కళ్యాణం | marriages are fixed in marriage bureaus | Sakshi
Sakshi News home page

కళ్యాణం

Published Sun, Feb 2 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

marriages are fixed in marriage bureaus

 ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు సంగతేమో గానీ.. అన్ని విధాలా యోగ్యులైన వధువు, వరుడుని వెతకడం కాస్త కష్టమైన పనే..! అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు.


  ఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు, బంధువులు  సంబంధాలు తెచ్చేవారు. కాలం మారింది. కాలంతో పోటీ పడుతూ బిజీగా మారారు. పెళ్లిళ్ల పేరయ్య పాత్ర మారింది. వారి స్థానంలో మ్యారేజ్ బ్యూరోలు ఆవిర్భవించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సంబంధాలు కుదుర్చుతున్నాయి. వధువైనా.. వరుడైనా ఏం చదివారు, ఏం చేస్తున్నారు, అభిరుచులు, అలవాట్లు, రంగు, ఎత్తు, వంశం ఇలా అన్ని విషయాలూ పూసగుచ్చినట్లు అందుబాటులో ఉంచుతున్నారు. నయా పెళ్లిళ్ల పేరయ్యలు మ్యారేజ్‌బ్యూరోలపై ప్రత్యేక కథనం..                   - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్
 
  పెళ్లి సంబంధాలు చూడడంలో.. కుదర్చడంలో పెళ్లిళ్ల పేరయ్యలు నానాతంటాలు పడేవారు. ఊరు, వాడ తిరి సంబంధాలు తెచ్చేవారు. జాతకాలు చూడడంతోపాటు అన్ని బాధ్యతలు చేసేవారు. పెళ్లి తంతూ ఆయన చేతుల మీదుగానే జరిగింది. కాలక్రమేణ వారి ప్రమేయం తగ్గిపోయింది. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు మ్యారేజ్ బ్రోకర్ల హవా కొనసాగింది. నూరు అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయాలనే సూక్తిని అక్షరాల పాటించారు. ఫలానా అమ్మాయి మంచిది.. అబ్బాయి మంచివాడు.. ప్రభుత్వ ఉద్యోగం.. బాగా డబ్బున్నవాళ్లు.. అంటూ చెప్పి పెళ్లి కుదిర్చేవారు. ఎక్కువగా వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న వారి నుంచి డబ్బుల కోసం కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చేవారు. 2000 సంవత్సరం తర్వాత బ్రోకర్లకు హవా తగ్గింది. రాష్ట్రంలో మ్యారేజ్ బ్యూరోలు వెలిశాయి. జిల్లా కేంద్రాలు మొదలుకుని చిన్న చిన్న పట్టణాల వరకూ అవి విస్తరించాయి. చాలావరకు నిజాయతీగా వ్యవహరిస్తూ వివాహ సంబంధాలు కుదుర్చుతున్నాయి. వధూవరుల విషయంలో పారదర్శఖత పాటిస్తున్నాయి.
 
 ఇదీ పాత్ర..
 చాలామంది వధూవరుల కోసం మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. మ్యారేజ్ బ్యూరోలు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, వధువు, వరుడు జాతకాలు, కులం, గోత్రం, వ్యక్తిగతం, ఉద్యోగస్తుడైతే వేతనం స్లిప్, స్థిర, చరాస్తుల వివరాలు, ఎత్తు, రంగు, విద్యార్హత, వయసు తదితర వివరాలన్నీ సేకరిస్తాయి. ఒక వేళ రెండో వివాహం అయితే వారి నుంచి డిక్లరేషన్, విడాకులు తీసుకుంటే ధ్రువీకరణ పత్రం తీసుకుంటాయి. అమ్మాయి, అబ్బాయి పూర్తి వివరాలు ఇంటర్‌నెట్‌లో పొందుపరుస్తారు. ఎవరికైనా నచ్చితే మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తారు.
 
 జిల్లాలో 20 మ్యారేజ్ బ్యూరోలు
 జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌లలో సుమారు 20 వరకు మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్, కార్యాలయాలు నిర్వహిస్తున్న వారు కాకుండా ఇండ్ల నుంచే సంబంధాలు చేసే వారు కూడా 50 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. కుల సంఘాల వారిగా కూడా మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తున్నారు.
 
 పెండ్లిచూపులు బ్యూరోలోనే
 గతంలో పెళ్లి చూపులు అమ్మాయి ఇళ్లలో గానీ, బంధువుల ఇళ్లలో గానీ జరిగేవి. ప్రస్తుతం ఆ సంప్రదాయం చాలావరకు తగ్గింది. మ్యారేజ్‌బ్యూరోలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. సినిమా, షాపింగ్‌కు వెళ్లి వస్తున్నట్లుగా పెళ్లి చూపుల తంతు ముగుస్తోంది. వివాహం నిశ్చయమైతే గానీ చుట్టుపక్కల వారికి తెలియని విధంగా గోప్యంగా సాగిపోతున్నాయి. కొంతమంది అమ్మాయి నచ్చితే కులాంతర, కట్నం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు.
 
 రిజిస్ట్రేషన్ ఫీజు..
 మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు సంబంధాలు కుదిర్చినందుకు ఫీజు తీసుకుంటున్నారు. కానీ సంబంధాలు కుదర్చడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సంబంధాలు చూసేందుకు రూ.2 నుంచి రూ.5వేల వరకు రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకుంటున్నారు.
 
 నిజాయతీగా వ్యవహరిస్తున్నాం..
 పెళ్లి అనేది నిండు నూరేళ్ల జీవితం. అందుకే వివాహం కుదుర్చడంలో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ తేడా వచ్చినా రెండు కుటుంబాలు నష్టపోతాయి. అందుకే ముందుగానే అన్ని వివరాలు తీసుకుని ఇరువర్గాలు అంగీకరిస్తేనే పెళ్లిచూపులు మా ఆఫీసులోనే ఏర్పాటు చేస్తాం. మ్యారేజ్‌బ్యూరోల ద్వారా ఎంతోమంది ఒక్కటయ్యారు.
 - రాజుయాదవ్, లేఖ మ్యారేజ్ కన్సల్టెన్సీ, మంచిర్యాల
 
 మ్యారేజ్ బ్యూరోతోనే ఏకమయ్యాం
 మ్యారేజ్ బ్యూరో ద్వారానే మా వివాహం జరిగింది. తొలుత చాలా చోట్ల అమ్మాయిలను చూసాను. ఎక్కడా నచ్చలేదు. చివరకు మ్యారేజ్‌బ్యూరోను ఆశ్రయించగా మంచిర్యాల సమీపంలోని హమ్‌రాజ్ గ్రామానికి చెందిన అమ్మాయి నచ్చగానే పెండ్లి చేసుకున్నాను.
 - పసుపునూటీ శ్రీనివాస్, ఎన్‌టీపీసీ, గోదావరిఖని
 ఈ విధానాన్ని నమ్మవచ్చు
 మ్యారేజ్ బ్యూరోలను నమ్మవచ్చు. మంచి అమ్మాయి కావాలని కోరుకున్నాను. ఓ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు బ్యూరోను ఆశ్రయించాను. నిజామాబాద్‌కు చెందిన అరుణ నచ్చింది. యేడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాను.
 
 - రమేశ్, ప్రైవేట్ నర్సింగ్‌హోం పర్యవేక్షకుడు, మందమర్రి
 
 తొలిచూపులోనే ఓకే చేశా
 ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అన్నట్లు. తొలిచూపులోనే ఆదిలాబాద్‌కు చెందిన క్రాంతిప్రభ అమ్మాయి నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. ఇంకేముంది పెళ్లి భాజాలు మోగాయి. ఇద్దరం ఏకమయ్యాము. ఆ క్రెడిట్ అంతా మ్యారేజ్ బ్యూరోదే. ఎందుకంటే ఎక్కడ సంబంధాలు చూసిన కుదరలేదు.
  - యశ్వంత్, ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి, మంచిర్యాల
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement