పెళ్లికాని పూజారులు!
పూజారులు.. పురోహితులు.. అయ్యవారు.. పేరు ఏదైనా హిందూ సంప్రదాయంలో వీరు లేకుండా శుభకార్యాలను ఊహించడం కష్టమే. వివాహం.. గృహప్రవేశం.. యాగాలు.. హోమాలు.. ఇలా ఏది జరిగినా వీరు కచ్చితంగా ఉండాల్సిందే. అంతటి ప్రాముఖ్యత కలిగిన బ్రాహ్మణులను ఇప్పుడు ఓ సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే వివాహం. వందల పెళ్లిళ్లు చేసే పురోహితుడికే వివాహ యోగం కరువవుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా.. సమస్య తీవ్రత రోజురోజుకీ పెద్దదవుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరించిన యువకుడికి వరుడయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. నిత్యం కొన్ని వేల పెళ్లి సంబంధాలను సేకరించే మ్యాట్రిమోనీలు కూడా పూజారుల నుంచి ప్రొఫైల్స్‌ను స్వీకరించడంలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘నాకు కాబోయే భర్త పూజారి...’ అనే మాటను వధువు అంగీకరించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు ఈ పెళ్లికాని పూజారులు. పురోహితుడి వృత్తి పట్ల ప్రజలకు గౌరవం తగ్గడం మరో కారణమంటున్నారు వేద పండితులు. కారణాలు ఏవైనా పెళ్లికాని పూజారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద నష్టాన్నే ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన చెందుతోన్న బ్రాహ్మణుల ఆవేదనపై స్పెషల్ ఫోకస్..
సాక్షి, హైదరాబాద్
‘‘ఈ నెల 10న కూకట్‌పల్లి ప్రాంతంలో బ్రహ్మణ వధూవరుల నగర సంఘం పరిచయ వేదికను కేవలం పూజారులు, పురోహితుల కోసం ఏర్పాటు చేశారు. అక్కడికి 65 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు వచ్చారు. ఆ 65 మందిలో నలభైకి దగ్గరగా ఉన్నవారు ఓ ముప్పైమంది ఉన్నారు. వారిలో నలభై దాటినవారూ ఉన్నారు. ఎప్పటి నుంచో వధువు కావాలంటూ మ్యారేజీ బ్యూరోల చుట్టూ తిరుగుతున్న వాళ్లే వీరంతా. ఇక అమ్మాయిల విషయానికొస్తే వారి మొదటి చాయిస్ ఇతర వృత్తుల్లో ఉన్నవారికే’’
‘‘గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన వివాహ పరిచయ వేదికలో 103 మంది పుజారులు.. వధువు కావాలని వస్తే 14 మంది మాత్రమే యువతులు వచ్చారు. అమ్మాయిల్లో ఐదుగురు రెండోపెళ్లివారు. మిగిలినవారికి కూడా మొదటి చాయిస్ ఉద్యోగస్తులే’’
‘‘ఏడాది క్రితం చిక్కడపల్లి పంచముఖ ఆంజనేయస్వామి గుడిలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి వధువు కావాలంటూ 160 మంది అబ్బాయిలు వస్తే.. 20 మంది మాత్రమే అమ్మాయిలు వచ్చారు. వారిలో పూజారులను భర్తగా అంగీకరించింది ముగ్గురు అమ్మాయిలే’’
మారుతున్న అమ్మాయిల అభిరుచులకు.. వివాహం కోసం పూజారులు పడుతున్న ఇబ్బందులకు.. అద్దం పడుతున్నాయి ఈ ఘటనలు. ఇవనే కాదు.. ఈ మధ్యకాలంలో జరిగిన చాలా వివాహ పరిచయ వేదికల్లోనూ ఇదే పరిస్థితి. పూర్వం ఒకరిద్దరు అమ్మాయిలకే పురోహితుడంటే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకరిద్దరు కూడా పురోహితుడ్ని ఇష్టపడే పరిస్థితి లేదు. అమ్మాయిలందరూ చదువుకుని, ఉద్యోగం చేసే అబ్బాయినే భర్తగా పొందడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం అమ్మాయిలు మంచి చదువులు చదువుకోవడం, ఉద్యోగాల్లో స్థిరపడడం, ఆధునిక జీవనానికి అలవాటుపడడమే. ఇది కేవలం వధువు కోరికే కాదు.. ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆఖరికి పురోహితుడుగా పనిచేస్తున్న తండ్రులు కూడా తన కూతురిని ఉద్యోగస్తుడికి ఇవ్వడానికే ఇష్టపడుతున్నారు.
కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ గుడిలో పూజారిగా పనిచేస్తున్న అరవై ఏళ్ల విశ్వేశ్వరశర్మ(పేరు మార్చాం) మాటల్లో చెప్పాలంటే.. ‘‘నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి బీటెక్ పూర్తి చేసింది. రెండేళ్లక్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికిచ్చి పెళ్లి చేశాను. చిన్నమ్మాయి ఎంబీఏ పూర్తి చేసింది. సంబంధాలు చూస్తున్నాను. నా బంధువుల్లోనే పురోహితులుగా పనిచేస్తున్నవారు చాలామంది మా అమ్మాయిని చేసుకుంటామని అడుగుతున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. పురోహితుడిగా నేను పడ్డ కష్టాలు.. సమాజంలో ఎదుర్కొన్న అవమానాలు నా పిల్లలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఉద్యోగికిచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను’’ అని చెప్పారు. ఓ వధువు తండ్రిగా ఆయన చెప్పిన మాటలనే మిగతా తండ్రులు కూడా తు.చ. తప్పకుండా పాటించడమే ఈ సమస్యకు ప్రధాన కారణం.
దరఖాస్తులు స్వీకరించని మ్యాట్రిమోనీలు
పురోహితుల నుంచి వధువు కావాలంటూ వివాహ పరిచయ వేదికల వద్దకు వచ్చే దరఖాస్తులను ఆయా కంపెనీలు స్వీకరించడం లేదు. అదేంటని తెలుగు మ్యాట్రిమోనీలో పనిచేస్తున్న సీనియర్ అధికారి లక్ష్మిని అడిగితే.. ‘‘పురోహితుడు అనే పేరు వినపడగానే ఆ కులం అమ్మాయిలు ఆసక్తి చూపడం లేదు. అమ్మాయిలనే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా. మేం గత రెండేళ్ల నుంచి వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం లేదు. డబ్బులు వస్తాయి కదా! అని దరఖాస్తు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతకంటే పాపం ఏముంటుంది చెప్పండి. ఎవరూ పిల్లనివ్వరని తెలిసి కూడా వారి దరఖాస్తులు స్వీకరించడం తప్పని మేం వెంటనే తిరస్కరిస్తున్నాం. కావాలంటే వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టుకోమని చెబుతున్నాం’’ అని చెప్పారు.
ఆ చిన్నచూపు కారణంగా..
పురోహితుల పట్ల ప్రజల్లో ఉన్న చిన్నచూపే అమ్మాయిల మనసు మార్చేస్తోందని అంటున్నారు 30 ఏళ్ల నుంచి బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్న కల్వకొలను శ్రీనివాస్. సమాజంలో మిగతా వృత్తులకున్న గౌరవం, హోదా పూజారులకు ఉండకపోవడం, చిన్నచూపు కారణంగా ఈ పెద్ద నష్టాన్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్. ఇక లాభం లేదని ఈయనిచ్చిన కౌన్సెలింగ్‌తో ఓ పూజారిని పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమ్మాయితో మిగతా అమ్మాయిలకు కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తున్నారు. అయితే మార్పు పూజారులను ఇష్టపడని అమ్మాయిల్లో మాత్రమే కాదు మొత్తం సమాజంలో రావాలని కోరుకుంటున్నారు. ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిణ్ మ్యాట్రిమోనియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫ్ ఇండియా సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ పురోహితుల్ని పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు వెళ్లి పరిచయ వేదిక పేరుతో కౌన్సెలింగ్ ద్వారా వివరిస్తున్నారు.
మా తర్వాత తరం ఉండదు..
నగరంలోని మల్కాజిగిరి, చిక్కడపల్లి వంటి సెంటర్లలో రోజూ ఉదయం సమయంలో కనిపించే అడ్డా పూజారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ‘‘చేతి నిండా పని.. జేబు నిండా సొమ్ములున్న పూజారులకే పిల్లనివ్వడం లేదు. ఇక మాలాంటివారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది’’ అని అంటున్నారు. విఘ్నేశ్వర శర్మ(పేరు మార్చాం) అనే 43 ఏళ్ల బ్రహ్మచారి పూజారి. ‘‘మొన్నీ మధ్యే మా స్నేహితుడు పిల్ల దొరక్క ఇతర కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా వృత్తికి దూరం అవ్వాల్సి వచ్చింది. అప్పటివరకూ పూజలకు, పురస్కారాలకు పిలిచేవారంతా ‘శూద్రపిల్లని కట్టుకున్న అతను పూజారేంటి..?’ అంటూ దూరం పెట్టారు. దాంతో చేసేది లేక ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నానాపాట్లు పడుతున్నాడు పాపం’’ అంటూ అడ్డామీదున్న ఓ యువ పూజారి కడుపుచించుకున్నాడు. ‘‘ఇలాగే మాకు పెళ్లిళ్లు కాకుండా ఉంటే మా తర్వాతి తరం ఉండదు. దీని ప్రభావం భవిష్యత్తుపై చాలా భయంకరంగా ఉంటుంది. క్యాసెట్లతో పెళ్లిళ్లు, పూజలు చేసుకునే పరిస్థితి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మరో పెళ్లికాని పూజారి.
హైటెక్ పూజారులు వేరు..
నగరంలో కొందరు యువకులు ఒకవైపు తమ ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు పూజలకు, పెళ్లిళ్లకు పురోహితులుగా పనిచేస్తున్నారు. సమయానుకూలంగా వేషం మారుస్తూ పూజలకు సంబంధించి హైటెక్ నగరంలో ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్లను సైతం నడుపుతున్న ఈ పూజారులు పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనడం లేదు. కారణం.. ఒక్క పూజల సమయంలో తప్ప మిగతా వేళల్లో నలుగురిలో ఒకడిగా కలసి బతకడమే అంటున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ పూజలకు, వ్రతాలకు హాజరయ్యే ఓ యువ పూజారి. ‘‘సంభావనల రేటు బాగా పెరిగింది. మూడు పూజలు, నాలుగు వ్రతాలు చేస్తే నేను నెలంతా ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుకన్నా ఎక్కువే వస్తుంది. అలాంటప్పుడు నేను కష్టపడి నేర్చుకున్న వేద విద్యని ఎందుకు పక్కన పెట్టాలి చెప్పండి?’ అని ప్రశ్నిస్తున్నాడు మూర్తి అనే హైటెక్ పూజారి. పూజారి ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించే పిలకకు దూరంగా ఉండడం వీరి ప్రత్యేకత. ఒక సంచి, ధోవతి, కండువాతో పాటు మరో బ్యాగ్‌లో టీషర్టు, జీన్స్‌ప్యాంటు వెంట బెట్టుకునే ఈ హైటెక్ పూజారులకు మంచి గిరాకీనే ఉంది. అంతేకాదు.. ఇంకొందరు సాఫ్ట్‌వేర్ పూజారులు మరో నాలుగు అడుగులు ముందుకేసి ఆన్‌లైన్ పూజలు కూడా చేస్తున్నారు. వెబ్‌క్యామ్ సాయంతో విదేశాల్లో తెలుగువారికి పూజలు, వ్రతాలు చేస్తూ చేతినిండా డాలర్లు సంపాదిస్తున్నారు ఈ హైటెక్ పూజారులు.
పూజారి భార్యగానా..?
ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన లలిత(పేరు మార్చాం) అనే డిగ్రీ చదివిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. లలిత అన్నయ్య పురోహితుడు. ఇప్పటివరకూ ఒక్క పెళ్లి సంబంధం కూడా రాలేదు. ఎదురు కట్నం ఇస్తామన్నా లాభం లేకపోయింది. ఆ అబ్బాయి పెళ్లి గురించి చూస్తుంటే అమ్మాయికి పెళ్లి వయసు దాటిపోతోందని ఆమెకు సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నావని లలితను ప్రశ్నిస్తే.. ‘‘నేను ఈ మధ్యనే డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం జాబ్ ట్రయిల్స్‌లో ఉన్నాను. ఏదో ఒక ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెద్ద జీతగాడు కాకపోయినా ఉద్యోగస్తుడు అయితే చాలు. ఎందుకంటే నాకు జాబ్ చేయాలంటే ఇష్టం. ఇప్పటికే పూజారి పెళ్లికొడుకుల సంబంధాలు చాలా వచ్చాయి. నేను చేసుకోనని చెప్పాను. కారణం.. ఈ వృత్తి పట్ల గౌరవం లేకపోవడం అని కాదు.. పూజారి భార్యగా బోలెడన్ని నియమాలు, నిష్టలు పాటించాలి. రేపు పుట్టే పిల్లల జీవితంపై ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడున్న ఫాస్ట్‌లైఫ్‌కి దూరంగా ఇంకా పాతపద్ధతుల్లో ఇంటికే పరిమితమై మడి, ఆచారం అంటే నా వల్ల కాదు’’ అంటూ తన మనసులోనిమాట చెప్పింది లలిత.
పేరు: రామ్మూర్తి శర్మ
(పేరు మార్చాం).
వయసు: 42 ఏళ్లు.
ఎత్తు: 5.9 అడుగులు.
వృత్తి: పురోహితుడు.
సంపాదన: (నెలకు) లక్ష రూపాయలు. సొంతిళ్లు, కారు ఉన్నాయి.
వరుడు ప్రొఫైల్ అంతా బాగానే ఉంది కానీ, పురోహితుడు అనే మాటే నచ్చడం లేదు అమ్మాయికి. వధువు కోసం ఎక్కని గుమ్మం లేదు. చివరికి ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అయినా లాభం లేకపోయింది. కొడుక్కి వివాహయోగం ఇంకెన్నాళ్లకో అంటూ బెంగపడ్డారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితి ఈ ఒక్క పురోహితుడిదే కాదు.. అందరిదీ. ఈ సమస్యకి సంబంధించి ఈ మధ్యకాలంలో కేవలం పురోహితుల కోసం ఏర్పాటు చేసిన కొన్ని వివాహ పరిచయ వేదికలకు సంబంధించిన రిపోర్టుని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి.
తల్లిదండ్రుల పాత్ర పెద్దది
డాక్టర్ చదివిన అమ్మాయికి డాక్టర్ చదివిన అబ్బాయి భర్త అయితే బాగుంటుందని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్.. ఒకే వృత్తిలో ఉన్నవారు దంపతులయితే బాగుంటుందని ఎంతో కష్టపడి సంబంధాలు వెతుకుతారు. పౌరోహిత్యం దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రుల లెక్కలు మారిపోతున్నాయి. ఈ వృత్తి ఎంతో గొప్పగా చెప్పాల్సిన పురోహితుడే తన కూతుర్ని ఒక సాఫ్ట్‌వేర్ చేతిలో.. ఓ డాక్టర్ చేతిలో పెట్టాలనుకోవడం దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. నిజానికి ఇంతకన్నా గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన ఉద్యోగం మరొకటి ఉండదు. ఇప్పటికే ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు క్యాసెట్లు పెట్టుకుని చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా అమ్మాయిలు ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో గుళ్లో మంత్రాలు చదవడానికి, పందిట్లో పెళ్లి చేయడానికి పురోహితుడు కరువవుతాడు.
- కొప్పరపు బలరామకృష్ణమూర్తి, అధ్యక్షుడు, అఖిల భారత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రముల సమాఖ్య
ఆహార్యమే సమస్యా?
వెతగ్గా వెతగ్గా ఓ పూజారికి పెళ్లి కుదిరింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక అమ్మాయికి పూజారి సంబంధం కుదుర్చుకున్నారు ఆ తల్లిదండ్రులు. పెళ్లి ఖర్చులన్నీ ఆ పెళ్లికొడుకువేనని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే పదివేలనుకున్న పెళ్లికొడుకు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తాంబూలాల సమయంలో ముప్పైవేల ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్‌ని బహుమతిగా ఇచ్చాడు. దాంతో సరిపెట్టకుండా ‘‘నేను పేరుకే పూజారిని కానీ నీకు నచ్చినట్టుగానే ఉండొచ్చని’’ పది మంది ముందు ప్రకటించాడు. ఆ ప్రమాణంతో పెళ్లికూతురు ముఖంలో కాసింత చిరునవ్వు కనిపించింది. పెళ్లి సమయంలో సూట్‌లో ఉండాలన్న వధువు కోరికకు తగ్గట్టుగానే మేకప్ అయిన ఆ పూజారి పెళ్లికొడుకు ఎట్టకేలకు పెళ్లి అయినందుకు తనతోటి పూజారులందరికీ ఘనంగా పార్టీ ఇవ్వడంతో పాటు ఓ సలహా కూడా ఇచ్చాడు. ‘‘మన వృత్తి ప్రభావం ఇంట్లో భార్యాబిడ్డలపై పడకుండా చూసుకోవాలి.. వారి ఎంజాయ్‌మెంట్‌కి మన పౌరోహిత్యం అడ్డురాకూడదు. లేదంటే మీకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టం..!’’ అంటూ నిట్టూర్చాడు.
పౌరోహిత్యం పదవీ విరమణలేని ఉద్యోగం. ఎవరితో ఒక మాట పడకుండా గౌరవంగా భగవంతుని సేవలో గడపవచ్చు. పాశ్చాత్య పోకడలకు ఆకర్షితులవుతున్న అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు పూజారి వృత్తి చిన్నదిగా కనిపిస్తోంది. దానికితోడు సమాజం కూడా వీరిని చూసే దృష్టి అలాగే ఉంది. సినిమాల ప్రభావం కావొచ్చు.. పురోహితుడి జీవన విధానం కావొచ్చు.. వధువు పురోహిత వరుడ్ని కోరుకోవడం లేదు. ఇలాంటి ఆలోచన విధానంలో మార్పు రావాలి. సంపాదనాపరంగా ఎలాంటి సమస్యలు లేకున్నా.. సంపన్న పురోహితుడికి వరుడయ్యే భాగ్యం లేకపోవడంపై యావత్ బ్రాహ్మణులు ఘోషిస్తున్నమాట వాస్తవం. ఈ సమస్య నుంచి బయటపడటానికి మాలాంటివారు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికైనా అమ్మాయిలు, ఆమె తల్లిదండ్రులు పురోహిత వరుడిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం.
- తణుకు రామకృష్ణ, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ