్కుకోవలసి వ స్తోంది. లింగ వివక్ష అయితేనేమి, ఇతర కారణాలైతేనేమి.. యువకుల సంఖ్యకు తగ్గ ట్టు యువతుల సంఖ్య పెరగక పోవడమే ఈ పరిణామానికి మూలం. ఒకప్పుడు త ల్లిదండ్రులు చూసిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పు డు లేరు. అబ్బాయిలు రాజీ పడినా..చదువుకున్న అమ్మాయిలు నో అంటున్నారు.
అమ్మాయి అభిప్రాయం కనుక్కుందురూ..
ఒకప్పుడు పెళ్లి చూపుల్లో మగపెళ్లివారు రకరకాల యక్షప్రశ్నలు వేసి అమ్మాయి సహనాన్ని పరీక్షించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. అమ్మాయి, ఆమె కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి ‘నేను నచ్చానో లేదో.. ఒకసారి అడగండి’ అంటున్నాడు వరుడు. అవసరమైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని, లాంఛనాలు అడగబోమని అంటున్నారు అధిక శాతం అబ్బాయిల తల్లిదండ్రులు. లింగ వివక్షతో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, వారిలో చాలా మంది విద్యావంతులు కావడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వైద్యవృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజనీరింగ్ వంటి కోర్సులను కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదివేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బాలికల తల్లిదండ్రులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యూకేజీ నుంచి డిగ్రీ వరకూ వేల నుంచి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్య, ఉద్యోగాల్లో అమ్మాయిలే రాణిస్తున్నారు.
పెరిగిన వివాహ వయస్సు..
ఒకప్పుడు అమ్మాయికి 16 వచ్చీ రాగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకూ ఆ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. అమ్మాయిలు తగిన ఉద్యోగాల్లో స్థిరపడే వరకూ ఆగడం, వారికి, వారి ఆకాంక్షలకు తగ్గ అబ్బాయి లభించక పోవడం ఇందుకు కారణంగా పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అబ్బాయిలు సైతం ఒకప్పుడు 20 ఏళ్లు వచ్చే లోపు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా ఇప్పుడు 30 ఏళ్ల దాకా పెళ్లి మాట ఎత్త వద్దంటున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే చిన్న వయస్సులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాల్లో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరోల వారు చెబుతున్నారు.
డిమాండ్ చేసే స్థితిలో యువతులు
ఉన్నత చదువులు చదివిన; ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అమ్మాయిలు సాదాసీదాగా డిగ్రీ, ఇంటర్ చదివిన అబ్బాయిలను ఇష్టపడడం లేదు. అబ్బాయి ఎంతగా ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. తమ డిమాండ్లను, కోరికలను మ్యారేజ్ బ్యూరోల ముందు ఉంచుతున్నారు. మరో వైపు అబ్బాయిలకు చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక పోవడంతో పలువురు వ్యాపారాల వైపు, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కోరికలకు తగ్గట్టు అబ్బాయిలు లభించడం లేదని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి, కొలువులు చేస్తున్న అమ్మాయిలు.. జీవిత భాగస్వామిగా ప్రభుత్వోద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు కావాలని అమ్మాయిలు కోతున్నారు. ఒక్కడే కుమారుడై ఉండాలని, అత్తామామలు లేకుంటే మరీ మేలని అనే వారూ ఉంటున్నారని మరో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అబ్బాయిలు తమ కోర్కెల చిట్టా విప్పడం అటుంచి, చేసుకోవడానికి అమ్మాయి దొరికితే అదే పదివేలనే స్థితికి వస్తున్నారు.
లింగ వివక్షతో తగ్గిన ఆడబిడ్డలు!
ఆడపిల్లను కంటే చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైనా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించి, ఆడబిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. యువతీ, యువకుల నిష్పత్తిలో తేడా పెరగడానికి ఇదో ప్రధాన కార ణం. సమాజానికి భావితరాన్ని అందించే బృహత్తర భారాన్ని మోసే స్త్రీ విలువను గు ర్తించని సంస్కార రాహిత్యం, యువతులకు భద్రత లేని వాతావరణం కూడా ఆడపిల్లలు వద్దనుకోవడానికి కారణాలు. ఆడబిడ్డలు ఎంత అపురూపమో, ఎంత అమూల్య మో చాటుతూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా; భ్రూణహత్యల నిరోధానికి కఠిన చ ట్టాలు చేస్తున్నా.. సమాజంలో అత్యధికుల దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడే పు ట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా.. తమ బతుకుతోటకు వసంతం వచ్చినట్టేననుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment