marriage bureaus
-
టెకీకి నరకం చూపిన ‘వరుడు’: మెసేజుల్లో మాత్రమే మర్యాద!
‘సంధ్యా.. (పేరుమార్చడమైనది) ఎంతసేపు కూర్చుంటావే అలా. నెలరోజులుగా చూస్తున్నాను. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. ఎందుకీ ఆలోచన’ గట్టిగానే మందలిస్తున్నట్టుగా అంది తల్లి. ‘అదేం లేదమ్మా!’ సర్దిచెబుతున్నట్టుగా అంది సంధ్య. ‘చూడమ్మా! నీవు ఆ కార్తీక్ (పేరు మార్చడమైనది)ని మర్చిపోలేకుంటే చెప్పు. అయిందేదో అయ్యింది. వాళ్ల వాళ్లతో మాట్లాడి,పెళ్లి చేస్తాం’ అనునయిస్తూ చెప్పింది తల్లి. ‘వద్దమ్మా! పెళ్లొద్దు. నే చచ్చిపోతాను’ అంటూ ఏడుస్తూ తల్లిని చుట్టేసింది. ‘ఏమైంద’ని తల్లీ తండ్రి గట్టిగా అడిగితే అసలు విషయం బయటపెట్టింది సంధ్య. ∙∙ సంధ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లిసంబంధాలు చూస్తూ సంధ్య ప్రొఫైల్‌ని మ్యాట్రిమోనియల్ సైట్లో పెట్టారు పేరెంట్స్. వచ్చిన ప్రొఫైల్స్‌లో కార్తీక్‌ది సంధ్యకి బాగా నచ్చింది. సంధ్య కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఇరువైపుల పెద్దలు ఓకే అనుకున్నారు. నెల రోజుల్లో పెళ్లి అనుకున్నారు. దాంతో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. త్వరలో జీవితం పంచుకోబోతున్నవారు అనే ఆలోచనతో పెద్దలూ అడ్డుచెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ విదేశాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకు ముందస్తుగా కావాల్సిన ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కార్తీక్ పాస్‌పోర్ట్ చూసింది సంధ్య. అందులో అతని పుట్టినతేదీ వివరాలు చూసి, ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని కార్తీక్‌ని అడిగింది. ‘మ్యాట్రిమోనియల్ సైట్ ప్రొఫైల్‌లో వేరే వివరాలున్నాయి. పాస్‌పోర్టులో వేరేగా ఉన్నాయి’ అని నిలదీసింది. ‘అదేమంత పెద్ద విషయం కాదు. డేటాఫ్ బర్త్‌లో కొంచెం తేడా అంతేగా!’ అన్నాడు కొట్టిపారేస్తూ కార్తీక్. ఇదే విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించింది సంధ్య. ప్రొఫైల్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం, ఇన్ని రోజులూ అసలు విషయం చెప్పకుండా దాచడంతో సంధ్య తల్లిదండ్రులు కార్తీక్‌ని, అతని తల్లిదండ్రులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కార్తీక్. ‘ఇంకా ఎన్ని వివరాలు దాస్తున్నారో.. ఈ సంబంధం మాకొద్దు’ అని చెప్పేశారు సంధ్య అమ్మనాన్నలు. సంధ్య కూడా తల్లిదండ్రులతో ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అనేసింది. దీంతో అనుకున్న పెళ్లి ఆగిపోయింది. ∙∙ నెల రోజులుగా తిండీ, నిద్రకు దూరమైన సంధ్య ఆ కొద్ది రోజుల్లోనే ఐదు కేజీల బరువు తగ్గిపోవడంతో భయపడిన సంధ్య తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించారు. సంధ్య ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు డాక్టర్. కార్తీక్‌ని మర్చిపోలేకనే ఇదంతానా అని తల్లి కూతురుని నిలదీయడంతో అదేం కాదంటూ అసలు విషయం చెప్పింది సంధ్య. ‘డియర్.. నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి’ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు సంధ్య. నెల రోజులుగా వాట్సప్ మెసేజ్‌లతో తల తిరిగిపోతోంది సంధ్యకి. ఆ వెంటనే వాట్సప్ కాల్. ‘నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను. నీ ఫొటోలు అడల్ట్స్ ఓన్లీ సైట్లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్నిక ఎవ్వరూ పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తా’ అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్. ఎత్తకపోతే బెదిరింపులు, ఎత్తితే బయటకు చెప్పనలవికాని మాటలతో వేధింపులు. డిప్రెషన్‌తో బయటకు రాలేకపోతోంది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పడం, నేనే పరిష్కరించుకుంటాను అనుకున్న సంధ్య.. ఇక వేగలేక ‘చచ్చిపోతాను’ అంటూ తల్లి వద్ద ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ‘అమ్మా, కార్తీక్‌ని మర్చిపోలేక కాదు. అతన్ని పెళ్లి చేసుకున్నా నిజంగానే చచ్చిపోతాను. ఈ వేధింపులు నా వల్ల కాదు’ అనడంతో సంధ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తెలివిగా ఎదుర్కోవాలి... దొరికితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని మెసేజుల్లో చాలా అందమైన, మర్యాదపూర్వకమైన భాష వాడేవాడు కార్తీక్. కానీ, ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే వాడు. వాట్సప్ కాల్ అయితే రికార్డ్ కాదని అతని ప్లాన్. నిపుణుల సాయం తీసుకున్న సంధ్య, వారిచ్చిన సూచన మేరకు ఒక రోజు కార్తీక్ వాట్సప్ కాల్ చేసినప్పుడు స్పీకర్ ఆన్ చేసి, మరో ఫోన్లో అది రికార్డ్ చేసింది. ఆ వాయిస్‌ను పోలీసుల ముందు పెట్టింది. దీంతో వేధింపులకు చెక్ పడింది. కేసు ఫైల్ అయ్యి, అతను విదేశాలకు వెళ్లడం కూడా ఆగిపోయింది. తెలివిగా సమస్యను ఎదుర్కోవాలి. అవగాహన లేకుండా జీవితాలను చేజార్చుకోకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ ధైర్యంగా ఉండాలి మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్ సైట్స్‌లలో వివరాలతో పాటు, తప్పుడు ఫోటోలు కూడా పెడుతుంటారు. తెలిసి, తెలియక వారితో క్లోజ్ అయినప్పుడు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. పూర్తి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అభిరుచులు తెలుసుకోవడం మాత్రమే కాదు అతని గురించి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని, మూవ్ అవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. తమకు అన్యాయం జరిగిందని అర్ధమైతే, ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఈడొచ్చిన కొడుకే ‘గుండెల మీద కుంపటి’!
ఈడొచ్చిన ఆడపిల్లను అమ్మానాన్నలు ‘గుండెల మీద కుంపటి’లా భావించే వారు. పెళ్లి చేసి, ఓ అయ్య చేతిలో పెట్టడం పెనుభారంగా పరిగణించే వారు. ఆడబిడ్డను కన్నవారికి అలాంటి గడ్డు రోజులకు కాలం చెల్లుతోంది. మగపెళ్లి వారి కోర్కెల కొండవీటి చేంతాడు జాబితాను చూసి జడుసుకునే అగత్యం గతంగా మారుతోంది. పెళ్లిళ్ల పేరయ్యలకు, మ్యారేజ్ బ్యూరోలకు వధువులకు వరులను వెతకడం సునాయాసం కాగా.. వరులకు వధువులను వెతకడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. కారణం యువతుల సంఖ్య తగ్గిపోవడమే. వరకట్న దురాచారం దూరమై.. కన్యాశుల్కపు కాలం మళ్లీ వచ్చేలా ఉందన్న భావనా వ్యక్తమవుతోంది. రాయవరం (మండపేట): మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లిళ్ల పేరయ్యల వద్ద ‘వధువు కావలెను’ అని వివరా లిచ్చే యువకుల జాబితా పెరిగిపోతోంది. కొడుకే పుట్టాలని ఇష్టదైవాలను కోరుకు న్న తల్లిదండ్రులు ఇప్పుడు వారిని ఓ ఇంటివారిని చేయడానికి మొక్కుకోవలసి వ స్తోంది. లింగ వివక్ష అయితేనేమి, ఇతర కారణాలైతేనేమి.. యువకుల సంఖ్యకు తగ్గ ట్టు యువతుల సంఖ్య పెరగక పోవడమే ఈ పరిణామానికి మూలం. ఒకప్పుడు త ల్లిదండ్రులు చూసిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పు డు లేరు. అబ్బాయిలు రాజీ పడినా..చదువుకున్న అమ్మాయిలు నో అంటున్నారు. అమ్మాయి అభిప్రాయం కనుక్కుందురూ.. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో మగపెళ్లివారు రకరకాల యక్షప్రశ్నలు వేసి అమ్మాయి సహనాన్ని పరీక్షించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. అమ్మాయి, ఆమె కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి ‘నేను నచ్చానో లేదో.. ఒకసారి అడగండి’ అంటున్నాడు వరుడు. అవసరమైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని, లాంఛనాలు అడగబోమని అంటున్నారు అధిక శాతం అబ్బాయిల తల్లిదండ్రులు. లింగ వివక్షతో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, వారిలో చాలా మంది విద్యావంతులు కావడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వైద్యవృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజనీరింగ్ వంటి కోర్సులను కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదివేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బాలికల తల్లిదండ్రులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యూకేజీ నుంచి డిగ్రీ వరకూ వేల నుంచి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్య, ఉద్యోగాల్లో అమ్మాయిలే రాణిస్తున్నారు. పెరిగిన వివాహ వయస్సు.. ఒకప్పుడు అమ్మాయికి 16 వచ్చీ రాగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకూ ఆ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. అమ్మాయిలు తగిన ఉద్యోగాల్లో స్థిరపడే వరకూ ఆగడం, వారికి, వారి ఆకాంక్షలకు తగ్గ అబ్బాయి లభించక పోవడం ఇందుకు కారణంగా పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అబ్బాయిలు సైతం ఒకప్పుడు 20 ఏళ్లు వచ్చే లోపు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా ఇప్పుడు 30 ఏళ్ల దాకా పెళ్లి మాట ఎత్త వద్దంటున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే చిన్న వయస్సులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాల్లో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరోల వారు చెబుతున్నారు. డిమాండ్ చేసే స్థితిలో యువతులు ఉన్నత చదువులు చదివిన; ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అమ్మాయిలు సాదాసీదాగా డిగ్రీ, ఇంటర్ చదివిన అబ్బాయిలను ఇష్టపడడం లేదు. అబ్బాయి ఎంతగా ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. తమ డిమాండ్లను, కోరికలను మ్యారేజ్ బ్యూరోల ముందు ఉంచుతున్నారు. మరో వైపు అబ్బాయిలకు చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక పోవడంతో పలువురు వ్యాపారాల వైపు, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కోరికలకు తగ్గట్టు అబ్బాయిలు లభించడం లేదని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి, కొలువులు చేస్తున్న అమ్మాయిలు.. జీవిత భాగస్వామిగా ప్రభుత్వోద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు కావాలని అమ్మాయిలు కోతున్నారు. ఒక్కడే కుమారుడై ఉండాలని, అత్తామామలు లేకుంటే మరీ మేలని అనే వారూ ఉంటున్నారని మరో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అబ్బాయిలు తమ కోర్కెల చిట్టా విప్పడం అటుంచి, చేసుకోవడానికి అమ్మాయి దొరికితే అదే పదివేలనే స్థితికి వస్తున్నారు. లింగ వివక్షతో తగ్గిన ఆడబిడ్డలు! ఆడపిల్లను కంటే చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైనా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించి, ఆడబిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. యువతీ, యువకుల నిష్పత్తిలో తేడా పెరగడానికి ఇదో ప్రధాన కార ణం. సమాజానికి భావితరాన్ని అందించే బృహత్తర భారాన్ని మోసే స్త్రీ విలువను గు ర్తించని సంస్కార రాహిత్యం, యువతులకు భద్రత లేని వాతావరణం కూడా ఆడపిల్లలు వద్దనుకోవడానికి కారణాలు. ఆడబిడ్డలు ఎంత అపురూపమో, ఎంత అమూల్య మో చాటుతూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా; భ్రూణహత్యల నిరోధానికి కఠిన చ ట్టాలు చేస్తున్నా.. సమాజంలో అత్యధికుల దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడే పు ట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా.. తమ బతుకుతోటకు వసంతం వచ్చినట్టేననుకుంటారు. -
పెళ్లికాని పూజారులు!
పూజారులు.. పురోహితులు.. అయ్యవారు.. పేరు ఏదైనా హిందూ సంప్రదాయంలో వీరు లేకుండా శుభకార్యాలను ఊహించడం కష్టమే. వివాహం.. గృహప్రవేశం.. యాగాలు.. హోమాలు.. ఇలా ఏది జరిగినా వీరు కచ్చితంగా ఉండాల్సిందే. అంతటి ప్రాముఖ్యత కలిగిన బ్రాహ్మణులను ఇప్పుడు ఓ సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే వివాహం. వందల పెళ్లిళ్లు చేసే పురోహితుడికే వివాహ యోగం కరువవుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా.. సమస్య తీవ్రత రోజురోజుకీ పెద్దదవుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరించిన యువకుడికి వరుడయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. నిత్యం కొన్ని వేల పెళ్లి సంబంధాలను సేకరించే మ్యాట్రిమోనీలు కూడా పూజారుల నుంచి ప్రొఫైల్స్‌ను స్వీకరించడంలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘నాకు కాబోయే భర్త పూజారి...’ అనే మాటను వధువు అంగీకరించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు ఈ పెళ్లికాని పూజారులు. పురోహితుడి వృత్తి పట్ల ప్రజలకు గౌరవం తగ్గడం మరో కారణమంటున్నారు వేద పండితులు. కారణాలు ఏవైనా పెళ్లికాని పూజారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద నష్టాన్నే ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన చెందుతోన్న బ్రాహ్మణుల ఆవేదనపై స్పెషల్ ఫోకస్.. సాక్షి, హైదరాబాద్ ‘‘ఈ నెల 10న కూకట్పల్లి ప్రాంతంలో బ్రహ్మణ వధూవరుల నగర సంఘం పరిచయ వేదికను కేవలం పూజారులు, పురోహితుల కోసం ఏర్పాటు చేశారు. అక్కడికి 65 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు వచ్చారు. ఆ 65 మందిలో నలభైకి దగ్గరగా ఉన్నవారు ఓ ముప్పైమంది ఉన్నారు. వారిలో నలభై దాటినవారూ ఉన్నారు. ఎప్పటి నుంచో వధువు కావాలంటూ మ్యారేజీ బ్యూరోల చుట్టూ తిరుగుతున్న వాళ్లే వీరంతా. ఇక అమ్మాయిల విషయానికొస్తే వారి మొదటి చాయిస్ ఇతర వృత్తుల్లో ఉన్నవారికే’’ ‘‘గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన వివాహ పరిచయ వేదికలో 103 మంది పుజారులు.. వధువు కావాలని వస్తే 14 మంది మాత్రమే యువతులు వచ్చారు. అమ్మాయిల్లో ఐదుగురు రెండోపెళ్లివారు. మిగిలినవారికి కూడా మొదటి చాయిస్ ఉద్యోగస్తులే’’ ‘‘ఏడాది క్రితం చిక్కడపల్లి పంచముఖ ఆంజనేయస్వామి గుడిలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి వధువు కావాలంటూ 160 మంది అబ్బాయిలు వస్తే.. 20 మంది మాత్రమే అమ్మాయిలు వచ్చారు. వారిలో పూజారులను భర్తగా అంగీకరించింది ముగ్గురు అమ్మాయిలే’’ మారుతున్న అమ్మాయిల అభిరుచులకు.. వివాహం కోసం పూజారులు పడుతున్న ఇబ్బందులకు.. అద్దం పడుతున్నాయి ఈ ఘటనలు. ఇవనే కాదు.. ఈ మధ్యకాలంలో జరిగిన చాలా వివాహ పరిచయ వేదికల్లోనూ ఇదే పరిస్థితి. పూర్వం ఒకరిద్దరు అమ్మాయిలకే పురోహితుడంటే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకరిద్దరు కూడా పురోహితుడ్ని ఇష్టపడే పరిస్థితి లేదు. అమ్మాయిలందరూ చదువుకుని, ఉద్యోగం చేసే అబ్బాయినే భర్తగా పొందడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం అమ్మాయిలు మంచి చదువులు చదువుకోవడం, ఉద్యోగాల్లో స్థిరపడడం, ఆధునిక జీవనానికి అలవాటుపడడమే. ఇది కేవలం వధువు కోరికే కాదు.. ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆఖరికి పురోహితుడుగా పనిచేస్తున్న తండ్రులు కూడా తన కూతురిని ఉద్యోగస్తుడికి ఇవ్వడానికే ఇష్టపడుతున్నారు. కూకట్పల్లి ప్రాంతంలో ఓ గుడిలో పూజారిగా పనిచేస్తున్న అరవై ఏళ్ల విశ్వేశ్వరశర్మ(పేరు మార్చాం) మాటల్లో చెప్పాలంటే.. ‘‘నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి బీటెక్ పూర్తి చేసింది. రెండేళ్లక్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగికిచ్చి పెళ్లి చేశాను. చిన్నమ్మాయి ఎంబీఏ పూర్తి చేసింది. సంబంధాలు చూస్తున్నాను. నా బంధువుల్లోనే పురోహితులుగా పనిచేస్తున్నవారు చాలామంది మా అమ్మాయిని చేసుకుంటామని అడుగుతున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. పురోహితుడిగా నేను పడ్డ కష్టాలు.. సమాజంలో ఎదుర్కొన్న అవమానాలు నా పిల్లలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఉద్యోగికిచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను’’ అని చెప్పారు. ఓ వధువు తండ్రిగా ఆయన చెప్పిన మాటలనే మిగతా తండ్రులు కూడా తు.చ. తప్పకుండా పాటించడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. దరఖాస్తులు స్వీకరించని మ్యాట్రిమోనీలు పురోహితుల నుంచి వధువు కావాలంటూ వివాహ పరిచయ వేదికల వద్దకు వచ్చే దరఖాస్తులను ఆయా కంపెనీలు స్వీకరించడం లేదు. అదేంటని తెలుగు మ్యాట్రిమోనీలో పనిచేస్తున్న సీనియర్ అధికారి లక్ష్మిని అడిగితే.. ‘‘పురోహితుడు అనే పేరు వినపడగానే ఆ కులం అమ్మాయిలు ఆసక్తి చూపడం లేదు. అమ్మాయిలనే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా. మేం గత రెండేళ్ల నుంచి వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం లేదు. డబ్బులు వస్తాయి కదా! అని దరఖాస్తు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతకంటే పాపం ఏముంటుంది చెప్పండి. ఎవరూ పిల్లనివ్వరని తెలిసి కూడా వారి దరఖాస్తులు స్వీకరించడం తప్పని మేం వెంటనే తిరస్కరిస్తున్నాం. కావాలంటే వెబ్సైట్లో వివరాలు పెట్టుకోమని చెబుతున్నాం’’ అని చెప్పారు. ఆ చిన్నచూపు కారణంగా.. పురోహితుల పట్ల ప్రజల్లో ఉన్న చిన్నచూపే అమ్మాయిల మనసు మార్చేస్తోందని అంటున్నారు 30 ఏళ్ల నుంచి బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్న కల్వకొలను శ్రీనివాస్. సమాజంలో మిగతా వృత్తులకున్న గౌరవం, హోదా పూజారులకు ఉండకపోవడం, చిన్నచూపు కారణంగా ఈ పెద్ద నష్టాన్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్. ఇక లాభం లేదని ఈయనిచ్చిన కౌన్సెలింగ్‌తో ఓ పూజారిని పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయితో మిగతా అమ్మాయిలకు కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తున్నారు. అయితే మార్పు పూజారులను ఇష్టపడని అమ్మాయిల్లో మాత్రమే కాదు మొత్తం సమాజంలో రావాలని కోరుకుంటున్నారు. ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిణ్ మ్యాట్రిమోనియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫ్ ఇండియా సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ పురోహితుల్ని పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు వెళ్లి పరిచయ వేదిక పేరుతో కౌన్సెలింగ్ ద్వారా వివరిస్తున్నారు. మా తర్వాత తరం ఉండదు.. నగరంలోని మల్కాజిగిరి, చిక్కడపల్లి వంటి సెంటర్లలో రోజూ ఉదయం సమయంలో కనిపించే అడ్డా పూజారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ‘‘చేతి నిండా పని.. జేబు నిండా సొమ్ములున్న పూజారులకే పిల్లనివ్వడం లేదు. ఇక మాలాంటివారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది’’ అని అంటున్నారు. విఘ్నేశ్వర శర్మ(పేరు మార్చాం) అనే 43 ఏళ్ల బ్రహ్మచారి పూజారి. ‘‘మొన్నీ మధ్యే మా స్నేహితుడు పిల్ల దొరక్క ఇతర కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా వృత్తికి దూరం అవ్వాల్సి వచ్చింది. అప్పటివరకూ పూజలకు, పురస్కారాలకు పిలిచేవారంతా ‘శూద్రపిల్లని కట్టుకున్న అతను పూజారేంటి..?’ అంటూ దూరం పెట్టారు. దాంతో చేసేది లేక ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నానాపాట్లు పడుతున్నాడు పాపం’’ అంటూ అడ్డామీదున్న ఓ యువ పూజారి కడుపుచించుకున్నాడు. ‘‘ఇలాగే మాకు పెళ్లిళ్లు కాకుండా ఉంటే మా తర్వాతి తరం ఉండదు. దీని ప్రభావం భవిష్యత్తుపై చాలా భయంకరంగా ఉంటుంది. క్యాసెట్లతో పెళ్లిళ్లు, పూజలు చేసుకునే పరిస్థితి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మరో పెళ్లికాని పూజారి. హైటెక్ పూజారులు వేరు.. నగరంలో కొందరు యువకులు ఒకవైపు తమ ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు పూజలకు, పెళ్లిళ్లకు పురోహితులుగా పనిచేస్తున్నారు. సమయానుకూలంగా వేషం మారుస్తూ పూజలకు సంబంధించి హైటెక్ నగరంలో ఆన్లైన్లో వెబ్సైట్లను సైతం నడుపుతున్న ఈ పూజారులు పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనడం లేదు. కారణం.. ఒక్క పూజల సమయంలో తప్ప మిగతా వేళల్లో నలుగురిలో ఒకడిగా కలసి బతకడమే అంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ పూజలకు, వ్రతాలకు హాజరయ్యే ఓ యువ పూజారి. ‘‘సంభావనల రేటు బాగా పెరిగింది. మూడు పూజలు, నాలుగు వ్రతాలు చేస్తే నేను నెలంతా ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుకన్నా ఎక్కువే వస్తుంది. అలాంటప్పుడు నేను కష్టపడి నేర్చుకున్న వేద విద్యని ఎందుకు పక్కన పెట్టాలి చెప్పండి?’ అని ప్రశ్నిస్తున్నాడు మూర్తి అనే హైటెక్ పూజారి. పూజారి ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించే పిలకకు దూరంగా ఉండడం వీరి ప్రత్యేకత. ఒక సంచి, ధోవతి, కండువాతో పాటు మరో బ్యాగ్‌లో టీషర్టు, జీన్స్‌ప్యాంటు వెంట బెట్టుకునే ఈ హైటెక్ పూజారులకు మంచి గిరాకీనే ఉంది. అంతేకాదు.. ఇంకొందరు సాఫ్ట్వేర్ పూజారులు మరో నాలుగు అడుగులు ముందుకేసి ఆన్లైన్ పూజలు కూడా చేస్తున్నారు. వెబ్‌క్యామ్ సాయంతో విదేశాల్లో తెలుగువారికి పూజలు, వ్రతాలు చేస్తూ చేతినిండా డాలర్లు సంపాదిస్తున్నారు ఈ హైటెక్ పూజారులు. పూజారి భార్యగానా..? ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన లలిత(పేరు మార్చాం) అనే డిగ్రీ చదివిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. లలిత అన్నయ్య పురోహితుడు. ఇప్పటివరకూ ఒక్క పెళ్లి సంబంధం కూడా రాలేదు. ఎదురు కట్నం ఇస్తామన్నా లాభం లేకపోయింది. ఆ అబ్బాయి పెళ్లి గురించి చూస్తుంటే అమ్మాయికి పెళ్లి వయసు దాటిపోతోందని ఆమెకు సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నావని లలితను ప్రశ్నిస్తే.. ‘‘నేను ఈ మధ్యనే డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం జాబ్ ట్రయిల్స్‌లో ఉన్నాను. ఏదో ఒక ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెద్ద జీతగాడు కాకపోయినా ఉద్యోగస్తుడు అయితే చాలు. ఎందుకంటే నాకు జాబ్ చేయాలంటే ఇష్టం. ఇప్పటికే పూజారి పెళ్లికొడుకుల సంబంధాలు చాలా వచ్చాయి. నేను చేసుకోనని చెప్పాను. కారణం.. ఈ వృత్తి పట్ల గౌరవం లేకపోవడం అని కాదు.. పూజారి భార్యగా బోలెడన్ని నియమాలు, నిష్టలు పాటించాలి. రేపు పుట్టే పిల్లల జీవితంపై ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడున్న ఫాస్ట్లైఫ్కి దూరంగా ఇంకా పాతపద్ధతుల్లో ఇంటికే పరిమితమై మడి, ఆచారం అంటే నా వల్ల కాదు’’ అంటూ తన మనసులోనిమాట చెప్పింది లలిత. పేరు: రామ్మూర్తి శర్మ (పేరు మార్చాం). వయసు: 42 ఏళ్లు. ఎత్తు: 5.9 అడుగులు. వృత్తి: పురోహితుడు. సంపాదన: (నెలకు) లక్ష రూపాయలు. సొంతిళ్లు, కారు ఉన్నాయి. వరుడు ప్రొఫైల్ అంతా బాగానే ఉంది కానీ, పురోహితుడు అనే మాటే నచ్చడం లేదు అమ్మాయికి. వధువు కోసం ఎక్కని గుమ్మం లేదు. చివరికి ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అయినా లాభం లేకపోయింది. కొడుక్కి వివాహయోగం ఇంకెన్నాళ్లకో అంటూ బెంగపడ్డారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితి ఈ ఒక్క పురోహితుడిదే కాదు.. అందరిదీ. ఈ సమస్యకి సంబంధించి ఈ మధ్యకాలంలో కేవలం పురోహితుల కోసం ఏర్పాటు చేసిన కొన్ని వివాహ పరిచయ వేదికలకు సంబంధించిన రిపోర్టుని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. తల్లిదండ్రుల పాత్ర పెద్దది డాక్టర్ చదివిన అమ్మాయికి డాక్టర్ చదివిన అబ్బాయి భర్త అయితే బాగుంటుందని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్.. ఒకే వృత్తిలో ఉన్నవారు దంపతులయితే బాగుంటుందని ఎంతో కష్టపడి సంబంధాలు వెతుకుతారు. పౌరోహిత్యం దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రుల లెక్కలు మారిపోతున్నాయి. ఈ వృత్తి ఎంతో గొప్పగా చెప్పాల్సిన పురోహితుడే తన కూతుర్ని ఒక సాఫ్ట్వేర్ చేతిలో.. ఓ డాక్టర్ చేతిలో పెట్టాలనుకోవడం దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. నిజానికి ఇంతకన్నా గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన ఉద్యోగం మరొకటి ఉండదు. ఇప్పటికే ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు క్యాసెట్లు పెట్టుకుని చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా అమ్మాయిలు ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో గుళ్లో మంత్రాలు చదవడానికి, పందిట్లో పెళ్లి చేయడానికి పురోహితుడు కరువవుతాడు. - కొప్పరపు బలరామకృష్ణమూర్తి, అధ్యక్షుడు, అఖిల భారత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రముల సమాఖ్య ఆహార్యమే సమస్యా? వెతగ్గా వెతగ్గా ఓ పూజారికి పెళ్లి కుదిరింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక అమ్మాయికి పూజారి సంబంధం కుదుర్చుకున్నారు ఆ తల్లిదండ్రులు. పెళ్లి ఖర్చులన్నీ ఆ పెళ్లికొడుకువేనని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే పదివేలనుకున్న పెళ్లికొడుకు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తాంబూలాల సమయంలో ముప్పైవేల ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్‌ని బహుమతిగా ఇచ్చాడు. దాంతో సరిపెట్టకుండా ‘‘నేను పేరుకే పూజారిని కానీ నీకు నచ్చినట్టుగానే ఉండొచ్చని’’ పది మంది ముందు ప్రకటించాడు. ఆ ప్రమాణంతో పెళ్లికూతురు ముఖంలో కాసింత చిరునవ్వు కనిపించింది. పెళ్లి సమయంలో సూట్లో ఉండాలన్న వధువు కోరికకు తగ్గట్టుగానే మేకప్ అయిన ఆ పూజారి పెళ్లికొడుకు ఎట్టకేలకు పెళ్లి అయినందుకు తనతోటి పూజారులందరికీ ఘనంగా పార్టీ ఇవ్వడంతో పాటు ఓ సలహా కూడా ఇచ్చాడు. ‘‘మన వృత్తి ప్రభావం ఇంట్లో భార్యాబిడ్డలపై పడకుండా చూసుకోవాలి.. వారి ఎంజాయ్మెంట్కి మన పౌరోహిత్యం అడ్డురాకూడదు. లేదంటే మీకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టం..!’’ అంటూ నిట్టూర్చాడు. పౌరోహిత్యం పదవీ విరమణలేని ఉద్యోగం. ఎవరితో ఒక మాట పడకుండా గౌరవంగా భగవంతుని సేవలో గడపవచ్చు. పాశ్చాత్య పోకడలకు ఆకర్షితులవుతున్న అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు పూజారి వృత్తి చిన్నదిగా కనిపిస్తోంది. దానికితోడు సమాజం కూడా వీరిని చూసే దృష్టి అలాగే ఉంది. సినిమాల ప్రభావం కావొచ్చు.. పురోహితుడి జీవన విధానం కావొచ్చు.. వధువు పురోహిత వరుడ్ని కోరుకోవడం లేదు. ఇలాంటి ఆలోచన విధానంలో మార్పు రావాలి. సంపాదనాపరంగా ఎలాంటి సమస్యలు లేకున్నా.. సంపన్న పురోహితుడికి వరుడయ్యే భాగ్యం లేకపోవడంపై యావత్ బ్రాహ్మణులు ఘోషిస్తున్నమాట వాస్తవం. ఈ సమస్య నుంచి బయటపడటానికి మాలాంటివారు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికైనా అమ్మాయిలు, ఆమె తల్లిదండ్రులు పురోహిత వరుడిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం. - తణుకు రామకృష్ణ, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ -
కళ్యాణం
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు సంగతేమో గానీ.. అన్ని విధాలా యోగ్యులైన వధువు, వరుడుని వెతకడం కాస్త కష్టమైన పనే..! అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. ఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు, బంధువులు సంబంధాలు తెచ్చేవారు. కాలం మారింది. కాలంతో పోటీ పడుతూ బిజీగా మారారు. పెళ్లిళ్ల పేరయ్య పాత్ర మారింది. వారి స్థానంలో మ్యారేజ్ బ్యూరోలు ఆవిర్భవించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సంబంధాలు కుదుర్చుతున్నాయి. వధువైనా.. వరుడైనా ఏం చదివారు, ఏం చేస్తున్నారు, అభిరుచులు, అలవాట్లు, రంగు, ఎత్తు, వంశం ఇలా అన్ని విషయాలూ పూసగుచ్చినట్లు అందుబాటులో ఉంచుతున్నారు. నయా పెళ్లిళ్ల పేరయ్యలు మ్యారేజ్బ్యూరోలపై ప్రత్యేక కథనం.. - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్ పెళ్లి సంబంధాలు చూడడంలో.. కుదర్చడంలో పెళ్లిళ్ల పేరయ్యలు నానాతంటాలు పడేవారు. ఊరు, వాడ తిరి సంబంధాలు తెచ్చేవారు. జాతకాలు చూడడంతోపాటు అన్ని బాధ్యతలు చేసేవారు. పెళ్లి తంతూ ఆయన చేతుల మీదుగానే జరిగింది. కాలక్రమేణ వారి ప్రమేయం తగ్గిపోయింది. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు మ్యారేజ్ బ్రోకర్ల హవా కొనసాగింది. నూరు అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయాలనే సూక్తిని అక్షరాల పాటించారు. ఫలానా అమ్మాయి మంచిది.. అబ్బాయి మంచివాడు.. ప్రభుత్వ ఉద్యోగం.. బాగా డబ్బున్నవాళ్లు.. అంటూ చెప్పి పెళ్లి కుదిర్చేవారు. ఎక్కువగా వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న వారి నుంచి డబ్బుల కోసం కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చేవారు. 2000 సంవత్సరం తర్వాత బ్రోకర్లకు హవా తగ్గింది. రాష్ట్రంలో మ్యారేజ్ బ్యూరోలు వెలిశాయి. జిల్లా కేంద్రాలు మొదలుకుని చిన్న చిన్న పట్టణాల వరకూ అవి విస్తరించాయి. చాలావరకు నిజాయతీగా వ్యవహరిస్తూ వివాహ సంబంధాలు కుదుర్చుతున్నాయి. వధూవరుల విషయంలో పారదర్శఖత పాటిస్తున్నాయి. ఇదీ పాత్ర.. చాలామంది వధూవరుల కోసం మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. మ్యారేజ్ బ్యూరోలు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, వధువు, వరుడు జాతకాలు, కులం, గోత్రం, వ్యక్తిగతం, ఉద్యోగస్తుడైతే వేతనం స్లిప్, స్థిర, చరాస్తుల వివరాలు, ఎత్తు, రంగు, విద్యార్హత, వయసు తదితర వివరాలన్నీ సేకరిస్తాయి. ఒక వేళ రెండో వివాహం అయితే వారి నుంచి డిక్లరేషన్, విడాకులు తీసుకుంటే ధ్రువీకరణ పత్రం తీసుకుంటాయి. అమ్మాయి, అబ్బాయి పూర్తి వివరాలు ఇంటర్నెట్లో పొందుపరుస్తారు. ఎవరికైనా నచ్చితే మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తారు. జిల్లాలో 20 మ్యారేజ్ బ్యూరోలు జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌లలో సుమారు 20 వరకు మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్, కార్యాలయాలు నిర్వహిస్తున్న వారు కాకుండా ఇండ్ల నుంచే సంబంధాలు చేసే వారు కూడా 50 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. కుల సంఘాల వారిగా కూడా మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తున్నారు. పెండ్లిచూపులు బ్యూరోలోనే గతంలో పెళ్లి చూపులు అమ్మాయి ఇళ్లలో గానీ, బంధువుల ఇళ్లలో గానీ జరిగేవి. ప్రస్తుతం ఆ సంప్రదాయం చాలావరకు తగ్గింది. మ్యారేజ్బ్యూరోలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. సినిమా, షాపింగ్‌కు వెళ్లి వస్తున్నట్లుగా పెళ్లి చూపుల తంతు ముగుస్తోంది. వివాహం నిశ్చయమైతే గానీ చుట్టుపక్కల వారికి తెలియని విధంగా గోప్యంగా సాగిపోతున్నాయి. కొంతమంది అమ్మాయి నచ్చితే కులాంతర, కట్నం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు.. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు సంబంధాలు కుదిర్చినందుకు ఫీజు తీసుకుంటున్నారు. కానీ సంబంధాలు కుదర్చడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సంబంధాలు చూసేందుకు రూ.2 నుంచి రూ.5వేల వరకు రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకుంటున్నారు. నిజాయతీగా వ్యవహరిస్తున్నాం.. పెళ్లి అనేది నిండు నూరేళ్ల జీవితం. అందుకే వివాహం కుదుర్చడంలో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ తేడా వచ్చినా రెండు కుటుంబాలు నష్టపోతాయి. అందుకే ముందుగానే అన్ని వివరాలు తీసుకుని ఇరువర్గాలు అంగీకరిస్తేనే పెళ్లిచూపులు మా ఆఫీసులోనే ఏర్పాటు చేస్తాం. మ్యారేజ్‌బ్యూరోల ద్వారా ఎంతోమంది ఒక్కటయ్యారు. - రాజుయాదవ్, లేఖ మ్యారేజ్ కన్సల్టెన్సీ, మంచిర్యాల మ్యారేజ్ బ్యూరోతోనే ఏకమయ్యాం మ్యారేజ్ బ్యూరో ద్వారానే మా వివాహం జరిగింది. తొలుత చాలా చోట్ల అమ్మాయిలను చూసాను. ఎక్కడా నచ్చలేదు. చివరకు మ్యారేజ్‌బ్యూరోను ఆశ్రయించగా మంచిర్యాల సమీపంలోని హమ్రాజ్ గ్రామానికి చెందిన అమ్మాయి నచ్చగానే పెండ్లి చేసుకున్నాను. - పసుపునూటీ శ్రీనివాస్, ఎన్టీపీసీ, గోదావరిఖని ఈ విధానాన్ని నమ్మవచ్చు మ్యారేజ్ బ్యూరోలను నమ్మవచ్చు. మంచి అమ్మాయి కావాలని కోరుకున్నాను. ఓ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు బ్యూరోను ఆశ్రయించాను. నిజామాబాద్‌కు చెందిన అరుణ నచ్చింది. యేడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాను. - రమేశ్, ప్రైవేట్ నర్సింగ్‌హోం పర్యవేక్షకుడు, మందమర్రి తొలిచూపులోనే ఓకే చేశా ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అన్నట్లు. తొలిచూపులోనే ఆదిలాబాద్‌కు చెందిన క్రాంతిప్రభ అమ్మాయి నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. ఇంకేముంది పెళ్లి భాజాలు మోగాయి. ఇద్దరం ఏకమయ్యాము. ఆ క్రెడిట్ అంతా మ్యారేజ్ బ్యూరోదే. ఎందుకంటే ఎక్కడ సంబంధాలు చూసిన కుదరలేదు. - యశ్వంత్, ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి, మంచిర్యాల