పెళ్లికి ముందురోజు వరుడు ఫేషియల్ చేయించుకుంటానని బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఫోను చేసేందుకు ప్రయత్నించగా స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. విషయం వధువు తరపువారికి తెలియడంతో నానా హంగామా జరిగింది. అనంతరం వధువు తరపువారు వరుని తండ్రి నుంచి కట్నం డబ్బులను తిరిగి తీసుకోవడంతోపాటు పెళ్లిని రద్దు చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు వరుడు ఫేషియల్ చేయించుకుంటాననే నెపంతో బయటకు వెళ్లి ఇక తిరిగి రాలేదు. తరువాత ఈ వ్యవహారం వివాహం రద్దు చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఉదంతం బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకునికి వివాహం నిశ్చయమయ్యింది.
జూన్ ఆరున వరుడిని పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం జరిగింది. జూన్ 11 వివాహ వేడుకలో భాగంగా కుషీనగర్ జిల్లాలోని ఫాజిలా నగర్ పరిధిలోని ఒక గ్రామానికి వరునితో పాటు అతని బంధువర్గమంతా చేరుకోవాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. బ్యాండు మేళం వారు కూడా వచ్చేశారు. ఇంతలో వరుడు ఫేషియల్ చేయించుకుంటానని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ వరుడు రాకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలయ్యింది. ఎన్నిచోట్ల వెదికినా అతని ఆచూకీ తెలియలేదు.
చిన్న కుమారునితో వివాహం చేయిస్తామన్నా...
ఈ విషయం వధువు ఇంటిలోని వారికి తెలిసింది. వారు పరుగుపరుగున వరుని ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం తరువాత వరుని తండ్రి వధువు తరపువారితో తన చిన్న కుమారునితో ఈ వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఇది వధువు తరపువారికి ఎంతమాత్రం నచ్చలేదు. తాము ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని చెబుతూ తాము ఇచ్చిన కట్నం సొమ్ముతోపాటు కానుకలను కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనిపై గ్రామంలో పంచాయితీ జరిగింది. పంచాయతీ పెద్దల తీర్మానం మేరకు వరుని తరపు వారు తాము తీసుకున్న కట్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ పెళ్లి రద్దయ్యింది. కాగా వరుడు ఒక ఫుడ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వేరే యువతితో సంబంధం ఉన్న కారణంగానే పెళ్లి వేడుక ముందురోజు ఇంటి నుంచి పరారయ్యాడని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి..
Comments
Please login to add a commentAdd a comment